– కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి చెప్పాలి
– భారత్ బంద్ కు మద్ధతు ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వస్తి చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ కు మద్ధతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా భారత్ బంద్ కు మద్ధతిచ్చినట్లు గుర్తు చేశారు.
బుధవారం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కలు హరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా కార్మికుల సామాజిక భద్రతను గాలికి వదిలేసిందని విమర్శించారు. కేవలం పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.
దురదృష్టవశాత్తు 2014 నుంచి కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు సవరించి బ్యాక్ డోర్ విధానాలకు తెరలేపిందని ఎండగట్టారు. కార్మిక చట్టాలను సవరించిడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు భద్రత లేకుండా పోతోందని, అందుకు ఇటీవల హైదరాబాద్ లో ఒక పరిశ్రమలో జరిగిన ప్రమాదమే ఒక ఉదాహరణ అని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలన్న డిమాండ్ తో ఈ నెల 17వ తేదీన తెలంగాణ జాగృతి తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి జాతీయ యాదవ హక్కలు పోరాట సమితి, సోమవన్షి ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నతి మండల్ సంఘాలు మద్ధతు ప్రకటించాయి.