Suryaa.co.in

Telangana

రేవంత్.. ఇకనైనా అహం వీడు!

– సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ‘స్టే’ విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.

400 ఎకరాల్లో పర్యావరణం, జీవవైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని.. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి, ఘటనాస్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని ఇవాళ ఉదయం ఆదేశించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వెంటనే ఈ భూముల్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నెలరోజుల్లో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. 6 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం.. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నాము.

కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీసంపదను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక చెట్టు నరికేందుకే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత పెద్దమొత్తంలో చెట్లను నరికేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జీవవైవిధ్యత కళ్లముందు కనబడుతున్నప్పటికీ.. చెట్లను నరికివేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం ఈ అటవీసంపద విధ్వంసాన్ని సుమోటోగా తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా.. ఉదయం నుంచి చెట్ల నరికివేతను కొనసాగించడం.. దురదృష్టకరం.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకుని.. వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నాను. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేసిన విద్యార్థులను, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

LEAVE A RESPONSE