– చంద్రబాబు అరెస్టుపై మనోవేదనతో చనిపోయిన కుటుంబాలకు అండగా భువనేశ్వరి పర్యటనలు
– ఇప్పటికి వరకు 149 బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం
– 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,092 కిలోమీటర్ల మేర భువనేశ్వరి పర్యటన
– చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చంద్రగిరిలో మొదలైన నిజం గెలవాలి కార్యక్రమం
– బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ….భరోసా నిస్తూ భువనేశ్వరి పర్యటనలు
– ఆయా ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు, చేనేతలతో సమావేశాలు, కార్యక్రమాలు
– హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ మీటింగ్ లు ఉండడంతో నిజం గెలవాలి కార్యక్రమానికి ఒక వారం విరామం..వచ్చే వారం నుంచి మళ్లీ పర్యటన
అమరావతి: నిజం గెలవాలి పేరుతో గత ఏడాది అక్టోబర్ నుంచి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అనంతరం ఆయనను 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అనేక మంది కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయారు.
చంద్రబాబు అరెస్టుపై ఆవేదనతో ప్రాణాలు కోల్పోయిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానుల కుటుంబాలకు పార్టీ అండగా ఉండాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా చంద్రబాబు సూచనల మేరకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేశారు. ఇంటి పెద్ద మృతితో అనాధలైన ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలోనే నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
అక్టోబర్ 25 తేదీన చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే భువనేశ్వరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో రెండు బాధిత కుటుంబాలను పరామర్శించి నిజం గెలవాలి సభలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలను చైతన్య పరిచేలా….ప్రభుత్వ కుట్రలను ప్రశ్నిస్తూ భువనేశ్వరి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు.
అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8 బాధిత కుటుంబాలను పరిమర్శించారు. తదుపరి విజయనగరం జిల్లాలో బాధిత కుటుంబాల పరామర్శకు భువనేశ్వరి బయలుదేరిన సమయంలో చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆమె నిజం గెలవాలి కార్యక్రమానికి విరామం ఇచ్చారు. చంద్రబాబు విడుదల అనంతరం యధావిధిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మొదలయ్యాయి.
అటు లోకేష్ యువగళం ప్రారంభించగా…ఇటు చంద్రబాబు కూడా జిల్లాల్లో పర్యటనలు చేశారు. దీంతో మళ్లీ బాధిత కుటుంబాల పరామర్శ కార్యక్రమాన్ని భువనేశ్వరి కొనసాగించాలని నిర్ణయించారు. జనవరి 3వ తేదీ నుంచి మళ్లీ నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రారంభిచారు. జనవరి 3, 4,5 తేదీల్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం, బొబ్బొలి, ఎచ్చెర్ల, పాలకొండ, ఆముదాల వలస, విశాఖ పట్నం నార్త్, సౌత్, గాజువాక అసెంబ్లీ ల పరిధిలో 15 బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ప్రతి వారంలో 4 రోజుల పాటు ఆమె పర్యటనల్లో ఉంటున్నారు.
ప్రతి బాధిత కార్యకర్త కుటుంబాన్ని పలకరిస్తున్నారు. వారి సమస్యలు, బాధలు వింటున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు. పిల్లల చదువులకు సాయం చేస్తున్నారు. ముందుగా చెక్కుల రూపంలో సాయం అందించారు…తరువాత నేరుగా వారి బ్యాంక్ ఖాతాకే సాయం మెత్తం జమ అయ్యే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 నియోజకవర్గాల్లో భువనేశ్వరి 149 మంది బాధిత కటుంబాల వద్దకు వెళ్లి వారికి సాయం చేశారు.
66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,092 కిలోమీటర్ల మేర భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో బాధిత కుటుంబాలను కలవడంతో పాటు మహిళలు, గిరిజనులు, విద్యార్థులు, చేనేతలతో భువనేశ్వరి సమావేశం అవుతున్నారు. వారి సాధక బాధకాలు వింటున్నారు. వారి కష్టాలు విని వారికి భరోసా ఇస్తున్నారు. త్వరలో వచ్చే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ధైర్యం చెపుతున్నారు.
హెరిటేజ్ మీటింగ్ ల కోసం ఒక వారం విరామం….
నిర్విరామంగా సాగుతున్న నిజం గెలవాలి కార్యక్రమానికి భువనేశ్వరి వారం విరామం ఇచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఈ వారంలో జరిగే బోర్డు మీటింగ్స్ కు భువనేశ్వరి హాజరుకావాల్సి ఉంది. నిజం గెలవాలి కార్యక్రమం కారణంగా ఆమె సమయం పూర్తిగా పర్యటనలకే కేటాయిస్తున్నారు. జిల్లాకు వెళ్లిన ప్రతి సారీ 4 నుంచి 5 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. దీంతో హెరిటేష్ ఎండీగా ఉన్న భువనేశ్వరి ఆ పనులు చూసుకునేందుకు సమయం పెట్టాల్సి ఉంది.
ఈ కారణంగా ఒక వారం పాటు విరామం ఇచ్చి ఆ పనులు చూసుకోనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యకలాపాలను సైతం సమీక్షించుకునేందుకు ఆమె సమయం వెచ్చించనున్నారు. మళ్లీ వచ్చేవారం నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం యధావిధిగా సాగనుంది.
మొత్తం 206 మంది అభిమానులు చంద్రబాబు అరెస్టు సమయంలో ఆవేదనతో ప్రాణాలు కోల్పోయినట్లు పార్టీ వర్గాలు తేల్చాయి. అన్ని కుటుంబాలను కలిసే వరకు నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించాలని భువనేశ్వరి నిర్ణయించారు.