Suryaa.co.in

Andhra Pradesh

రేవంద్రపాడు వంతెనను పునర్ నిర్మించండి

  • ఇసుక లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
  • 34వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాలు
  • సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ

అమరావతి: సమస్యల పరిష్కార వేదిక విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 34వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఉండవల్లి నివాసంలో జరిగిన “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

శిథిలావస్థలో ఉన్న రేవేంద్రపాడు వంతెనను పునర్ నిర్మించండి

మంగళగిరి మండలం నూతక్కికి చెందిన విజ్ఞాన విహార పాఠశాల ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. రేవంద్రపాడు వద్ద బకింగ్ హోమ్ కెనాల్ పై శిథిలావస్థలో ఉన్న పురాతన వంతెనను పునర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రేవంద్రపాడు వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు, రైతులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, శిథిలావస్థలో ఉన్న వంతెనపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇరుకుగా ఉండటంతో పాటు, తరచు వాహనాలు నిలిచిపోవడం, వంతెన ఇరువైపులా ఆక్రమణల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. నూతన వంతెన నిర్మించి ప్రజలు, విద్యార్థుల ఇక్కట్లు తొలగించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ.. వంతెన పునర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే మొదలుపెడతామని హామీ ఇచ్చారు.

ఆత్మకూరు గ్రామంలో శ్రీ తాతా సాంబశివరావు గారి ఇంటివద్ద నుంచి ఆర్.సి.ఎం చర్చి వరకు ఉన్న మట్టిరోడ్డును ప్రజల సౌకర్యం కోసం బీటీ రోడ్డుగా నిర్మించాలని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం గుంటూరు జిల్లా సమితి, గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వర్షాల సమయంలో మట్టిరోడ్డుపై బురద చేరి వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇంజనీరింగ్ చదివిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చినకాకానికి చెందిన వి.కౌశిక్, వి.కోమలి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో ఎన్నిమార్లు దరఖాస్తు చేసినా వితంతు పెన్షన్ మంజూరు చేయలేదని, ప్రజాప్రభుత్వంలో తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎమ్.శివనాగమణి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

పరిటాలలోని ఎమ్ వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీయే చదివిన తనకు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు కాలేజీలో నిలిచిపోయాయని, తన సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తాడేపల్లికి చెందిన జి.ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

ఇసుక లారీ యజమానుల సమస్యలు పరిష్కరించండి

– విజయవాడ విద్యాధరపురంలో నివాసం ఉండే తాము ఇటీవల సంభవించిన వరదలకు ఇంట్లోకి నీరు చేరడంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్నామని, నష్టపరిహారం అంచనా కోసం అధికారులు వచ్చి సమయంలో ఇంట్లో లేమని, తమ కుటుంబానికి కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని షేక్ మలికాబేగం విజ్ఞప్తి చేశారు. పరిశీలించి నష్టపరిహారం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్యాజువల్ లేబర్లుగా 8 నెలల నుంచి పనిచేస్తున్న తమను అర్థంతరంగా విధులు నుంచి తప్పించారని కార్మికులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇసుక సరఫరాలో లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాకినాడకు చెందిన శ్రీలక్ష్మి శ్రీనివాస క్యారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. లారీ కిరాయిపై జీఎస్టీ రద్దుతో పాటు సెక్యురిటీ డిపాజిట్టును రద్దు చేయాలని కోరారు. ఇసుక సరఫరా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

గుంటూరు జిల్లా డీఎమ్ హెచ్ వో పరిధిలో వివిధ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న డీఈవోలు, ఎల్జీఎస్ లకు 2023 నవంబర్ నుంచి నిలిచిపోయిన జీతం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణికి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం అప్పారాముడుపాలెంకు చెందిన కణితి మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

వైసీపీకి చెందిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తన మల్బరీ షెడ్ ను తగులబెట్టడంతో భారీగా నష్టపోయాయని, విచారించి తగిన న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కొత్తపల్లికి చెందిన వల్లిగి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE