Suryaa.co.in

Telangana

మున్నూరు కాపులను అణచివేసేందుకు రేవంత్ కుట్ర

– అందుకే సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు
– మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ నెలలో మున్నూరుకాపుల భారీ బహిరంగసభ
– ఎంపీ వద్దిరాజు

హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించి 80ఏండ్లు సమీపిస్తున్నా కూడా బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్టసభలలో రిజర్వేషన్స్ లేకపోవడం తీవ్ర బాధాకరమన్నారు. హైదరాబాద్ మియాపూర్ సత్యభారతి కన్వెన్షన్ హాలులో శనివారం జరిగిన మున్నూరుకాపు, కాపు ప్రతినిధుల సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బీసీలు తమ న్యాయమైన హక్కుల సాధనకు,రాజ్యాధికారంలో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కించుకునేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉండి కూడా అన్ని రంగాలలో అన్యాయానికి గురి కావడం శోచనీయమన్నారు.

పదేళ్ల కాలంలో జనాభా 13.5% పెరుగుతుందని,ఆ లెక్కన చూస్తే తెలంగాణ జనాభా 4 కోట్ల 30 లక్షలు ఉంటుందని ఎంపీ వద్దిరాజు తెలిపారు.అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిన సర్వేలో 3 కోట్ల 70 లక్షలు మాత్రమే చూపించడం క్షమించరాని తప్పు అని ఆయన మండిపడ్డారు.రాష్ట్రం మొత్తం జనాభాను, మున్నూరుకాపులతో పాటు బీసీలలోని అన్ని కులాల జన సంఖ్యను తక్కువ చేసి చూపి అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లు వెంటనే స్పందించి బీసీల పక్షాన గట్టిగా నిలబడి ముఖ్యమంత్రిని నిలదీయాలని, లేనిపక్షంలో భవిష్యత్ తరాలు క్షమించవని స్పష్టం చేశారు.

రీసర్వేను 3.1% మాత్రానికే పరిమితం చేయకుండా,ప్రజలందరిని భాగస్వాములను చేయాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.ఇందుకోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్,మంత్రి పొన్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వత్తిడి పెంచాల్సిందిగా సలహా ఇచ్చారు.ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగారని,మన రాష్ట్రంలో కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్న మున్నూరుకాపులం బీసీలలోని ఇతర కులాల వారితో స్నేహపూర్వకంగా ముందుకు సాగుతూ రాజ్యాధికారం వైపు అడుగులేద్దామని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు.

అవసరమైన ప్రతి సందర్భంలో మనం సంఘటిత శక్తిని ప్రదర్శించాలని,ఐకమత్యమే బలం అని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదామన్నారు.చట్టసభలలో 33%, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 % రిజర్వేషన్స్, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ సాధనకు,బోగస్ సర్వే నివేదికను తిప్పికొడుతూ, మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ నెలలో మున్నూరుకాపుల భారీ బహిరంగసభ జరుగుతుందని ఎంపీ వద్దిరాజు తెలిపారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, ప్రముఖ జర్నలిస్ట్ చందు జనార్థన్, ఐఆర్ఏస్ రిటైర్డ్ అధికారి మంగబాబు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య తదితర ప్రముఖుల ఆధ్వర్యాన ఏర్పాటైన ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించారు.

LEAVE A RESPONSE