– రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కందులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్: ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని వారికి చేయూతనివ్వాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
హరీష్ బహిరంగలేఖ పూర్తి పాఠం ఇదీ..
శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
విషయం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మరియు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కందులకు 400 బోనస్ గురించి.
కంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కందుల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 400 రూపాయలు బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కందులకు మద్దతు ధరకు అదనంగా 400 రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్ లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయింది.
కందులకు మద్దతు ధర 7,550 ఉంది కానీ బహిరంగ మార్కెట్లో 6500 నుండి 6800 మించి క్వింటాలుకు చెల్లింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి క్వింటాలు పైన మద్దతు ధరతో పోలిస్తే 800 రూపాయలు రైతులు నష్టపోతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది.
కాబట్టి వెంటనే ప్రభుత్వం కంది రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి వారి గోస తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ధన్యవాదాలతో
టి. హరీశ్ రావు,
ఎమ్మెల్యే, సిద్దిపేట్.