Suryaa.co.in

Andhra Pradesh

ఏటా రూ.2,500 కోట్ల స్వాహాకు సిద్ధమైన జగన్ రెడ్డి

పేదల ఇళ్ల స్థలాల లే-అవుట్లలో ఏటా రూ.2,500 కోట్ల స్వాహాకు సిద్ధమైన జగన్ రెడ్డి
– పేదల ఇళ్ల కోసమంటూ ఇదివరకే సేకరించిన 68 వేల ఎకరాలు మీ వద్ద ఉండగా కొత్తగా లే-అవుట్లలో 5 శాతం నిబంధనతో సుమారు 1000 ఎకరాల కోసం గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు?
– బిల్డ్ ఏపీ పేరుతో ఒక ప్రక్క ప్రభుత్వ భూములు తెగనమ్ముతూ ఇప్పుడు తిరిగి పేదవారి భూముల కోసమని కొత్త నాటకానికి తెరలేపుతారా?
– టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తన బాదుడు కార్యక్రమాలను రోజుకోరకంగా వినూత్నంగా అమలుచేస్తున్నారని, ఆయన నియమించుకున్న దాదాపు 40 మంది సలహాదారులు కూడా ఎక్కడా ప్రజలకు మేలుచేసే సలహాలు, వారికి ఉపశమనం కలిగే నిర్ణయాలను ముఖ్యమంత్రికి ఇస్తున్నట్టుగా లేదని, ఎప్పుడూ ఏరకంగా ఇంకా ప్రజలపై భారాలు మోపుదామా…ఏరకంగా ప్రజల వీపులు పగిలేలా బాదుడు కార్యక్రమాలు అమలుచేయాలన్న దానికే వారు అధికప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే……..
“జగన్మోహన్ రెడ్డి బాదుడుకార్యక్రమంలో కొత్తఅంకం మొదలైంది. లేఅవుట్ బాదుడు పేరుతో నేడుపత్రికల్లో ప్రధానవార్తగా వచ్చింది. పట్టణమధ్యతరగతివారికి ఝలక్ అని, లే అవుట్లలో అదనంగా 5శాతంస్థలం, జగనన్నఇంటిస్థలాలకు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. దానికి సంబంధించి నిన్ననే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ వారినుంచి (డిసెంబర్ 6న) ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని ప్రకారం ఇకమీదట వేసే ప్రతి లే అవుట్ లో పేదలకు ఇళ్లునిర్మించడానికి 5శాతం స్థలం ప్రభుత్వానికి అప్పగించాలని, అలా ఇవ్వలేకపోతే, సదరులే అవుట్ కు మూడుకిలోమీటర్ల పరిధిలో 5శాతం స్థలానికి సంబంధించిన స్థలం ఇవ్వాలని, అదికూడా వీలుకాకపోతే, 5శాతం స్థలంఎంతవిలువ అయితే ఉంటుందో, దానికి సరిపడే ధనాన్ని (సొమ్ముని) ప్రభుత్వానికి (ప్రభుత్వవిలువప్రకారం) చెల్లించాలని ఆదేశించారు.
ఒక్కసారి గతంలో ఉన్న నిబంధనలు పరిశీలిస్తే, లే అవుట్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నెం-275ప్రకారం ఏ లేవుట్ వేసినా దానిలో 30శాతం భూమిని రోడ్లకు, 10శాతం భూమిని పబ్లిక్ స్పేస్ కు, లే అవుట్ ఏరియా5హెక్టార్లకంటే తక్కువఉంటే 2శాతం, 5శాతంకంటేఎక్కువ ఉంటే 3శాతంభూమిని అమినిటీస్ కు, 0.5నుంచి1శాతంవరకు యుటిలిటీస్ కు ఇవ్వాలని ఉంది. అంటే ప్రతి లే అవుట్ లోకూడా దాదాపుగా 44శాతం స్థలాన్ని రోడ్లకు, పబ్లిక్ స్పేస్ లకు వదలాలనే నిబంధన గెజిట్ నోటిఫికేషన్ నెం-275ప్రకారం ఉంది. కానీ ఇప్పుడు జగనన్నప్రభుత్వంఇచ్చిన కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం దానికితోడు 44శాతానికిఅదనంగా మరో 5శాతం భూమిని (అంటే 49శాతం) ఇవ్వాల్సి ఉంటుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ వారిజేబుల్లోని సొమ్ముని పేదలకు ఇవ్వరు. జగనన్న నిర్ణయంతో ఆభారం రూపాయిరూపాయి పోగుచేసుకొని స్థలంకొని, ఇల్లుకట్టుకోవాలనుకున్న వారిపైనే పడనుంది. ఒకపక్కన ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ఇసుక, సిమెంటు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు భూమి ధరలు కూడా పెరిగేలాచేస్తున్నారు. దీని వల్ల అంతిమంగా