ఏం.. ? బాహుబలి సినిమాలో మాత్రమే, రమ్యకృష్ణ బుడ్డోడిని నీళ్ల మధ్యలో నుంచి చేయి పైకి లేపి పట్టుకుంటారా? ఇక్కడ మాకూ బాహుబలి ఉన్నారు బాబూ… కాకపోతే సరైన సమయంలోనే వాళ్లు తెరపైకొస్తారు. బాహుబలి సిన్మాలో నది మధ్యలో నిలబడి రమ్యకృష్ణ బుడ్డోడిని పైకి లేపితే.. మన
తెలంగాణ మంథనిలో, వరదలో నడిచి మరీ బుడ్డోడిని తలమీద పెట్టుకుని ఊరు దాటారు. కాబట్టి ఎవరు గ్రేట్? ఆ మాటకొస్తే తెలంగాణ మారు మూల గ్రామాల్లో.. విలేజికి వందమంది బాహుబలులున్నారు తెలుసా? ఇది అక్కడ రోడ్లేయని గవర్నమెంటు గొప్పతనం కావచ్చు. సర్కారు ఎలాగూ పట్టించుకోదు కాబట్టి, తామే బాహుబలిగా మారిన సామాన్యుడి గొప్పతనమూ కావచ్చు. సో.. రాజమౌళి మాత్రమే కాదు. తెలంగాణలోని సామాన్యుడూ బాహుబలే మిత్రమా!
ఇదంతా ఏందనుకుంటున్నారా.. అసలేమీ అర్ధం కావడం లేదా.. ఓకే. ఓకే.. ఓసారి ఈ మంథని బాహుబలి కథని వినేయండి మరి.
రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా ఎంతగా ఘనవిజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అందులో శివగామి ఓ వాగులో కొట్టుకుపోతూ ఒంటిచేత్తో చంటిబిడ్డను పైకి పట్టుకున్న సీన్ థియేటర్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటుచేసుకుంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. వర్షాల వల్ల వరదపోటు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే మర్రివాడకు వరద ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం అష్టకష్టాలు పడింది. చంటిబిడ్డతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న దృశ్యాలు బాహుబలి సినిమాలోని సీన్‌ను తలపించింది. ఓ వ్యక్తి కుటుంబంతో కలసి 3 నెలల చిన్నారిని పెద్ద టబ్‌లో ఉంచి తలపై పెట్టుకుని వరద నీటిది దాటుకుని వెళ్లాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ దృశ్యం అద్దం పడుతోంది.
మరోవైపు వరద నీరు చుట్టుముట్టడంతో మంథని పట్టణంలో 12 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోదావరి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామి ఆలయంలో చుట్టూ వరద నీరు చేరింది. అక్కడ సుమారు 20 మంది చిక్కుకుపోయినట్టు తెలియడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మంథని మండలంలోని వివిధ గ్రామాలలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని బోట్ల ద్వారా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.