( సంపత్‌రాజు)
పాపం..సత్యజిత్ రే…
కళాఖండాలను తియ్యడానికి
ఎంతగా పరితపించాడో…
పథేర్ పాంచాలి వంటి గొప్ప సినిమాని అందించి…కేన్స్ చలనచిత్ర ఉత్సవంలో పదకొండు అవార్డులు
గెలుచుకుని… ఇరవయ్యో శతాబ్దపు అతి గొప్ప దర్శకుడిగా పేరు గాంచినా… ఆస్కార్ పురస్కారం అందుకునే ఆస్కారం లభించలేదు…కాకపోతే సినిమా రంగంలో ఆయన చేసిన అపూర్వ కృషికి గాను
ఆస్కార్ గౌరవ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయునిగా ఒక గుర్తింపు… ఆయన ప్రస్థానం అంతే…
వి.శాంతారామ్…
ఎన్ని సినిమాలు తీసాడో…
ఎన్నెన్ని హిట్లు కొట్టాడో…
ఇంకెన్ని ప్రశంసలు అందుకున్నాడో…
నవరంగ్…
దో ఆంఖే బారా హాత్…
ఝనక్ ఝనక్ పాయల్ బాజే…
వేటికవే అపురూప చిత్రాలు…
కళాఖండాలు…
ఆయన ఆస్కార్ గుమ్మమే తొక్కలేదు…
రాజ్ కపూర్…
బిగ్గెస్ట్ షో మాన్ ఆఫ్ ఇండియా…
ఒకనాడు రష్యన్లను మీకు ఇండియా గురించి ఏం తెలుసని అడిగితే పండిట్ నెహ్రూ…..రాజ్ కపూర్…
ఆ ఇద్దరూ బాగా తెలుసని చెప్పారంటే ఆయన మహత్తు ఎంతటిదో అవగతం కాదా…!
సంగం…శ్రీ 420…ఆవారా…
మేరా నామ్ జోకర్… జిస్ దేశ్ మే గంగా బెహతీ హై…బాబీ…
కల్ ఆజ్ ఔర్ కల్…సత్యం శివం సుందరం…
రామ్ తెరీ గంగా మైలి…
వీటిలో ఏ సినిమా గొప్పది అంటే సమాధానం చెప్పడం సినీ పండితులకే దుర్లభం…
జిస్ దేశ్ మే గంగా బెహతీ హై… నరనరానా దేశభక్తి నింపిన పాట…వింటుంటేనే ప్రతి భారతీయుడి ఒడలు పులకించే అద్భుత గీతం…!
మరి అన్ని అపురూప చిత్రాలను నిర్మించడమే గాక దర్శకత్వం వహించి…తానే హీరోగా నటించిన
రాజ్ కపూర్ ఆస్కార్ వేదిక మెట్లయినా ఎక్కగలిగాడా…!?
ఇంకా…మృణాల్ సేన్… శ్యాం బెనెగల్… ఎన్నెన్నో అపురూప చిత్రాలు తీశారు… ప్రపంచ సినిమాకే తలమానికంగా నిలిచిన బాలీవుడ్ ఇంకెందరో దిగ్గజ దర్శకులకు వేదికగా నిలిచింది…! ఇక నాణ్యమైన కధా చిత్రాలు…కమర్షియల్ పోకడలకు పెద్దగా పోని మలయాళ సినీ రంగంలో మహా మహా దర్శకులకు కొదవే లేదు…
వారెవరూ ఆస్కార్ గుమ్మం తొక్కలేదు…తమిళ…
ఒరియా…పంజాబీ…
ఏ భాషలో చూసుకున్నా
లబ్ద ప్రతిష్టులైన
ఎందరో దర్శకులు భారతీయ సినిమాని సుసంపన్నం చేశారు.
మన తెలుగులో…
ఒకనాడు బి ఎన్ రెడ్డి…
కె వి రెడ్డి…
చిత్తూరు వినాగయ్య…
ఆదుర్తి…పి పుల్లయ్య…సి పుల్లయ్య …విఠలాచార్య…
మన తరం చూసిన
కె విశ్వనాథ్…
దాసరి నారాయణరావు…
కె రాఘవేంద్రరావు…
బాపూ…
ఇలా చెప్పుకుంటూ పోతే
ఒక పరంపర…
ఒకనాడు అద్భుతమైన సందేశంతో నిర్మించిన
స్వర్గసీమ…మాలపిల్ల వంటి సినిమాలు…మన సంస్కృతిని…చరిత్రను
ప్రతిబింబించిన
యోగివేమన…త్యాగయ్య…
ప్రపంచ సినిమా చరిత్రలోనే అద్భుత దృశ్యకావ్యంగా పేరొంది…స్క్రీన్ ప్లే…చిత్రీకరణ…అభినయం…తదితర అన్ని విభాగాల్లో
ఎన్నో రకాలుగా విమర్శకుల ప్రశంసలను అందుకున్న
మాయాబజార్…
అపురూప ప్రణయకావ్యం
మల్లీశ్వరి…
అభినయ పరాకాష్ట
దేవదాసు…
నిన్న మొన్నటి మేఘసందేశం…
అన్నమయ్య…
కళాతపస్వి విశ్వనాథ్ అందించిన
మహాకావ్యాలు శంకరాభరణం…సాగరసంగమం…స్వాతిముత్యం…
ఏ సినిమా గురించి చెప్పాలి…
వీటిలో దేనికీ…ఎవరికీ రాని గుర్తింపు ఈ రోజున ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు వచ్చింది…ఆ గీతాన్ని
ఆస్కార్ వరించడం
భారతీయ సినిమాకి…
తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమే…
ఇది నిస్సందేహం…!
అయితే…ఇక్కడే మనం కూడా కొంతమేర ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం…!
ఆ పాట నిజంగా అంత గొప్పదా…సాహిత్యపరంగా
అందులో ఏమి విలువలు ఉన్నాయి…మల్లీశ్వరి…మేఘసందేశం…శంకరాభరణం…
సినిమా పాటలతో పోలిస్తే
నాటు నాటు అంత గొప్పదా…డాన్స్ అనుకుంటే
ప్రభుదేవా ప్రేమికుడులో
వేసిన స్టెప్పుల కంటే చిత్రమైనవా…రాగం తానం పల్లవి…నా మదిలోన కడలాడి కడతేరమన్నవి…
ఈ పాట చిత్రీకరణ కంటే
అపురూపమా…
అదే శంకరాభరణం సినిమాలో
శంకరశాస్త్రి ఆపేసిన వెంటనే
బుల్లి శంకరం అందుకుని
పాటను పూర్తి చేసిన ఘట్టాన్ని మించిన పట్టమా…
మేఘసందేశం సినిమాలో
మెలోడీకి ప్రాణం పోసిన పాటలు ఎన్ని లేవు …
సాగరసంగమంలో కమల్ అభినయం…ముఖ్యంగా
బావి మీద కమల్ హాసన్ చేసిన నృత్యం…
ఏమైపోయాయి
ఈ ప్రదర్శనలన్నీ…
ఇవన్నీ నాటు నాటు ముందు అంత తీసి కట్టా…?
ఆస్కార్ ఏమి ఆలోచించింది… దేన్ని పరిగణనలోకి తీసుకుంది…
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ఎంపిక విషయ రకరకాల కథనాలు ఉన్నాయి…
అవార్డు రావడం సంతోషమే…కర…అనే సందేహాలు
రాకుండా ఇదంతా జరిగి ఉంటే ఎక్కడో లోలోపల
ఆ అనుమానపు పొర రావడానికి ఆస్కారం లేకుండా జరిగి ఉంటే ఇంకా బాగుండేదేమో…!?