షర్మిల..ప్ గప్‌చుప్!

– మునుగోడులో పోటీ పెట్టని వైఎస్సార్‌టీపీ
– విజయమ్మ సాయం కోరిన కోమటిరెడ్డి?
– వైఎస్‌కు విధేయత మొహమాటమే పోటీకి దూరంగా ఉంచిందా?
– కోమటిరెడ్డికి పనిచేస్తున్న షర్మిల సైన్యం?
– టీఆర్‌ఎస్‌పై పోటీ పెట్టకపోవడంపై చర్చ
– షర్మిల నిర్ణయంతో బీజేపీకే లాభమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆమె పొద్దునలేస్తే కాళ్లకు గజ్జ కట్టుకుని మరీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తారు. విమర్శనాస్త్రాలతో విరుచుకుపడతారు. టీఆర్‌ఎస్ కుటుంబపాలనపై శివమెత్తుతారు. ఈ దరిద్రం ఇక్కడితో సరిపోక జాతీయ పార్టీ పెడతారట అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఇలా ఒకటేమిటి? ఆమె నోటి నిండా కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలే దూసుకువస్తాయి. పైగా వచ్చేది వైఎస్ పాలనే అని జోస్యం చెబుతుంటారు. రాజన్నపాలన తెస్తానని చెబుతుంటారు.

మరి అంతగా విరుచుకుపడే ఆమె.. తన పార్టీ సత్తా నిరూపించుకునేందుకు వచ్చిన ఉప ఎన్నికను, సదరు ఫైర్‌బ్రాండ్ సద్వినియోగం చేసుకుంటారని కదా అంతా ఊహించేది? కానీ ఆమె ఎందుకో మడమ తిప్పేశారు. పోటీ చేయకపోగా.. అదో కుక్కల కొట్లాటగా అభివర్ణించి, ఆ సమరం నుంచి తప్పుకుని అస్త్రసన్యాసం చేశారు. అసలు ఆమె అస్త్ర సన్యాసం ఎవరి కోసం? ఎందుకోసం? ఎన్నిక క్షేత్రంలో నిటారుగా నిలబడి, తన ప్రతర్థి టీఆర్‌ఎస్‌పై తన పార్టీ అభ్యర్ధిని నిలబెట్టి, ఆయన పక్కన నిలబడి సంధించాల్సిన అస్త్రాలన్నీ.. జమ్మిచెట్టు ఎక్కించడం వ్యూహమా? వైఫల్యమా? త్యాగమా?.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను రాజకీయ వర్గాలు చూపుడువేలుతో సంధిస్తున్న ప్రశ్నలివి.

వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్సార్‌టీపీ.. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా, అస్త్రసన్యాసం చేయడం ఆశ్చర్యం-అనుమానాలకు కారణమయింది. గత కొద్దినెలల నుంచి ప్రధాన రాజకీయ పార్టీలయిన బీజేపీ-కాంగ్రెస్‌లకు మించి.. కేసీఆర్ సర్కారుపై విమర్శనాస్త్రాలు, ఆరోపణలు సంధిస్తున్న షర్మిల అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా మేఘా ఇంజనీరింగ్‌కు గంపగుత్తగా ఇస్తున్న కాంట్రాక్టులపై, ఇప్పటివరకూ కాంగ్రెస్-బీజేపీ పల్లెత్తు మాట అనని మొహమాటంలో ఉన్నాయి.

అయితే అదే మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి ఇస్తున్న కాంట్రాక్టుల వెనుక ఉన్న మతలబును, షర్మిల బయటపెట్టి సంచలనం సృష్టించారు. పాదయాత్రలో ఆమె కేసీఆర్ కుటుంబ అవినీతిపై సంధిస్తున్న ఆరోపణాస్త్రాలు, జనక్షేత్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. దానితో ఆమె తన పార్టీని మునుగోడు బరిలో దింపి, తొలి ప్రయోగం చేస్తారని చాలామంది భావించారు.

కానీ ఆమె తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఆశ్చర్యపరిచింది. అది అనేక అనుమానాలకు తావిచ్చింది. నిజంగా షర్మిల చెబుతున్నట్లు టీఆర్‌ఎస్-బీజేపీకి వైఎస్సార్‌టీపీ ప్రత్యామ్నాయం అనుకుంటే, ఆమె తన అభ్యర్ధిని వారిపై నిలబెట్టేవారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కానీ పోటీకి దూరంగా ఉన్నారంటే, ఆమె ఎవరికో ‘మేళ్లు’ చేయడానికే అన్న విషయం అర్ధమవుతోందన్నది మరికొందరి అనుమానం.

కాగా.. వైఎస్‌ను అమితంగా ప్రేమించే కోమటిరెడ్డి కుటుంబం అభ్యర్ధన మేరకే, షర్మిల మునుగోడులో తన అభ్యర్ధిని పోటీకి పెట్టలేదన్న చర్చ, నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ మేరకు కోమటిరెడ్డి.. దివంగత వైఎస్ భార్య విజయలక్ష్మిని కలసి మద్దతు కోరారని, అందుకు ఆమె కూడా అంగీకరించినందువల్లే.. బ్యాలెట్ పేపర్‌లో వైఎస్సార్ టీపీ అభ్యర్ధి లేకుండా పోయారన్న చర్చ జరుగుతోంది.

అందుకు తగినట్లే.. మునుగోడులో వైఎస్సార్‌టీపీ నేతలు-క్యాడర్, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డికి అనుకూలంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజంగా వైఎస్సార్‌టీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే, ఉన్న 7 వేల రెడ్ల ఓట్లలో మరిన్ని చీలికలు వచ్చేవంటున్నారు. పోటీ చేయకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల, బీజేపీనే లాభపడుతుందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

Leave a Reply