Suryaa.co.in

Telangana

బీఎస్పీ పేరుతో క్రైస్తవ మాఫియా సాగిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-విశ్వహిందూ పరిషత్ ఘాటు విమర్శ
-ప్రవీణ్ కుమార్ పాస్టరా..? లేక నాయకుడా..?
-అక్రమంగా అరెస్టు చేసిన బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి
-క్రైస్తవులుగా కొనసాగుతూ ఎస్సి సర్టిఫికెట్ తో లబ్ధి పొందుతున్న వారి సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
-శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. విద్వేషాలు సృష్టిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయాలి
-అక్రమ కేసులను నిరసిస్తూ మోకిలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించి తీరుతాం

బహుజన్ సమాజ్ వాది (బీఎస్పీ)పార్టీ పేరుతో మాజీ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ రాజకీయం చేస్తున్నాడా..? లేక క్రైస్తవ మత ప్రచారం చేస్తూ పాస్టర్ గా కొనసాగుతున్నాడా..? అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. తను ఉద్యోగం చేసినన్ని రోజులు హిందూ ధర్మంపై విపరీతమైన దాడి చేసి, క్రైస్తవ మతమార్పిడికి బీజాలు వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రస్తుతం బహుజన సమాజ్ వాది పార్టీని అడ్డం పెట్టుకొని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించింది.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలో జరిగిన గొడవలను రెచ్చగొడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రోడ్డు నిర్మాణం పనుల సందర్భంగా క్రైస్తవ మాఫియా కావాలని హిందువులపై దాడికి దిగబడుతుందని విమర్శించారు.

అసలు క్రైస్తవులుగా కొనసాగుతున్న వ్యక్తులు ఎస్సీలుగా చెప్పుకోవడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ పేరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొనసాగిస్తున్న క్రైస్తవులను వెంబడే గుర్తించి వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. చర్చి కోసం పోరాడుతున్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారందరి సర్టిఫికెట్లను రద్దు చేసి బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. అందుకు కలెక్టర్ ను కోరుతామని చెప్పారు. వాళ్ల సర్టిఫికెట్ రద్దు కోసం ఇంతకు మించిన పెద్ద ఎవిడెన్స్ ఇంకొకటి లేదని తేల్చి చెప్పారు.

అమాయక హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులను నమోదు చేసి అన్యాయంగా అరెస్టు చేస్తున్న పోలీసులు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని విధ్వంసాలకు పాల్పడుతున్న క్రైస్తవ మాఫియాను అడ్డుకొని తీరుతామని.. వారిని రెచ్చగొడుతూ హిందువులపై ఉసుగొలుపుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బహుజన్ సమాజ్ వాద్ పార్టీ నీ అడ్డం పెట్టుకొని క్రైస్తవ మతమార్పిడికి పాల్పడుతున్న వ్యక్తిపై , ఆ పార్టీ జాతీయ నేత మాయావతి కూడా దృష్టి సారించాలని సూచించారు.

ఎట్టి పరిస్థితులలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం రాత్రి నుంచి అన్యాయంగా అరెస్టు చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలను వెంబడి విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు.

అరెస్టు చేసి గృహ నిర్బంధించిన కార్యకర్తలను వెంబడే వదిలిపెట్టాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమని నేతలు హెచ్చరించారు. ఎంతటి నిర్బంధాలు కొనసాగిన మోకిలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించి తీరుతామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE