– కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక్కటయినా నెరవేర్చారా?
– కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల, అసమర్థ, మోసాల పాలనపై బిజెపి చార్జ్‌షీట్ విడుదల సందర్భంగా మీడియాతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: 23 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు? ఏ మొహంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? మోసపూరితమైన మాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదు.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా ప్రశ్నిస్తోంది. విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్ కోసం బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారి చదువులు ఆగిపోతున్నాయి. పేషెంట్లకు హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందడంలేదు. కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ప్రజల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటోంది.
రైతులకు “రుణమాఫీ” చేస్తామని చెప్పి, చివరికి ప్రజలే మిమ్మల్ని మాఫీ చేయాలా అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలందరు కూడా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీని అడగండి . ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక్కటయినా నెరవేర్చారా?” అని.
నిన్న మొన్న విద్యార్థులు స్కూటీల కోసం నిరసన ప్రదర్శన చేసిన ఘటన కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం, నేడు విద్యార్థులకు సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది.
మోసపూరిత వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన ఆకర్షణీయ హామీలు — ఇవన్నీ ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకం మాత్రమేనని ఈరోజు స్పష్టమవుతోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు.. కేవలం ఓట్ల కోసం వేసిన వల మాత్రమే. బీసీ వర్గాల ఆశలను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఇది.
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల దారిలోనే నడుస్తోంది. ప్రజల ఆస్తులు, అభివృద్ధి, శాంతి భద్రతలకు మించి, అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ గౌరవం, జవాన్ల త్యాగాలు, జాతీయ భద్రత వంటి అంశాలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరం, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను, గర్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.
పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేలా, వారిని ఆదుకునేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ దుర్ఘటన పట్ల ప్రతి భారతీయుడు బాధపడతాడు. కానీ ఇలాంటి విషాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఎవరికీ హక్కు లేదు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశాన్ని, సైనికుల త్యాగాన్ని, పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల జ్ఞాపకాన్ని అవమానపరిచేలా ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజల గర్వాన్ని దెబ్బతీయడం మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని తక్కువ చేయడమే.
భారతీయ జనతా పార్టీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుంది. దేశ భద్రత, సైనికుల త్యాగం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే విషయం కాదు. దేశ గౌరవం కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత. దేశ భద్రత, సైనికుల త్యాగం ఇవి రాజకీయ వాదప్రతివాదాలకు విషయం కావు. వీటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
ప్రజల బాధను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించవద్దు. కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలపై సమాధానం చెప్పి తప్పు జరిగిందని ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. లేకుంటే సహించేది లేదు.
ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విడుదల చేసిన చార్జ్‌షీట్ ద్వారా తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా ఉంచుతున్నాం. ప్రజలకు నిజాలు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ పనితీరు గురించి ప్రజల ఎదుట సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.