-అమ్మకానికి తరలిస్తున్న రామచిలుకలను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది
-నెహ్రూ జూపార్క్ లో పెంచేందుకు పంపించిన పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్
చూడచక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విశ్వనీయంగా అందిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు పది రామచిలుకను ద్వి చక్ర వాహనంపై తరలిస్తుండగా అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ పట్టుకుంది. షాద్ నగర్ లో వీటిని కొని, హైదరాబాద్ తరలిస్తుండగా ఆరామ్ ఘర్ దగ్గర అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్ ల నుంచి అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. వైల్డ్ లైఫ్ చట్టం – 1972 ప్రకారం ఈ రకమైన రామచిలుకలను వేటాడటం, వెంట ఉంచుకోవటం నేరమని పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు.
విచారణలో తాము వీటిని 25 వేల రూపాయలకు అమ్మేందుకు తరలిస్తున్నామని ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈ రకమైన వ్యాపారం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న చిలుక పిల్లలను నెహ్రూ జూ పార్క్ కు తరలించి సంరక్షించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, హైదరాబాద్, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శంషాబాద్, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.