Suryaa.co.in

Editorial

రేవంత్‌కు ‘మండలి’లో గుచ్చుకోనున్న గులాబీ‘ముళ్లు’

– 64 స్థానాలతో అసెంబ్లీలో పెద్ద పార్టీగా కాంగ్రెస్
– శాసనమండలిలో మాత్రం కాంగ్రెస్‌కు ఏకైక సభ్యుడు
– మండలిలో బలమంతా బీఆర్‌ఎస్‌దే
– బిల్లులకు మండలి ఆమోదం తప్పనిసరి
-ఏపీలో జగన్‌కు అడ్డం తిరిగిన రాజధాని బిల్లు
– రేవంత్ సర్కారు ప్రయత్నాలకు మండలి మోకాలడ్డు
– మండలిలో బిల్లు వెనక్కిపోతే ఇజ్జత్‌కా సవాలే
– ప్రస్తుతం మండలిలో ఆరు ఖాళీలు
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు జంపయితేనే కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు మనుగడ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి శాసమండలిలో గులాబీముళ్లు గుచ్చుకోక తప్పదా? ఏపీలో జగన్ మాదిరిగా రేవంత్ కూడా.. మండలిలో విపక్షాల ‘రివర్సు బిల్లు’కు, గుండె గుభిల్లుమనాల్సిందేనా? అసెంబ్లీలో అంత మెజారిటీ పెట్టుకుని, మండలిలో సర్కారు బిల్లులలన్నీ వెనక్కిపోతే పరువు తక్కువ వ్యవహారమే కదా? అది అలవాటుగా మారితే సర్కారు బండి నడిచేదెలా? మరి గులాబీ ముళ్లను రేవంత్ ఎలా దాటతారు? ఇదీ ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది తెలంగాణ చట్టసభల వ్యవహారం. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీకి మరో నాలుగు సీట్లు అదనంగా సాధించి, విజయగర్వంతో శాసనసభలో అడుగుపెట్టనుంది. అయితే అంతే ప్రాధాన్యం ఉన్న శాసనమండలిలో మాత్రం, కాంగ్రెస్ ఇంకా తన ఒక సీటుతోనే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అంటే అసెంబ్లీలో కాంగ్రెస్ సత్తా చాటినా, మండలిలో మాత్రం నేలచూపులు చూడక తప్పదు. ఇలాంటి సంకట స్థితి రేవంత్ సర్కారుకు భవిష్యత్తులో ఎదురుదెబ్బే.

ప్రభుత్వం పెట్టే బిల్లులను అటు శాసనసభ-ఇటు శాసనమండలి రెండూ పూర్తి మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడే అవి చ ట్టరూపం దాలుస్తాయి. శాసనసభలో ఆమోదించి, మండలిలో వీగిపోతే, ఇక ఆ బిల్లుపై సర్కారు ఆశలు వదులుకోవలసిందే. ఏపీలో జగన్ వైసీపీ పార్టీ తిరుగులేని మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అయితే అప్పటికి శాసనసమండలిలో వైసీపీ బలం అత్యంత బలహీనం.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా మండలిలో మాత్రం టీడీపీదే పైచేయి. దానితో జగన్ ప్రవేశపెట్టిన రాజధానుల బిల్లు మండలిలో ఓడి, వెనక్కి వెళ్లిపోయింది. ఇలాంటి అవమానాలు రేవంత్ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఓడిపోయినా, మండలిలో మాత్రం తిరుగులేని మెజారిటీతో ఉంది. అందుకే రేవంత్ సర్కారుకు మండలి అగ్నిపరీక్షగా మారింది.

తాజాగా మండలిలో బీఆర్‌ఎస్‌కు 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 1, మజ్లిస్ 2, బీజేపీ 1, పీఆర్‌టీయుకి ఒకరు సభ్యులుగా ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, తాజా ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఫలితంగా మొత్తం 6 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయి. కానీ మెజారిటీకి ఆ సంఖ్య ఏమాత్రం సరిపోదు. బిల్లుల ఆమోదానికి మెజారిటీ ఉండి తీరవలసిందే. లేకపోతే అన్నీ వెనక్కివెళ్లక తప్పదు.

తెలంగాణపై తన ముద్ర ఉండేందుకు రేవంత్ కొత్త పథకాలు, వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. అందులో గత ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న ధరణి వంటి నిర్ణయాలు కూడా లేకపోలేదు. ఇక అభివృద్ధికి సంబంధించి అనేక ప్రణాళికలు ఆయన మదిలో ఉన్నాయి. అయితే అవన్నీ కార్యాచరణ రూపంలో అమలు కావాలంటే మండలి ఆమోదం ముఖ్యం.

మరి మండలిలో కాంగ్రెస్ బలం కేవలం ఒకటే. బీఆర్‌ఎస్ సభ్యులు కాంగ్రెస్‌లోకి ఫిరాయిస్తేనే కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు మనుగడ. లేకపోతే ప్రతిసారీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు రేవంత్.. కింకర్తవ్యం?!

1 COMMENTS

LEAVE A RESPONSE