-కాంగ్రెస్ ప్రభుత్వంలో వైట్ కాలర్ నేరాలకు పరాకాష్ట
-ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ లు, స్కామ్ ల జోరే
-రెచ్చిపోతున్న సీఎం బ్రదర్స్, రంజిత్ రెడ్డి
-మరో నహీంలా మారిన సీఎం నమ్మిన బంటు ఫహీం
-సీఎం అండతో యథేచ్ఛగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వైట్ కాలర్ నేరాలు
-మోసగాళ్లకే మోసగాడు, అభినవ నీరవ్ మోడీ రంజిత్ రెడ్డి
– లియోనియో స్కామ్ లో బీజేపీ పాత్రపై అనుమానా లు
– రేవంత్ అవినీతి పై బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదు?
– స్థానిక ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మౌనం వెనుక మతలబు ఏమిటి?
– బీజేపీ శాసన సభా పక్షం కూడా కాంగ్రెస్ అవినీతిపై గళమెత్తాలి
– లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ పై అమిత్ షా స్పందించాలి
– ఈడీ,ఐటీ, సీబీఐ, జీఎస్టీ దర్యాప్తుకు అదేశించాలి
– బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెచ్చిపోతున్న ఆర్.ఆర్.ఆర్ ముఠా కనుసన్నల్లో రూ.10 వేల కోట్ల లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో వైట్ కాలర్ నేరాలకు లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ పరాకాష్ట అని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ లు, స్కామ్ ల జోరే కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్, రంజిత్ రెడ్డి రెచ్చిపోతున్నారని, వీరికి తోడు సీఎం నమ్మిన బంటు ఫహీం మరో నహీంలా మారాడని జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అండతో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి యథేచ్ఛగా వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. మోసగాళ్ల కే మోసగాడు, అభినవ నీరవ్ మోడీ రంజిత్ రెడ్డి అని ఆయన విమర్శించారు.
ఇది అంతం కాదు ఆరంభమని, ఇక నుంచి వరసగా కాంగ్రెస్ ఏ టూ జడ్ అవినీతి భాగోతాలు బయట పెడతామని జీవన్ రెడ్డి వెల్లడించారు.కాంగ్రెస్ ధనదాహాని కి తెలంగాణ కుంభ కోణాల మాయంగా మారిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, ఆర్ధిక నేరస్తుడు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, తన తాబేదారు ఫహీం ల ద్వారా దోపిడికి పాల్పడుతూ రాహుల్ గాంధీకి డబ్బు మూటలు మోస్తున్నారని ఆయన తెలిపారు.
సీఎం అండతో దోచుకుంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్నారు. రూ.10 వేల కోట్ల లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ రంజిత్ రెడ్డి దోపిడీకి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లది “కరప్షన్” కాంబినేషన్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కరప్షన్ గా ఆయన అభివర్ణించారు.
అధికారం అండతో సీఎం బ్రదర్స్, రంజిత్ రెడ్డి, ఫహీం ఖురేషీలు రెచ్చిపోతున్నారని, వారే అన్ని స్కామ్ ల సూత్రదారులు, పాత్రధారులని ఆయన ఆరోపించారు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అక్రమాల వ్యాపారి, రాజకీయ వ్యభిచారి గా మారి భూకబ్జాల లో ఘనాపాటిగా నిలిచారని మండిపడ్డారు. కబ్జా చేసిన భూములు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలుగా పొందడం రంజిత్ రెడ్డికి పరిపాటిగా మారిందన్నారు
బ్యాంకులకు టోకరా వేయడంలో మొనగాడు, మోసగాళ్లకే మోసగాడు, అభినవ తెలంగాణ నీరవ్ మోడీ ఈ రంజిత్ రెడ్డి అని ఆయన అన్నారు. రూ.5వేల కోట్ల రూపాయల పైబడి విలువ చేసే భూములు కనిపిస్తే చాలు,కబ్జా చేయడానికి అది ఏ సెంటర్ అయినా రంజిత్ రెడ్డి ఎంటరవుతారని ఆయన తెలిపారు.
రంజిత్ రెడ్డి ఒక పెద్ద వైట్ కాలర్ అఫెండర్ , అతడు పుట్టుకతోనే అవినీతి అక్రమాలకు ఫౌండర్ అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రంజిత్ రెడ్డి దోపిడీకి షామీర్‌పేట్ లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.
‘లియోనియా హోలిస్టిక్ డెస్టినేషన్ షామీర్ పేట్ లో ఒక ప్రముఖ రిసార్ట్.
హోటల్, కన్వెన్షన్ సెంటర్, మరియు వినోద సౌకర్యాల సముదాయం ఇది.
ఇందులో హోటల్ రూములు, సూట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, స్పా, రెస్టారెంట్లు, మరియు వినోద కార్యకలాపాలు ఉన్నాయి. లియోనియా రిసార్ట్ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 50 లక్షల స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. లియోనియా రిసార్ట్ హోలిస్టిక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీ ఎల్ టీ) కేసులో చిక్కుకుంది.
2020-2021 సమయంలో, రిసార్ట్ ఆర్థిక ఇబ్బందులు, రుణాల డిఫాల్ట్‌ల కారణంగాఎన్ సీ ఎల్ టీ ద్వారా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో 2023-2024 లోఎన్ సీ ఎల్ టీ పర్యవేక్షణ లో రిసార్ట్ ఆస్తులు వేలం ద్వారా విక్రయించారు.
సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ అరాచక ముఠా రంగ ప్రవేశం చేసింది’ అని జీవన్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్ బ్రదర్స్ అండదండలతో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసి లియోనియా రిసార్ట్ హోలిస్టిక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నామ మాత్రపు రేటుకు దక్కించు కుందన్నారు.
నిజానికి అప్పటి లెక్కల ప్రకారం లియోనియా రిసార్ట్ హోలిస్టిక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులతో సహా వివిధ సంస్థలకు రూ. 2 వేల 221కోట్ల 94లక్షలు చెల్లించాలి. మిగిలిన రుణదాతల ప్రస్తావన లేకుండానే బ్యాంకుల కే రూ. 1753కోట్లు అప్పుపడింది.
ఆ రుణాన్ని తిరిగిరాబట్టుకోవడానికి బ్యాంకుల ఆధ్వర్యంలో వేలం నిర్వహించగా జలవిహార్ కంపెనీకి చెందిన ఎన్ వీ రాజు కేవలం రూ.331కోట్ల 36 లక్షలకు లియోనియా రిసార్ట్ హోలిస్టిక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ను దక్కించుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ ముఠా బెదిరింపులతో 10వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ 25-2-2025 న కేవలం రూ.331కోట్ల 36 లక్షలకు అవార్డ్ అయిందన్నారు.
ఓ వైపు నన్ను కోసినా నయా పైస లేదని, అప్పుల కోసం పోతే చెప్పులెత్తుకెళ్లే దొంగను చూసినట్టు చూస్తున్నారని పెడబొబ్బలు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కామ్ పై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి మనసురాని బ్యాంకులు 2 వేల 221కోట్ల 94లక్షల రూపాయల రుణాలను కూడా పూర్తి స్థాయిలో వసూలు చేసుకోకుండా 10వేల కోట్ల రూపాయల విలువ చేసే చేసే ప్రాపర్టీని కేవలం రూ.331కోట్ల 36 లక్షలకు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కాగా మరో మూడు కంపెనీలు బిడ్లు వేసినా సీఎం పేషీ నుంచి ఫహీం ఖురేషి బెదిరించి వారు బిడ్లు ఉపసంహరించుకునేలా చేశారు. ఎంత అలవచులవలుగా అంటే మొత్తం బ్యాంకు అప్పులో కేవలం 13శాతం మాత్రమే ఇచ్చి ప్రస్తుతం రూ. 10వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని కొల్లగొట్టారు అని ఆయన తెలిపారు. ఈ డీల్ లో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కి 50శాతం వాటా ఉందన్నారు. దాదాపు పది బ్యాంకులకు టోపీ పెట్టిన రంజిత్ రెడ్డి అదే బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు పొందే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు.
రిసార్ట్ హోలిస్టిక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలో రెండు వందల ప్లాట్లు విక్రయించారని, ఈ రిసార్ట్ లో కోట్లాది రూపాయలు వసూలు చేసి దాదాపు 5వేల మందికి సభ్యత్వం ఇచ్చారని జీవన్ రెడ్డి పేర్కొంటూ ఇప్పుడు ఏకపక్షంగారిసార్ట్ హోలిస్టిక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ను వేలం వేయడంతో ప్లాట్లు కొన్న రెండు వందల మంది కొనుగోలుదారులు, రిసార్ట్ లో కోట్లు చెల్లించి సభ్యత్వం తీసుకున్నవారి పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు.
ఇన్ని వైట్ కాలర్ నేరాలు, మనీ లాండరింగ్ ఘోరాలు, వేల కోట్లు చేతులు మారుతున్న ఆర్థిక బేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నా ఈడీ నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి వంటి బ్రోకర్లను చేరదీసి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు సాగిస్తున్న అక్రమ దందాల సొమ్ము బీజేపీ ఎంపీ లకు కూడా ముడుతోందని ప్రజలను కుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొంటూ ఈ కుంభకోణంలో విశ్వేశ్వర్ రెడ్డి వాటా ఎంత అని నిలదీశారు.
బీజేపీ నేతల ప్రమేయం ఉంది కాబట్టే ఈడీ ఈ ఆర్ధిక నేరాలపై దృష్టి పెట్టడం లేదా? అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి లు ఎందుకు ఈ కుంభకోణాలపై నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు. శాసనసభలో బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ లియోనియా స్కామ్ పై స్పందించకపోతే వారికి కూడా వాటాలున్నాయని భావిస్తామన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించి సీబీఐ, ఐటీ, ఈడీ, జీఎస్టీ దర్యాప్తు చేయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే లియోనియా రిసార్ట్ స్కామ్ పై విచారణకు ఆదేశించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.