నష్టపోయేది పేద, మధ్యతరగతి వర్గం ప్రజలే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో కలిపి ఏటా సరాసరిన ఇళ్ల ప్లాట్లకు సంబంధించి 20 వేల ఎకరాలలో డీటీసీపీ లేఅవుట్లు వేస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రతీ లే-అవుట్ లో 5 శాతం భూమి వదిలితే, 20 వేల ఎకరాల లే అవుట్లలో దాదాపుగా 1000 ఎకరాలు వదలాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా 1000 ఎకరాల భూమి అయినా ఇవ్వాలి…లేదా దానికి సరిసమానమైన డబ్బైనా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్టర్లు తామువేసిన లే అవుట్లలో 5 శాతం భూమి వదిలే పరిస్థితి కానీ లేక లే-అవుట్ కు సమీపంలో భూమి కొనుగోలు చేసి ఇచ్చే పరిస్థితి గానీ లేదు కాబట్టి డబ్బు చెల్లించడానికే మొగ్గుచూపుతారు. ఆ రకంగా 1000 ఎకరాలు అనగా 50 లక్షల గజాల (ఎకరాలకు షుమారు 5000 గజాల చొప్పున) భూమి తాలూకు సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లించాలి.
ఒక్కో గజం విలువ హీనపక్షంగా రిజిస్ట్రేషన్ వ్యాల్యూప్రకారం తక్కువలో తక్కువగా రూ.5వేలు ఉంటుంది. 50లక్షల గజాలకు రూ.5వేలచొప్పున లెక్కిస్తే, సంవత్సరానికి ఈ బాదుడు ముఖ్యమంత్రికి చెల్లించాల్సింది రూ.2,500 కోట్లు. జగనన్న గారు కొత్తగా తీసుకొచ్చిన బాదుడు కార్యక్రమం కింద ఏటా రూ.2,500 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఇంకా తక్కువగా గజం రూ.5 వేలకే లెక్కకట్టాము. కొన్నిప్రాంతాల్లో దాని విలువ రూ.10వేలు, రూ.15వేలు కూడా ఉంటుంది. అప్పుడు భారం రెండింతలు, మూడింతలు అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ హీనపక్షాన జగన్ ప్రభుత్వానికి ఏటా రూ.2,500 కోట్లు కప్పం కట్టాల్సి ఉంది.
ఆ సొమ్ముని రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి జేబుల్లోంచి కట్టవు. ముక్కుపిండి మరీ కొనుగోలుదారులైన పేదలు, మధ్యతరగతి వర్గాల నుంచే వసూలు చేస్తాయి. ఆవిధంగా ఏటా రూ.2,500 కోట్ల బాదుడు కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లే అవుట్లలో 5శాతం భూమి ప్రభుత్వానికి బదలాయింపు పేరుతో ప్రభుత్వమిచ్చిన స్పెషట్ గెజిట్ నోటిఫికేషనే అందుకు నిదర్శనం. పేదవాడికి మంచి ఇల్లు, ఇంటి జాగా కావాలని, వారి నుంచి రూపాయి తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేం కూడా కోరుకుంటున్నాం.
కానీ ఆ ముసుగులో ఇదివరకే జగనన్న ప్రభుత్వం 30.07 లక్షల మంది పేదలకు, ఇంటి జాగాలపేరుతో రూ.23,535 కోట్ల విలువైన 68,301 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించినట్లు ప్రభుత్వ అఫీషియల్ గెజిట్ అయిన సాక్షి పత్రికలోనే డిసెంబర్ 24, 2020న ప్రచురించారు. ఇదివరకే పేదల ఇళ్ల కోసం 68 వేల ఎకరాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు లే అవుట్ల నుంచి అదనంగా 1000 ఎకరాలు ఎందుకన్నదే మా ప్రశ్న. పేదవాడి పేరుచెప్పి, ఇప్పుడు మరో 1000ఎకరాలు ఎందుకు అడుగుతున్నారు? ఎలాగూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమిఇవ్వరు…డబ్బులు ఇస్తారు కదా అని ఆలోచనచేసి, 1000ఎకరాల కింద రూ.,2500కోట్ల బాదుడుకార్యక్రమానికి శ్రీకారంచుట్టారా? ఇదివరకే మీరు సేకరించినట్లు చెప్పుకుంటున్న భూమిని పేదలకు ఇవ్వకుండా, పేదల పేరుతో ఇప్పుడు 1000 ఎకరాలకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకొచ్చింది?
ఈ ముసుగులో హీనపక్షంగా ఏటా రూ.2,500 కోట్లను కొట్టేయడానికి జగన్ అండ్ కో సిద్ధమయ్యారు. సర్కారువారి ప్రభుత్వ భూములు వేలమని, ఇదివరకే పత్రికల్లో చూశాం. దానికి సంబంధించి బిల్డ్ ఏపీ పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టారు. హైకోర్ట్ కూడా ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వానికి చీవాట్లుపెట్టి, ప్రభుత్వం దివాలాతీసిందా ఈ రకంగా భూములు తెగనమ్మటానికి అంటూ ఘాటువ్యాఖ్యలు కూడా చేసింది. ఒకపక్కన అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి…మరోపక్కన నోటిఫికేషన్లు ఇస్తూ, ఇంకా ఇంకా భూమికావాలనడం దేనికి? ఇదివరకు తీసుకున్న 68వేలఎకరాలనే పేదలకు ఇంకాసరిగా పంచలేదు.
ఇదివరకే ప్రభుత్వంచేతిలో 68 వేల ఎకరాలుంటే, ఇప్పుడు 1000 ఎకరాల కోసం గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? కేవలం మీ ఖజానా నింపుకోవడానికే అని మేం అంటున్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి పేదలకు ఇంటిస్థలం ఇవ్వాలని ఉంటే, ప్రభుత్వ భూములుఅమ్మాలని చూడటంఏమిటి? వాటినే పేదలకు పంచొచ్చు కదా? ప్రభుత్వభూములు అమ్మడం, తాకట్టుపెట్టడం ఎందుకు? పేదవారికోసం పలానాప్రభుత్వభూమిని ప్లాట్లవేసి, వారికి ఇస్తున్నామంటే ఎవరు కాదంటారు? అసైన్డ్ భూములు, ఇతరత్రాభూములను ఏళ్లతరబడి స్వాధీనంలో ఉన్నవారినుంచి బలవంతంగా గుంజుకోవడం ఎందుకు?
జగన్మోహన్ రెడ్డి పేదలకోసం ప్రభుత్వ భూమిని ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా స్వాగతిస్తుంది. కానీ, మీరు తీసుకొచ్చే ప్రతి స్కీం వెనుక పెద్ద స్కామ్ ఉంటోంది. ఎక్కడా పేదవాడి సంక్షేమం కనిపించడంలేదు.
ఒక్కవిశాఖలోనే రూ.1600కోట్ల విలువైన ప్రభుత్వభూమిని ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు తనఖాపెట్టారు. ప్రభుత్వభూముల్ని వేలం వేసినా వచ్చే డబ్బుచాలక, ఇదివరకు సేకరించిన 68 వేల ఎకరాలు చాలక, ఇప్పుడు మరలా కొత్తగా 1000ఎకరాల కోసం గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇవన్నీ దేనికయ్యా అంటే ఎక్కడా ఈ ప్రభుత్వానికి రూపాయి పుట్టడంలేదు. అందుకే ఇప్పటికే ఓటీఎస్ పేరుతో కాల్ మనీ స్కీంకు తెరలేపి వేల కోట్ల దోపిడీకి సిద్ధమైంది. పేదవాడి పేరుచెప్పి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా రియల్ ఎస్టేట్ వారినుంచి 5శాతంభూమి పేరుతో కొత్తదోపిడీకి తెరలేపారు.
ఆ 5శాతంభూమి విలువే తక్కువలో తక్కవ వేసుకున్నారూ.2,500 కోట్ల వరకు ఉంది. పనికిమాలిన సలహాదారులను పక్కనపెట్టుకున్న ముఖ్యమంత్రి, ఈవిధంగా వీలైనప్పుడల్లా కొత్తకొత్తపద్ధతుల్లో పేదలు, సామాన్యప్రజలపై భారంవేస్తున్నాడు. తనకు అత్యంత ఆప్తులైన అరబిందో, రాంకీ, ఇందూ వంటి సంస్థలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు వారికి మేలు చేయాలన్నట్లుగా మన రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యపారాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉన్నాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఈ కుట్రపూరితమైన నిర్ణయంతో ఒకవైపు ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా అగాధంలోకి నెట్టివేస్తూ లక్షల మందికి ఉపాధి లేకుండా చేస్తూ… మరోవైపు దాదాపు రూ.2500 కోట్ల భారాన్ని ప్రతీ సంవత్సరం మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలపై మోపబోతున్నారు.

LEAVE A RESPONSE