‘‘కేసీఆర్…. అసెంబ్లీలో నీకు డబుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్) చుక్కలు చూపిస్తున్నరు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత మరో ఆర్ (రాజేందర్) వస్తున్నడు. ప్రగతి భవన్ ముందు నీకు ‘‘ట్రిపుల్ ఆర్’’ సినిమా చూపిస్తా’’ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి.
ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 20 వేల మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. దీంతో బీజేపీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నాయి. బాణాసంచా పేల్చి, డ్యాన్సులు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నాయి. అందులో భాగంగా కొందరు బీజేపీ నాయకులు ఏకంగా రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ ఫొటోలు ఒకవైపు బండి సంజయ్ ఫొటో మరోవైపు పెట్టి ‘ట్రిపుల్ ఆర్’ ఫ్లెక్సీలు రెడీ చేశాడు. వ్యాన్ కు ఫ్లెక్సీని అంటించి ప్రగతి భవన్ ఎదుట తిరుగుతూ హల్ చల్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన మీడియా ప్రగతి భవన్ కు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీశాయి. కేసీఆర్ కు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపించడం ఖాయమంటూ బీజేపీ నేతలు ఎక్కడ చూసినా చర్చించుకోవడం గమనార్హం.