Suryaa.co.in

Editorial

షర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రాకు పంపిస్తాం

షర్మిలపై నేతల తిరుగుబాటు
ఆమెను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం
పాదాలమీదకాదు.. మా శవాలపై నడిచేందుకు సిద్ధమైంది
షర్మిల రాజకీయాలకు పనికిరారు
ఆమె రాజన్న పేరు చెడగొట్టారన్న గట్టు రామచంద్రరావు
అందరినీ రోడ్డుమీద నిలబెట్టింది
తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్
తెలంగాణ ద్రోహి షర్మిల
మూకుమ్మడిగా రాజీనామాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై సొంత పార్టీలోనే తిరుగుబాటుకు తెరలేచింది. సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావు సారథ్యంలో.. ఆ పార్టీ నాయకులు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో, మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. దానితోపాటు.. షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామని, ఆమె తక్షణమే తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. పైగా ఆమె తెలంగాణ నుంచి వెళ్లకపోతే, తామే రాళ్లతో కొట్టి ఆంధ్రాకు పంపిస్తామని హెచ్చరించడం విశేషం.

తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా, కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ షర్మిల తీసుకున్న నిర్ణయం, ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికలకు సంబంధించి అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఆమె ఎవరికీ చెప్పలేదని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు.

‘షర్మిల ఢిల్లీకి వెళ్లి రావడమే మాకు తెలుసు. అక్కడ అసలు ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారో మాతో చర్చించలేదు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏమిటి? మేం పోటీ చేస్తున్నామా? లేదా కూడా చెప్పలేదు. చివరి వరకూ మమ్మల్ని భ్రమల్లో పెట్టి, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఇదే కాంగ్రెస్ గురించి షర్మిల ఏం మాట్లాడారో ఆమెకు గుర్తు లేకపోయినా, ఆయన అభిమానులుగా మేం ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీకే మళ్లీ మద్దతునిచ్చారంటే ఆమె వైఎస్ పేరును మొత్తం చెడగొడుతున్నారని అర్ధమయింది. అసలు ఆమెకు రాజకీయాలు తెలియవు. ఒక వ్యూహం లేదు. ఒక లక్ష్యం లేదు. స్థిరత్వం లేదు. పైగా వైఎస్‌తో తనను పోల్చుకోవడం విచిత్రం. వైఎస్ బిడ్డగా ఆమెను చూడలేపోతున్నాం’ అని గట్టు వ్యాఖ్యానించారు.

ఇక షర్మిల తెలంగాణ నుంచి తక్షణం వెళ్లిపోవాలని సీనియర్ నేత బి.సంజీవరావు, గణేష్ నాయక్, మహిళానేత సత్యవతి డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. షర్మిల తెలంగాణలో బయ్యారం గుట్ట, తెలంగాణ సొమ్ము దోచుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. ఆమె భ విష్యత్తులో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని హెచ్చరించారు. షర్మిలకు ఇక తెలంగాణలో తిరగే హక్కు లేదని, ఆమె తక్షణం వెళ్లకపోతే రాళ్లతో ఆంధ్రా వరకూ తరిమికొడతామని హెచ్చరించడం సంచలనం సృష్టించింది.

ఆమెతో తిరిగినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. ‘ఆమె ఎవరినీ గౌరవించదు. అహంకారి. సొంత అజెండాతోనే వెళ్లింది. వైఎస్‌పై అభిమానంతో పార్టీలో చేరిన వారిని ఆమె మోసం చేసింది. ఆమె పాదాలమీద కాదు. మా శవాలపై నడిచేందుకు సిద్ధమైంది. షర్మిల రాజకీయాలు ఇక తెలంగాణలో చెల్లవ’ని స్పష్టం చేశారు.

నిజానికి షర్మిల నిర్ణయంపై పార్టీలో చాలాకాలం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె ఏ స్థాయి నేతతో కూడా మాట్లాడకపోవడం, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకోకపోవడం, కాంగ్రెస్‌తో చర్చల తర్వాత కూడా పార్టీ వైఖరి ఎవరికీ చెప్పక పోవడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాము పోటీ చేయాలా? వద్దా అన్న విషయం ముందుగా పార్టీలో చర్చించకుండా.. తాము పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతునిస్తునట్లు, మీడియాలో ప్రకటించడంపై మండిపడ్డారు.

LEAVE A RESPONSE