Suryaa.co.in

Andhra Pradesh

వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు

-చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా సంస్క‌ర‌ణ‌లు
-పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌కూడ‌ద‌నేదే జ‌గ‌న‌న్న ల‌క్ష్యం
-ముఖ్య‌మంత్రి ఆశ‌యాలు నెర‌వేరేలా ప‌నిచేద్దాం
-జ‌గ‌న‌న్న ప్రాధాన్య‌త‌లో వైద్య‌, ఆరోగ్య‌శాఖ కూడా ఒక‌టి
-వైద్యులు విధిగా విధుల్లో ఉండాలి
-ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఆస్ప‌త్రుల్లో క‌నిపించాల్సిందే
-మ‌హాప్ర‌స్థానం వాహ‌నాల విష‌యంలో త్వ‌ర‌లో కొత్త విధానం
-మూడేళ్లలో 39 వేల పోస్టుల నియామకం చేపట్టాం
-వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని
-అన్ని విభాగాల అధిపతులు, డీసీహెచ్ ఎస్‌లు, డీఎంహెచ్ వోలు, టీచింగ్ ఆస్ప‌త్రులు, జిల్లా వైద్య‌శాల‌ల సూప‌రింటెండెంట్‌ల‌తో క‌లిసి మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్‌

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మ‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌, వైద్య విద్య‌, కుటుంబ‌సంక్షేమ శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వైద్య ఆరోగ్య‌శాఖ కు సంబంధించిన అన్ని విభాగాల అధిప‌తులు, టీచింగ్ ఆస్ప‌త్రులు, జిల్లా ఆస్ప‌త్రుల సూప‌రింటెండెంట్‌లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్ ఎస్‌లతో జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాధాన్య అంశాల్లో వైద్య ఆరోగ్య శాఖ ముందు వ‌రుస‌లో ఉంద‌ని తెలిపారు.

నాడు-నేడు కోసం ఏకంగా రూ.16వేల కోట్లను ఆస్ప‌త్రి అభివృద్ధి కోసం జ‌గ‌న‌న్న ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలిపారు. కొత్త‌గా 16 మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు కాకుండా వైద్యం అందాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న ఆశ‌యాల సాధ‌న కోసం అంద‌రం ఐక్యంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వివ‌రించారు.

ఆస్ప‌త్రుల‌కు వ‌చ్చే మృత‌దేహాల‌పై ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాలి
మంత్రి మాట్లాడుతూ ఇటీవ‌ల అంబులెన్సుల విష‌యంలో ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల‌కు వ‌చ్చే మృత‌దేహాల విష‌యంలో సూప‌రింటెండెంట్లకు ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని చెప్పారు. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ మృత‌దేహాన్ని ఇంటికి ఎలా త‌ర‌లిస్తున్నార‌నే విష‌యంపై ఆస్ప‌త్రుల్లో సూప‌రింటెండెంట్‌లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని చెప్పారు. దీనివ‌ల్ల స‌గం స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్లేన‌ని తెలిపారు.

ముందు స‌మ‌స్య మ‌న దృష్టికి వ‌స్తే ప‌రిష్కారం కూడా మ‌న‌మే చూపే వీలు ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ విష‌యంలో ఎవ‌రి వద్దా డ్రైవ‌ర్లు డ‌బ్బులు వ‌సూలు చేయ‌డానికి వీల్లేద‌ని, ఇలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొల‌గిస్తామ‌ని పేర్కొంటూ డీఎంహెచ్‌వోలు స‌ర్క్యుల‌ర్‌లు జారీ చేయాల‌ని ఆదేశించారు. మ‌హాప్ర‌స్థానం వాహ‌నాలు అయినా, త‌ల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లు అయినా ఎంతో ఉన్న‌తాశ‌యంతో ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంద‌ని, ఆ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఆయా వాహ‌నాలు ప‌నిచేయాల‌ని సూచించారు. ఈ ఆశ‌యాలు నీరుగారేలాఎవ‌రైనా ప‌నిచేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

వైద్యులు విధిగా విధుల్లో ఉండాలి
టీచింగ్ ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో వైద్యులు విధిగా త‌మ విధుల్లో ఉండాల‌ని తెలిపారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వారు ఆస్ప‌త్రుల్లో క‌నిపించాల్సిందేన‌న్నారు. ఉద‌యం ఓపీ స‌మ‌యాల్లో పీజీ విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ప్రొఫెస‌ర్లపై వ‌స్తున్నాయ‌ని, ఇది స‌రికాద‌ని తెలిపారు. ప్రొఫెస‌ర్లంతా నియ‌మ నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల త‌ర్వాత మాత్ర‌మే బెడ్‌సైడ్ టీచింగ్ చేయాల‌ని చెప్పారు.

ఓపీ స‌మ‌యంలో రోగుల‌కు వైద్యం మాత్ర‌మే చేయాల‌న్నారు. చాలా మంది ఓపీల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని, తీరు మారాల‌ని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ వైద్య శాల‌ల్లో వైద్యులు యాప్రాన్‌, స్టెత‌స్కోప్ విధిగా ధరించాల‌ని చెప్పారు. రోగులు డాక్ట‌ర్ల‌ను గుర్తించ‌లేని స్థితిలో ఉండ‌టం స‌రికాద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల‌ను పూర్తిగా సీసీకెమెరాల నిఘాలోకి తీసుకొస్తామ‌ని, ఓపీ బ్లాక్లు సైతం సీసీ కెమెరాల ప‌రిధిలోకి వ‌చ్చేలా చూస్తామ‌ని, ఆయా సీసీ కెమెరాల యాక్సెస్ క‌లెక్టర్ల‌కు వ‌చ్చేలా చూడాల‌ని అక్క‌డే ఉన్న ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఆసుపత్రుల పనితీరుపై
ఇటీవల మీడియాలో వచ్చిన వ్యతిరేక వార్తలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మందుల్లేవనీ , అంబులెన్స్ లు అందుబాటులో లేవనీ వంటి వార్తలొచ్చాయనీ , చిన్న చిన్న సంఘటనలు కూడా రోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు.

ఏ ఒక్కరు తప్పు చేసినా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేశారన్నారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల పట్లతాను కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందనీ , అటువంటి పరిస్థితి భవిష్యత్ లో ఎదురు కాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది మరింత బాధ్యత గా, అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అనీ , ఈ శాఖకు సిఎం సరిపడా బడ్జెట్ ను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా మనమందరమూ బాధ్యులమేనన్న విషయాన్ని గుర్తెరిగి పని చేయాలన్నారు.
కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులున్నా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలనీ , పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనీ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలకనుగుణంగా పనిచేయాలని ఆమె కోరారు.

గ్రామ స్థాయి వరకూ సేవలు అందుబాటులోకి రావాలి:ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణ బాబు
గ్రామ స్థాయి వరకూ వైద్య ఆరోగ్య శాఖ సేవలు అందుబాటులో కి రావాలన్నదే సిఎం జగన్మోహన్ రెడ్డి అభిమతమనీ , అందుకనుగుణంగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలనీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణ బాబు సూచించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్కులు మొదలుకుని జిల్లా, ఏరియా ఆసుపత్రులూ , సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిబంధనల ప్రకారం సేవలెలా ఉండాలనే విషయమై లక్ష్యానికనుగుణంగా పనిచేయాలన్నారు. మూస ధోరణిలో పనిచేస్తే శాఖాపరంగా విఫలమైనట్టే అని ఆయన స్పష్టం చేశారు.

నెలాఖరుకల్లా ప్రమోషన్లు , పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ గానీ , ప్రమోషన్లుగానీ గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఏ శాఖకూ ఇవ్వనన్ని నిధులు వైద్య ఆరోగ్య శాఖ కు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారనీ , దాదాపు 39 వేల పోస్టుల భర్తీ తో పాటు 16 వేల కోట్ల మేర బడ్జెట్ ను కేటాయించారన్నారు. మౌలిక వసతులు , మానవ వనరుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారన్నారు. ఎవరి స్థాయిలో వారు నిబద్ధతతో పనిచేయగలిగితే మరింత మెరుగైన ఫలితాల్ని సాధించొచ్చు అని ఆయన సూచించారు.

104ను మరింత బలోపేతం చేయడం తో పాటు మెడికల్ మొబైల్ యూనిట్లు షెడ్యూల్ ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సిఇవో వినయ్ చంద్ , ఎపిఎంఎస్ ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి ,ఎపివివిపి కమీషనర్ డాక్టర్ వినోద్ కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి, డిఎంఇ డాక్టర్ రాఘవేంద్రరావు , అయుష్ కమీషనర్ కెప్టెన్ రాములు జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE