-మాకు ఉద్యమాలు మాత్రమే తెలుసు
-తుది తీర్పులో కూడా కవిత కడిగిన ముత్యంలా వస్తుంది
-కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం
-నిజామాబాద్ ఆడపడుచు జైలు విముక్తురాలై వస్తుంటే.. అంత కక్ష ఎందుకు మహేష్ గౌడ్?
-కవిత బెయిల్ గురించి ఐదు నిమిషాల్లో స్పందించిన బండి సంజయ్ కు కర్ణాటక వాల్మీకి స్కాం కనబడట్లేదా?
-బండి సంజయ్,మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ఢిల్లీ: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల మాజి మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్,బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…సుప్రీం ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడం సంతోషకరమని,న్యాయం, ధర్మమే గెలిచిందన్నారు. న్యాయ వ్యవస్థపై మాకున్న నమ్మకం బలపడిందని పేర్కొన్నారు. తుది తీర్పులోనూ కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారు ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
సుప్రీంకోర్టు తీర్పుని కించపరిచేలా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని హెచ్చరించారు. చీకటి ఒప్పందాలు, మతలబులు సీఎం రేవంత్ రెడ్డికే బాగా తెలుసనీ ,తాము ఉద్యమకారులం.. న్యాయబద్ధంగా పోరాడుతామని తేల్చి చెప్పారు. నిజామాబాద్ బిడ్డ విముక్తురాలై వస్తుంటే జిల్లాకే చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు.
సుప్రీం తీర్పుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే వేముల దుయ్యబట్టారు. కవితకు బెయిలొస్తే 5 నిమిషాల్లో బండి సంజయ్ స్పందించారు. వాల్మీకి స్కామ్‌పై బండి సంజయ్ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. వాల్మీకి స్కాం గురించి అన్ని ఆధారాలు ఉన్నా కూడా మరి బండి సంజయ్ ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.
కలిసిపోయింది కాంగ్రెస్,బీజేపీ లు మీ రెండు పార్టీలు ఒక్కటయి అందరిని మోసం చేస్తున్నారని,గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోయావా బండి సంజయ్ అంటూ ఎద్దేవా చేసారు. బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. మహిళ అని కూడా చూడకుండా సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ పై వారు మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని వేముల డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ని తప్పు పట్టేలా మాట్లాడిన బండి సంజయ్, మహేష్ కుమార్ గౌడ్ పై కోర్టు ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.