Suryaa.co.in

Editorial

‘పసుపు’ ఫ్యాక్టరీలో రెండో సీఎం రేవంత్‌

– సీఎంలను తయారుచేసిన టీడీపీ
– టీడీపీ నుంచి వెళ్లిన కేసీఆర్‌
– సొంత పార్టీ పెట్టి సీఎం అయిన కేసీఆర్‌
– టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌
– పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నుంచి సీఎం రేసు వరకూ
– టీడీపీ పోటీ చేయకపోయినా ఆ పార్టీ ఫ్యాక్టరీ నేత సీఎం అయిన వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా.. ‘పసుపు ఫ్యాక్టరీ’ నుంచి వచ్చిన రెండో నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్న వైచిత్రి. ఎంతోమంది నాయకులను ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులను చేసిన పసుపు ఫ్యాక్టరీకే దక్కుతుంది. ఇక జడ్పీ, మున్సిపల్‌ చైర్మన్లను లెక్కలేనంతమందిని తయారుచేసిన ఘనత కూడా పసుపు ప్యాక్టరీదే!

రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో పనిచేసిన ప్రముఖులంతా, టీఆర్‌ఎస్‌ రాకతో ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. కేసీఆర్‌ నినదించిన తెలంగాణవాదం వారిపై అంతలా పనిచేసింది. అంతకుముందు కేసీఆర్‌ సైతం టీడీపీలో మంత్రి, డిప్యూటీ స్పీకర్‌గా చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో పనిచేశారు.

ఆ తర్వాత తాను వచ్చిన పసుపు ఫ్యాక్టరీపైనే కేసీఆర్‌ తిరుగుబాటు చేసి, టీఆర్‌ఎస్‌ను పుట్టించి తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత తెలంగాణలో టీడీపీ దాదాపు చేతులెత్తేసింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో, టీడీపీ 15 స్థానాలు సాధించింది. పొత్తుతో పోటీ చేసిన బీజేపీకి 5 సీట్లు దక్కాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలంతా గంపగుత్తగా టీఆరెస్‌లో చేరిపోవడంతో టీడీపీ దాదాపు నిర్వీర్యం అయింది.

టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాద వ్‌,వేణుగోపాలాచారి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, మాగంటి గోపీనాధ్‌, గాంధీ, మాధవరం కృష్ణారావు వంటి ప్రముఖులంతా పసుపు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారే.

తాజా ఎన్నికల్లో టీడీపీ వివిధ కారణాలతో పోటీ చేయలేదు. అయితే అదే పసుపు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లో సీఎం స్థాయికి ఎదగడం విశేషం. స్వతంత్ర అభ్యర్ధిగా జడ్పీటీసీ, ఎమ్మెల్సీ నుంచి టీడీపీలో చేరిన తర్వాతనే రేవంత్‌రెడ్డి ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. రేవంత్‌ ప్రసంగాలతో వైఎస్‌ సర్కారును ఇబ్బందిపెట్టిన సందర్భాలెన్నో.

ఇక మీడియ పాయింట్‌ అయినా, పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీటయినా రేవంత్‌ ఉన్నారంటే అదో ఉత్సాహం. పంచ్‌ డైలాగులతో ప్రెస్‌మీట్లు పండించేవారు. ఆ రకంగా రేవంత్‌రెడ్డిని సానబట్టి, తురుపుముక్కగా తయారుచేసిన ఘనత పసుపు ఫ్యాక్టరీదే.

ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి.. చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్‌ను బతికించి, అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. ఆవిధంగా తెలంగాణలో పసుపు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సీఎం అవుతున్న రెండో వ్యక్తి రేవంత్‌రెడ్డిగా చరిత్రకెక్కారు.

LEAVE A RESPONSE