Suryaa.co.in

Andhra Pradesh

భక్తులు సంతృప్తి చెందేలా గదుల నిర్వహణ ఉండాలి

– అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా గదుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో గురువారం ఆయన ఆరోగ్య, ఎఫ్ఎంఎస్ విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఫుట్ పాతుల్లో మాస్ క్లీనింగ్ బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, తదితరాలు ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో భూమి కోతకు గురై రోడ్ల మీదికి మట్టి కొట్టుకుని వస్తోందని చెప్పారు. ఇలాంటి మట్టిని ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు, భూమి కోతకు గురైన ప్రాంతాల్లో పూల మొక్కలతో కూడిన ఉద్యానవనాలు పెంచాలని ఆదేశించారు. తిరుమలలోని 7500 గదులు, పిఎసి లు తిరుపతిలోని గదుల్లో శుభ్రత ఎలా జరుగుతోందని ఈవో సమీక్షించారు. గదుల శుభ్రతకు ఉపయోగించే సామగ్రి, దిండ్లు దుప్పట్లు, బ్లాంకెట్ ల కొనుగోలు విధానం, కాంట్రాక్టర్ విధానం అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యాత్రికులకు కేటాయించే గదుల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో దశలవారీగా ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేయడానికి చర్యలుతీసుకోవాలన్నారు. తిరుమలలోని దుకాణాల్లో ఎల్ఈడీ లైట్ల వాడకాన్ని అనుమతించరాదని ఆదేశించారు. లేపాక్షి సర్కిల్ అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న దుకాణాలను వెంటనే ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తిరుమలలో గదుల నిర్వహణ పారిశుద్ధ్యానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, ఎఫ్ఎంఎస్ విధానం ఎలా ప్రారంభమై ఈ దశకు చేరిందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జెఈవో వీర బ్రహ్మం, ఎఫ్ఎసిఎఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ ఈ జగదీశ్వర రెడ్డి, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డిఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE