Suryaa.co.in

National Telangana

డికె శివకుమార్‌కు రేవంత్‌, రఘువీర్‌ అభినందన

కర్నాటకలో బీజేపీని ఓడించడంలో కీలకపాత్ర పోషించి, సర్వం తానై కాంగ్రెస్‌ విజయపథాన నడిపించిన కర్నాటక కాంగ్రెస్‌ దళపతి డికె శివకుమార్‌ను, వివిధ రాష్ర్టాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆయనకు సన్నిహితుడైన తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ యువనేత కె.రఘువీర్‌రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రోహిన్‌రెడ్డి.. సోమవారం బెంగళూరులోని డికె నివాసానికి వెళ్లి ఆయనను అభినందించారు.

కర్నాటక స్ఫూర్తితో తెలంగాణలో పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని వారు డికెకు స్పష్టం చేశారు. కర్నాటకలో పార్టీని విజయపథాన నడిపించిన తీరు, తమకు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలో ప్రజలు రాహుల్‌ నాయకత్వం కోరుకుంటున్నారని, కేసీఆర్‌పై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని వివరించారు.

దానికి స్పందించిన డికె శివకుమార్‌.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకు తాను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో మోదీ శకం ముగుస్తోందనడానికి, కర్నాటక ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కర్నాటక హైదరాబాద్‌ ప్రాంతంలో ప్రచారం చేసినందుకు, ఆయన రేవంత్‌, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE