అడుక్కుంటే వచ్చేవి హక్కులు కావు… కొట్లాడి తీసుకోవాలి

-చైతన్యం ఎప్పుడు రగులుతూ ఉండాలి
-ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెచ్చి రిజర్వేషన్లు లేకుండా చేశారు
-17 శాతం ఉన్న ఎస్సీలకు ఒకే ఒక్కమంత్రి మంత్రి
మాదిగలకు అసలు అవకాశమే లేదు
-“ఫ్యుచరిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్” సభలో బీజేపీ నేత ఈటల సంచలన వ్యాఖ్యలు
రెడ్లు, వెలమలు బీసీ ఓట్లతో రాజ్యం ఏలుతున్నారు : ప్రొఫెసర్ వెంకటనారాయణ

బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బిర్లా ప్లానిటోరియం భాస్కర ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన “ఫ్యుచరిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్” పేరుతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ .

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అడుక్కుంటే వచ్చేవి హక్కులు కావు. కొట్లాడి తీసుకోవాలి.ఎన్ని మాట్లాడుకున్నా ఆచరణలో ఐక్యం కాకపోతే ఎన్ని సంవత్సారాలు అయినా ఇలా సభలకే పరిమితం అవుతాం. మీ హక్కును వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి ఎందుకు అడుకుంటున్నావు. ఇంత చైతన్యవంతం అయిన తెలంగాణ గడ్డ మీద ఎందుకు ఐక్యం కావడం లేదు? ఆలోచన చేయండి. చైతన్యం ఎప్పుడు రగులుతూ ఉండాలి. ఎన్ని ఎక్కువ విశ్వవిద్యాలయాలు వస్తే అంత చైతన్యం వస్తుంది అనుకున్నాం. కానీ.. అది జరగలేదు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెచ్చి రిజర్వేషన్లు లేకుండా చేశారు. అయిన మనం నిస్తేజంగా ఉన్నాము. ఉన్న వారి విశ్వవిద్యాలయాలు, లేనివారి విశ్వవిద్యాలయాలు వేరు అయ్యాయి. అన్ని విశ్వవిద్యాలయాలలో గెస్ట్ లెక్చరర్, కాంట్రాక్ట్ లెక్షరర్ తప్ప ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు.

దేశంలో నరేంద్ర మోడీ వచ్చాక.. 22 మంది obc మంత్రులు,12 మంది ఎస్సీ మంత్రులు, 8 మంది st మంత్రులు అయ్యారు.. అరవై శాతం మంది ఈ వర్గాల వారు మంత్రులు ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఎవరి జనాభా ఎంత.. ఎవరికి ఎన్ని మంత్రి పదవులు వచ్చాయి చూడండి. 17 శాతం ఉన్న ఎస్సీలకు ఒకే ఒక్కమంత్రి మంత్రి ఇచ్చారు. మాదిగలకు అసలు అవకాశమే లేదు. 1 శాతం కంటే తక్కువ ఉన్నవారు రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా సమాజం ప్రశ్నించడం లేదు.ఇంతేలే అనే భావన వచ్చింది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలకోసం కాదు. పెన్షన్, రైతుబంధు రూపంలో మన డబ్బు మనకే ఎరగా వేసి ఓట్లు దండుకుంటున్నారు. అవినీతితో సంపద కేంద్రీకృతం అయి ఓటును ఆత్మగౌరవాన్ని వెలగడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడవేసే శక్తి మీ మేధావుల చేతుల్లో ఉంది. హుజూరాబాద్ ప్రజలు ఆ చైతన్యం చూపింది. కానీ మునుగోడు ఆ చైతన్యం అందుకోవడంలో ఎక్కడో విఫలం అయ్యింది.మేధావులుగా, బిద్దు జీవులుగా ప్రజలను చైతన్యం చేసుకోవడమే మన పని. ఇది తొలి అడుగు.. కొంత మంది బానిసలు విజయవంతం కాకుండా చూస్తారు జాగ్రత్త.

ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి మాట్లాడుతూ :యాభై శాతం కంటే ఎక్కువ ఉన్న మనం.. మన బీసీ నాయకులను ఎందుకు గెలిపించుకోవడం లేదు.. బీసీలు మనకు మనం ప్రశ్నించుకోవాలి. కులంపేరుతో పార్టీ పెడితే అంబేడ్కర్ లాంటి వారు కూడా ఓడిపోయారు. సిద్ధాంతంతో ముందుకు రావాలి. రెడ్డి పేరు ఉన్నవారు అందరూ రెడ్డి అయ్యారు. ఉన్నత కులాలు యాదవ, గౌడ్, ముదిరాజ్ అంటూ బీసీలను విడదీసి ఐక్యంగా లేకుండా చేస్తున్నారు.BC లని అగ్రనాయకులను తొక్కివేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి వారిని కూడా ఎదగనీయలేదు.ద్రవిడ మామెంట్ ఒక సిద్ధాంతంతో వచ్చింది. అందుకే దానిని ఎవరు ఖతం చెయ్యలేక పోతున్నారు.వృత్తులు రక్షించండి అని మనం కోరడం అంటే వెనుకబడి ఉండడమే. రాజ్యాంగం చెప్పినట్టు మనం అందరం మనుషులమే.

ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ..యూనివర్సిటీలు నిరర్ధకంగా మారాయి. కనీసం ఆడపిల్లలకు టాయిలెట్ లేవు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు 70 శాతం మంది బీసీలే. బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తుంది అని ఆశిస్తున్నా. ఆ పార్టీ మనకోసం ఏం చేస్తుందో చెప్పాలి. రాజకీయ వెసులుబాటు బీజేపీ ద్వారా వస్తుంది అని అనుకుంటున్నాను.

రెడ్లు, వెలమలు బీసీ ఓట్లతో రాజ్యం ఏలుతున్నారు. బారాసని ఓడించాలని, కాంగ్రెస్ ను ఇరుకునపెట్టలని, బీజేపీ మీద ఒత్తిడి తేవాలని బీసీలను కోరుతున్నాను. బీసీలని చైతన్యం చేయడానికి పాదయాత్ర చేపట్టాలి. బీసీలకు నాయకత్వం ఇచ్చిన పార్టీలకే మా మద్దతు అని ప్రకటించాల్సిన అవసరం ఉంది. తెలంగాణను గుప్పిట పెట్టుకున్న కొన్ని వర్గాలను తరిమికొట్టాలి. కొద్దిమందితోనే విప్లవం మొదలవుతుంది. కోట్లమందిని కదిలిస్తుంది. ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి, ప్రొఫెసర్ వెంకటనారాయణ, తుల ఉమ, సంగెం సూర్యారావు, నగపరిమల, చొప్పరి శంకర్, సతీష్ పాల్గొన్నారు.

Leave a Reply