Suryaa.co.in

Editorial

జగన్‌పై సర్పంచుల తిరుగుబాటు

– జగన్ ఓడితేనే మన మనుగడ
– అదే నినాదంతో రోడ్డెక్కనున్న సర్పంచ్, స్థానిక ప్రతినిధులు
– ఈ పాపం మాది కాదు.. జగన్‌దే
– జగన్‌పై తిరగబడ్డ స్థానిక ప్రజాప్రతినిధులు
– 26 నుంచి కలెక్టర్ ఆఫీసుల ముందు నిరాహారదీక్షలు
– జగన్ మోసంపై గ్రామాల్లో ఎక్కడికక్కడ రచ్చబండ
– సర్పంచుల సంఘం,-ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఏకగ్రీవ తీర్మానం
– సర్పంచులలో 60 శాతం వైసీపీకి చెందిన వారే
– పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేసిన వైసీపీ సర్పంచుల సంఘం
– నిరాహారదీక్షలకు వారు సైతం
– వైసీపీకి ముందస్తు ‘గ్రామగాయం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ ఓడితేనే మన మనుగడ నినాదంతో ఏపీలోని సర్పంచులు-ఎంపీటీసీ-జడ్పీటీసీ-కౌన్సిలర్లు సీఎం జగన్‌పై కదం తొక్కనున్నారు. జగన్ ఓడితేనే మన మనుగడ నినాదంతో జగన్‌పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. వీరిలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఉండటం వైసీపీకి కలవరం కలిగించే అంశం.

ఆమేరకు విజయవాడలో జరిగిన సర్పంచుల సంఘం-ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జగన్ ఓడితేనే మన మనుగడ అంటూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం సంచలనం సృష్టిస్తోంది.

కొన్నేళ్ల నుంచి తమకు రావలసిన బకాయిల కోసం, వివిధ రూపాల్లో ఆందోళన-నిరసనలు చేస్తున్న సంఘం.. జగన్‌ను ఓడించాలంటూ ఎన్నికల ముందు తీర్మానం చేయడం వైసీపీకి శరాఘాతమే. ఈ సంఘంలో అధికార వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉండటం మరోషాక్. నిజానికి రాష్ట్రంలోని సర్పంచులలో 60శాతం వైసీపీకి చెందిన వారే ఉండగా.. అందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 50 శాతానికి పైగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా సొంత పార్టీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పి, రోడ్డెక్కడం ఆసక్తికరంగా మారింది.

గ్రామాభివృద్ధికి కేంద్రం నేరుగా ఇస్తున్న నిధులను సైతం జగన్ ప్రభుత్వం దొంగిలించిందంటూ, సంఘం కోర్టుకెక్కి న్యాయపోరాటం చేసింది. పెండింగ్ బిల్లులపై జరిపిన సుదీర్ఘ న్యాయపోరాట ఫలితంగా, జగన్ ప్రభుత్వం కొంతమేరకు నిధులు చెల్లించాల్సి వచ్చింది. తర్వాత వాటిని కూడా ప్రభుత్వం నిలిపివేయడంతో సర్పంచులు రోడ్డెక్కి, భిక్షాటన కూడా చేసిన దృశ్యాలు వైసీపీని అప్రతిష్టపాలు చేశాయి. మరికొందరు సర్పంచులు అప్పులపాలై హైదరాబాద్, బెంగళూరుకు వలస వెళ్లి, హోటళ్లలో పనిచేస్తున్న దయనీయ దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి.

ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులను, జగన్ సర్కారు దారిమళ్లించిన ఫలితమేనంటూ సర్పంచులు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగా వైసీపీకి కలవరం కలిగించేవే. ప్రధానంగా రోడ్డెక్కి నిరసన ప్రకటిస్తున్న వారిలో, వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉండటం, అధికారపార్టీని ప్రాణసంకటంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో వైసీపీకి అనుబంధంగా ఉన్న సర్పంచుల సంఘం మొత్తం, ఆ పార్టీకి సామూహికంగా రాజీనామా చేయడం జగన్‌కు షాక్ ఇచ్చినట్లయింది.

మరి కొద్దినెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. గ్రామాల్లో వైసీపీకి సర్పంచులే బలం. ఎంతమంది వాలంటీర్లు ఉన్నా, గ్రామాల్లో సర్పంచులకే విలువ ఎక్కువ. ఈక్రమంలో జగన్‌ను ఓడించాలంటూ.. స్థానిక ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడి తీర్మానం చేయడం, వైసీపీ అభ్యర్ధులను మింగుడుపడకుండా ఉంది. అందులో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఉండటం, వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, చివరకు సీఎంఓచుట్టూ కాళ్లరిగేలా తిరిగినా, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

దానితో ఇక జగన్‌ను ఓడించడమే, తమ సమస్యకు ఏకైక పరిష్కారం అన్న తెగింపు నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే , సర్పంచులకు బిల్లులు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-యువనేత లోకేష్ తరచూ హామీలిస్తుండటమే, వారి తెగింపునకు కారణంగా కనిపిస్తోంది.

జగన్ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలోని 12,918 గ్రామాల్లో.. 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజల, రోజువారీ జీవనానికి ఆటంకం ఏర్పడిందన్నది వారి ఆవేదన.‘‘ జగన్ వల్ల ప్రజాప్రతినిధులు ప్రజల ముందు అసమర్ధులుగా నిలబడాల్సి వస్తోంది. ఈ పాపం మాది కాదు. జగన్‌దే. అందుకే మేం తిరగబడాలని నిర్ణయించుకున్నాం. ఇది చాలా సాహసోపేత నిర్ణయం అని తెలుసు. కష్టాలు వస్తాయని తెలుసు. అయినా ఎదుర్కొంటాం. మా సంఘంలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐతోపాటు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. అంతా కలసి జగన్‌ను గద్దె దించేందుకు సమిష్టిగా పోరాడతాం. అందుకే జగన్ ఓడితేనే మన మనుగడ అన్న నినాదం తీసుకున్నాం’’ అని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.

జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. ‘జగన్ ఓడితేనే మన మనుగడ’ నినాద అవసరం గురించి, వారి పరిథిలోని ప్రజలతో చర్చకు పెట్టనున్నారు. జగన్ ఏవిధంగా తమ గ్రామాలకు వచ్చిన నిధులను పక్కదారి పట్టించారు? దాని వల్ల గ్రామంలో అభివృద్ధి ఎలా ఆగింది? గ్రామానికి వచ్చే నష్టాల గురించి స్థానిక ప్రజలకు, రచ్చబండ ద్వారా వివరించనున్నారు. 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, నిరాహారదీక్ష చేయాలని తీర్మానించారు.

తాజా పరిణామాలు జగన్ సర్కారుకు తలనొప్పిగా పరిణమించాయి. గ్రామాల్లో బలం ఉన్న సర్పంచులు తిరుగుబాటు చేస్తే.. కొన్ని కీలక గ్రామాల్లో పోలింగ్ రోజు, బూత్ ఏజెంట్లు కూడా దొరకరన్న ఆందోళన, వైసీపీ అభ్యర్ధులలో మొదలయింది. గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సర్పంచులు చెబితేనే ఓట్లు వేసే వర్గాలు చాలా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. గ్రామాల్లో పేద-మధ్య తరగతి వర్గాలు, సర్పంచుల మాట జవదాటరని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచులతో పెట్టుకుని.. తమ అధినేత తప్పు చేసి, తమ విజయంతో ఆడుకుంటున్నారని వైసీపీ అభ్యర్ధులు తలపట్టుకుంటున్నారు.

LEAVE A RESPONSE