– కమ్మ, కాపు, క్షత్రియ కులాల కంపెనీలే లక్ష్యంగా వసూళ్లు
– గతంలో సామర్లకోట ఆర్టీఐ దళారీ దందాలపై తిరగబడ్డ పెద్దాపురం కమ్మ వర్గ పారిశ్రామికవేత్తలు
– దానితో ఆగిపోయిన సామర్లకోట దళారీల దౌర్జన్యం
– కాకినాడ, రాజమండ్రిలో ‘ఆర్టీఐ’ దందా దళం
– వాళ్లే ఫిర్యాదు చేయిస్తారు.. వాళ్లే పరిష్కరిస్తారు
– సస్పెండయిన సీఐడీ మాజీ బాసు దన్నుతో దందాలు?
– ఆయన సంస్థలో సభ్యుల పేరుతో రెచ్చిపోయిన వైనం
– వైసీపీ జమానాలో రెచ్చిపోయిన ఆర్టీఐ దందాదళం
– ఆర్టీఐ నివేదిక ఆధారంగా పరిశ్రమలకు బెదిరింపులు
– ఆర్టీఐ దందా దళంతో మాట్లాడుకోమంటూ పేషీ ‘జూనియర్’ సలహా
– ‘తూర్పు’లో బెంబేలెత్తుతున్న పారిశ్రామికవేత్తలు
– ఫ్యాక్టరీస్, పీసీబీ అధికారులపై ఆర్టీఐ దళారీల బె దిరింపులు
– ఏడాదికి ఇంత అని పరిశ్రమల నుంచి మామూళ్లు ఫిక్స్
– మాట వినని అధికారిపై ఫిర్యాదులు, వాట్సాప్ పత్రికల్లో వ్యతిరేక కథనాలు
– ఆర్టీఐలను తిప్పిపంపిన అధికారులను ‘సీమ’కు బదిలీ
– ఇప్పుడు అదే ‘జూనియర్’ కార్మికశాఖ పేషీలో తిష్ఠవేసిన వైనం
– ‘చక్ర’ం తిప్పుతున్న పేషీ రింగ్‌మాస్టర్
– కళ్లప్పగించి చూస్తున్న తూర్పు కలెక్టర్, ఎస్పీలు
– ఆ ‘జూనియర్’ వెనక పెద్ద తలలు?
– అతగాడిపై వైసీపీ హయాంలో ఓ ఫ్యాక్టరీ అధికారి నివేదిక
– కులబలంతో ఇప్పటివరకూ చర్యల కొరడా ఝళిపించని వైచిత్రి
– ‘జూనియర్’కు భయపడుతున్న సీనియర్లు
– సొంత అధికారి నివేదిక ఇచ్చినా కార్మిక శాఖ పేషీలో డెప్యుటేషన్
– పరిశ్రమలకు దిక్కెవరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
– ఆ గ్రామంలో రైస్‌మిల్లుపై సర్పంచి విజిలెన్సుతో దాడులు చేయిస్తారు. తర్వాత ఆయనే రంగంలోకి వ్యవహారం సెటిల్ చేస్తారు. దానికి ఓ రేటు కడతారు.
– ఆ టౌన్లో పెద్ద హోటల్‌పై చైర్మన్గారే దాడి చేయించి, తర్వాత ఆ వ్యవహారాన్ని ఆయనే సెటిల్ చేస్తారు. దానికో రేటు నిర్ణయిస్తారు.
– ఆ నియోజకవర్గంలోని ఓ పెద్ద ఫ్యాక్టరీపై ఎమ్మెల్యే గారే కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయిస్తారు. తర్వాత ఆయనే రంగంలోకి దిగి రాజీ కుదురుస్తారు. అందుకాయనకు ఫ్యాక్టరీ యజమాని ఇచ్చుకునే ఫీజు భారీగానే ఉంటుంది.
* * *
ఇవన్నీ రక్తకన్నీరు నాగభూషణం, సత్యనారాయణ, రావుగోపాలరావు కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసినవే. అంటే వాళ్లే తమ అనుచరులతో ఫిర్యాదు చేయించి.. వాళ్లే రంగంలోకి దిగి చక్కబె డుతుంటారన్న మాట! ఈ మొత్తం వ్యవహారంలో మింగే మామూళ్లు, కొంత ఆ ప్రజాప్రతినిధుల కింద పనిచేసే అనుచరులకూ వెళుతుంటాయి.
సీన్ కట్ చేస్తే…
ఈ డిజిటల్, మల్టీఫ్లెక్స్, శాటిలైట్ సినిమా కాలంలోనూ, సేమ్ సీన్ రన్నవుతుండటమే విచిత్రం. పాత్రలు అవే అయినా పాత్రధారులే మారారు. అప్పట్లో వందలు.. తర్వాత వేలు.. ఇప్పుడంతా లక్షలు. తేడా అల్లా అదే! మిగిలినంతా ‘షేమ్’ టు ‘షేమ్’!!
* * *
రాష్ట్రంలో పరిశ్రమలకు పట్టం కట్టే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పారిశ్రామికవేత్తలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. గతంలో తమను కులం కోణంలో వేధించిన జగన్ సర్కారు స్థానంలో, తాము కోరుకున్న కూటమి సర్కారు రావడంతో కమ్మ-కాపు-క్షత్రియ పారిశ్రామికవేత్తలు సంబరపడ్డారు. నిజానికి జగన్ గద్దె కూలాలని కోరుకున్న ఈ పారిశ్రామికర్గాలు, గత ఎన్నికల్లో రాష్ట్ర-నియోజకవర్గ స్థాయిలో టీడీపీ-జనసేన-బీజేపీకి విరాళాలు ఇచ్చాయి. మొత్తానికి వారు కోరుకున్నది జరిగింది.
కానీ తర్వాత వారి పరిస్థితి పొయ్యి నుంచి పెనం మీద పడినట్లయింది. ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో ఒక సామాజికవర్గానికి చెందిన అధికారులు- పేషీలో పనిచేస్తూ ‘చక్ర’ం తిప్పుతున్న ఓ ‘జూనియర్’ రింగ్‌మాస్టర్ నేతృత్వంలో.. కమ్మ-కాపు-క్షత్రియ కులాలకు చెందిన పరిశ్రమలే లక్ష్యంగా, వేధింపులకు పాల్పడుతున్న వైనం వారిని విస్మయానికి గురిచేస్తోంది.
ఇన్ని ఆరోపణలు వస్తున్నా సదరు ‘జూనియర్’ను ఇంకా పేషీలోనే కొనసాగిస్తున్నారంటే.. దీనివెనక ఎవరి హస్తం ఉంది? సదరు ‘జూనియర్’ ఎవరికి ఆదాయ వనరుగా మారారన్నదే ప్రశ్న?
* * *
కాకినాడ- రాజమండ్రిలోని కొందరు ఆర్టీఐ యాక్టివిస్టులతో, ఫ్యాక్టరీలపై ఆర్టీఐ పెట్టించడంతోపాటు.. మళ్లీ ఆ ‘జూనియరే’ సదరు ఫ్యాక్టరీలకు ఫోన్లు చేసి, ఫలానా ఆర్టీఐ దరఖాస్తు దారుడితో సెటిల్ చేసుకోమంటూ సలహా లాంటి బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు.
ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సహజం. అలాంటి వాటిపై ఆర్టీఐ పెట్టడం.. ఆ నివేదిక చూపించి ఫ్యాక్టరీలను బెదిరించడం కొన్నేళ్ల నుంచి ఒక ఆనవాయితీగా మారింది. అయితే కాకినాడ కేంద్రంగా వీటిని తెరవెరక ఉండి ‘చక్ర’ం తిప్పిన ఆ ‘జూనియర్’ రింగ్‌మాస్టర్.. ఇప్పుడు ఏకంగా కార్మికశాఖ పేషీలో తిష్టవేయడం పరిశ్రమ వర్గాలకు శాపంగా మారింది.
కాకినాడ అనుభవాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగిస్తున్న సదరు ‘జూనియర్’ దెబ్బకు, సీనియర్ అధికారులు కూడా హడలిపోతుండటమే ఆశ్చర్యం. కాకినాడలో పనిచేస్తున్నప్పుడు తనకు వ్యతిరేకంగా చర్యల నివేదిక ఇచ్చిన అధికారులనే ఒక ‘జూనియర్’, రాయలసీమకు బదిలీ చేయించారంటే .. సదరు రింగ్‌మాస్టర్ పవరేమిటన్నది స్పష్టమవుతోంది.
* * *
సదరు ‘జూనియర్’ ఇప్పుడు అమరావతిలోని కార్మికశాఖ మంత్రి పేషీకి చేరినా.. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో సదరు జూనియర్ పెంచి పోషించిన ఆర్టీఐ యాక్టివిస్టులు మాత్రం, పరిశ్రమలపై స్వైరవిహారం కొనసాగిస్తున్నారట. వారు ఎంత డిమాండ్ చేస్తే పరిశ్రమ యజమానులు అంతివ్వాల్సిందేనట.
అమరావతిలోని పేషీ నుంచి ఎవరిపై ఫిర్యాదులివ్వాలో ఆదేశించడం, దానిని కాకినాడ-రాజమండ్రిలోని కొందరు ఆర్టీఐ యాక్టివిస్టులు దరఖాస్తు చేయడం, దానిని అడ్డుపెట్టుకుని మళ్లీ పరిశ్రమలను బెదిరించి డబ్బు గుంజడం, ఒక వ్యాపారంలా మారిందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. ఇంతజరుగుతున్నా కాకినాడ కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి ఒక కులానికి ఉన్నతాధికారులు సైతం ఎంత వణికిపోతున్నారో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదీ ‘తూర్పు’ తీర పరిశ్రమ స్వరూపం!
కాకినాడ-రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 400 పైగా పెద్ద పరిశ్రమలున్నాయి. వీటిలో రైసుమిల్లులు, జీడిపప్పు మిల్లులు, రొయ్యల ఫ్యాక్టరీలు, సగ్గుబియ్యం ఫ్యాక్టరీలున్నాయి. ఇవికాకుండా చిన్నా చితకా పరిశ్రమలు మరో వందవరకూ ఉంటాయి. కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, మండపేట, పెద్దాపురం, తుని, అనపర్తి ప్రాంతాల్లో ఉండే ఈ పరిశ్రమల్లో.. అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి.
అందులో పనిచేసే కార్మికులు ఒక్కోసారి క్షతగాత్రులవుతుండగా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకరిద్దరు మృతి చెందుతుంటారు. సహజంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ అధికారులు అక్కడికి తనిఖీలకు వెళ్లి, డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్కు నివేదిక ఇస్తారు. కంపెనీలను మూసివేసే అధికారం ఫ్యాక్టరీస్ అధికారులకు లేనందున, తదుపరి చర్యల కోసం ఎదురుచూస్తారు. ఇదీ కాకినాడ- రాజమండ్రి ప్రాంతాల్లోని పరిశ్రమల స్వరూపం.
——————-
ఆర్టీఐ దందా దళారీ రాజ్‌కు ఓ ఏడీజీ దన్ను?!
కాకినాడ-రాజమండ్రిలోని కొందరు ఆర్టీఐ యాక్టివిస్టుల దందా రాజ్.. వైసీపీ జమానాలో నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును హింసించిన ఓ ