Suryaa.co.in

Telangana

ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఇంతమందా?

– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఢిల్లీ నుంచి అమిత్ షా, కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా ఇవాళ పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామం నుంచి చండూరు తహసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ముఠాలతో, మూటలతో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దత్తత పేరుతో కేటీఆర్ మునుగోడు ప్రజలను మోసగించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. గతంలో చిన్న ముల్కనూరు, మూడు చింతలపల్లి, లక్ష్మపూర్ ను దత్తత తీసుకున్న కేసీఆర్ ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. కొడంగల్ లో కూడా తనను ఓడించడానికి ఇలాంటి డ్రామాలే ఆడారని రేవంత్ విమర్శించారు. కానీ అక్కడ కనీసం రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి కూడా వేయలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముగ్గురు మాయగాళ్లని.. మునుగోడు ప్రజలు వాళ్ల మాయలో పడొద్దని తెలిపారు. స్రవంతిని గెలిపిస్తే సీతక్కతో కలిసి సమ్మక్క, సారక్కలా సెంబ్లీలో కొట్లాడుతారని చెప్పారు.

చేతులెత్తి అడుగుతున్నా.. ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి
మునుగోడు ఉప ఎన్నికల్లో ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చేతులెత్తి నమస్కరించి కోరారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు గడ్డపై ఆడబిడ్డ స్రవంతిని గెలిపించాలని కోరారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించి బీజేపీ, టీఆరెస్ లకు బుద్ది చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కేవలం తమ పార్టీ కోసం మాత్రమే కాదని… ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. దళిత,బహుజనుల కోసం.. ప్రశ్నించే గొంతు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.

కార్యకర్తలే మా ధైర్యం
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండగా ఉంటారని.. వారే తమ ధైర్యమన్నారు రేవంత్. ఒక వ్యక్తి అమ్ముడుపోవడం వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని.. ధన దాహంతో రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టారనన్నారు. కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి శత్రువు పంచన చేరాడని విమర్శించారు. నల్లగొండ గడ్డది పోరాటాలు చేసిన చరిత్ర అని..కాంగ్రెస్ జెండా కోసం ప్రాణాలు వదిలిన బిడ్డలను ఆదర్శంగా తీసుకుని కొట్లాడుతున్నామని తెలిపారు. కార్యకర్తలే తమకు ధైర్యమని స్పష్టం చేశారు.

భారీ ర్యాలీ…. తరలివచ్చిన అశేష జనవాహిని
బంగారిగడ్డ గ్రామం నుంచి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మునుగోడు నియోజవర్గంలోని వివిధ మండలాల నుంచి జనం పెద్ద ఎత్తున స్రవంతికి మద్దతుగా తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో పలు వాహనాలను పోలీసులు మార్గమధ్యనే నిలిపివేశారు. పెద్ద ఎత్తున ప్రజలు మద్దతుగా తరలి రావడంతో మునుగొడులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పాదాభివందనం కార్యక్రమం ప్రారంభం
NSUI ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణకు పాదాభివందనం కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దోహదపడుతుందన్నారు. కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులను గెలిపిస్తే పరిపాలన ఉండదన్నారు రేవంత్. ప్రజల కోసం పని చేసే కాంగ్రెస్ ను గేలిపిస్తే పరిపాలన పేదలకు అందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని…. కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్ లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

LEAVE A RESPONSE