- సీఎం రివ్యూ సర్వే నెంబర్ల మీద.. రైతు సమస్యల మీద కాదు
- రైతులకియ్యాల్సిన సంచుల్లో ఢిల్లీకి డబ్బులు పంపుతున్నారు
బిజేపి భరోసా ఇవ్వాల్సింది రైతులకు కాదు.. మైనర్ బాలికలకు - బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వంగూరు,నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం కూడా చేయకుండా అధికారులతో 18 గం.ల రివ్యూ చేస్తున్నానని, అధికారులకు చెమటలు పట్టిస్తున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే ఆయన రివ్యూ చేసేది రైతుల బాధలు ఎలా తీర్చాలని కాదు. ధాన్యం కొనుగోలు సమస్యల గురించి కాదు. సర్వే నెంబర్ల మీద చేస్తున్నారని, ఎక్కడెక్కడ కోట్ల విలువ చేసే భూములున్నాయి? ఎక్కడెక్కడ అసైన్డ్ భూములున్నాయో వాటి సర్వే నెంబర్ మీద రివ్యూ చేసి, అక్కడి నుండి రైతులను ఏ విధంగా బయటకు పంపి, ఎలా ఆ భూములు మనం ఆక్రమించుకోవాలి?
ఎలా ఆ భూముల విలువ 10 లక్షల నుండి, 10 కోట్లకు పెంచాలి? ఎలా ఆ భూముల్లో 4 వేల కోట్ల రోడ్లు వేయాలని మాత్రమే రివ్యూ చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి సొంత మండలం వంగూరు లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన రైతు మహా ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నల్లమల పులి బిడ్డ అని చెప్పుకునే పిల్లి, తన సొంత మండలంలో కూడా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు.
రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బస్తాలను, నోట్ల కట్టలతో నింపి ఢిల్లీకి తరలిస్తున్నారని మండిపడ్డారు. క్వింటాల్ ధాన్యంలో తరుగు కింద 10 కిలోలు పైగా తీస్తున్న మిల్లర్ల దోపిడిని అరికట్టడంలో విఫలమయ్యారన్నారు. రైతుల ధాన్యం సేకరణకు వినియోగించాల్సిన లారీలను ఇసుక దందాల కోసం వాడుతున్నారని మండిపడ్డారు. ఇసుక దందాలు ఆపాల్సిన పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన ముఖ్యమంత్రి సోదరులు కొండలు రెడ్డి,తిరుపతి రెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని నిలదీశారు. సాయి రెడ్డి తను చనిపోయేముందు సూసైడ్ నోట్ లో ఎవరి పేర్లు ఉన్నాయో వారిని కనీసం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
నరేందర్ రావు అనే బిఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా కొడితే, తిరిగి బాధితుని మీదనే ఎఫ్ఐఆర్ చేశారని, బిఆర్ఎస్ పార్టీ పోరాడిన తర్వాత నిందితుల మీద కేవలం కేసు నమోదు చేశారని గుర్తు చేశారు.బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై రాబోయే బిఆర్ఎస్ పాలనలో తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
కొండారెడ్డిపల్లిని అభివృద్ధి చేయాలి కానీ,చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈరోజు రైతు ధర్నాలో భాగంగా కొండారెడ్డి పల్లె సాయి రెడ్డి ఇంటికి పోతరేమోనని భయపడి బందోబస్తు ఏర్పాటుచేసుకున్నారని తెలిపారు. ఇటీవల రైతుల ధాన్యం కొనాలని అడిగినందుకు ఆర్టీసీ డ్రైవర్ ను ఉద్యోగం నుండి తొలగించారని, కాంగ్రెస్ అంటేనే కారు చీకటి అంటూ ధ్వజమెత్తారు. రైతుల గురించి మాట్లాడితే కేసులు, ఉద్యోగాల నుండి సస్పెండ్ కు గురికావాల్సి వస్తుందన్నారు.
గతంలో కేసిఆర్ పాలనలో రైతుల సమస్యల గురించి గంటల తరబడి రివ్యూ జరిగేదని గుర్తు చేశారు. యూరియా, కొనుగోలు కేంద్రాలు, బస్తాలు, దబ్బనం, సుతిల్ దారం గురించి కూడా రివ్యూ చేసి, ఎక్కడా రైతుకు ఇబ్బందులు ఎదురవకుండా చూశారన్నారు. బిజేపి పార్టీ జోకర్ పార్టీగా మారిందని, ఆ పార్టీ భరోసా ఇవ్వాల్సింది రైతులకు కాదని, మైనర్ బాలికలకు అని హితవు పలికారు.
బిజెపి కేంద్ర సహాయ మంత్రి కొడుకు,ఒక మైనర్ అమ్మాయిపై రేప్ చేసి అఘాయిత్యానికి పాల్పడితే, రేవంత్ రెడ్డి దొరకకుండా కాపాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్,బిజేపి పార్టీలు రెండూ ఒకటేనని అందుకే ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి మద్దతు చేస్తున్నారని ఆరోపించారు.
పాడి రైతుల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా విజయ డెయిరీకి పంపిణీ చేసిన పాల బిల్లులు విడుదల చేయలేదన్నారు. వెంటనే పాడి రైతుల బిల్లులు విడుదల చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.