Suryaa.co.in

Entertainment

కటకటాల ముద్రయ్య..!

నటనకు నిలువెత్తురూపం..
రాజదర్పానికి
నిలువుటద్దం..
విభిన్న పాత్రల
విరాట్ స్వరూపుడు..
విలక్షణ సినిమాల సమోన్నత
అభినయ రారాజు..!

కెరీర్ ఆరంభం నుంచి..మొదట్లో కొన్ని నెగెటివ్ క్యారెక్టర్లు వేసినా గాని తన హుందాతనానికి
లోటు లేకుండా కాపాడుకుంటూ వచ్చిన నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు..!
సరే..కృష్ణంరాజు సినిమాల గురించి ..ఆయన వేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నది నిజమే అయినా ఆయన నట జీవితాన్ని అనవసరమైన మలుపు తిప్పిన వైనం గురించి ఇక్కడ చర్చిద్దాం.

కృష్ణవేణి..భక్తకన్నప్ప.. పరాకాష్టగా అమరదీపం.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేసి ఒక స్థాయికి వెళ్లారు కృష్ణంరాజు..ఇవన్నీ సూపర్ హిట్టయినా ఒకదానికి ఒకటి సంబంధం లేని విభిన్న కథాంశాలతో కూడుకున్నవి.ఆయన నుంచి ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయని ఆశిస్తున్న సమయంలో 1978 లో విడుదలైన కటకటాల రుద్రయ్య సినిమా ఆయన నట ప్రస్థానాన్ని అనుకోని మలుపు తిప్పేసింది. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆ సినిమాని తనదైన శైలిలో అద్భుతంగా తీశారు.అలాగే కృష్ణంరాజు కూడా హీరో పాత్రను చక్కగా పోషించి సినిమా రక్తి కట్టించారు.. అన్నీ సరిగా కుదరడంతో ఆ సినిమా సూపర్ సూపర్ హిట్టయింది.

అదే..అదే కృష్ణంరాజు కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ గా మారి ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు రాకుండా చేసిన పరిణామమేమో.. ఆ సినిమా హిట్టవడంతో కృష్ణంరాజు వరసగా అలాంటి సినిమాలే చెయ్యడం ప్రారంభించారు.ఆ పరంపరలో బెబ్బులి…పులి బెబ్బులి..రంగూన్ రౌడీ…రారాజు.. పులిబిడ్డ..
గోల్కొండ అబ్బులు..ఇలాంటి మూస సినిమాలు వచ్చాయి.. ఇంచుమించు ఒకే గెటప్.. ఒకే తరహా పాత్రలు..అదే అభినయం..వీటిలో కొన్ని హిట్టయినా కృష్ణంరాజుపై ఆ సినిమాల ప్రభావం ఎక్కువ పడిపోయిందేమో..

ఆటు తర్వాత కూడా కృష్ణంరాజు మనవూరి పాండవులు ..త్రిశూలం..ఆడవాళ్ళూ మీకు జోహార్లు..
బొబ్బిలి బ్రహ్మన్న..
ధర్మాత్ముడు..
చివరి ఇన్నింగ్స్ లో మా నాన్నకి పెళ్లి..గ్యాంగ్ మాస్టర్.. వంటి సినిమాలు చెయ్యకపోలేదు. కాని కటకటాల రుద్రయ్య మత్తు నుంచి మాత్రం ఆయన బయటికి రాలేకపోయారనే చెప్పాలి.. అలా గనక జరగకపోయి ఉంటే అమరదీపం వంటి ఇంకొన్ని అత్యుత్తమ సినిమాలు ఆయన నుంచి వచ్చి ఉండేవి..!

అయితే తన నట జీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోయే ఎన్నో సినిమాలు చేసిన కృష్ణంరాజు తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రనటుల్లో ఒకరుగా నిలిచిపోయారు.
ఎన్టీఆర్..ఏయెన్నార్..కృష్ణ.. శోభన్ బాబు వంటి సూపర్ స్టార్ల జమానాలో కూడా తనకొక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అప్పటికి హరనాథ్.. కాంతారావు..రామకృష్ణ.. హీరోలుగా చలామణీ అవుతున్న రోజుల నుంచి చిరంజీవి.. బాలకృష్ణ..నాగార్జున..మోహన్ బాబు..వెంకటేష్ వంటి వారి హవా నడుస్తున్న కాలంలో కూడా కృష్ణంరాజు విలక్షణ నటనతో హీరోగా తన స్థానం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇంచుమించు ఈ తారలందరితోనూ తెరను పంచుకున్న అనుభవం కృష్ణంరాజు సొంతం.. మొత్తానికి పరిశ్రమ ఒక మంచి వ్యక్తిని..గొప్ప నటుడిని కోల్పోయింది.

సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE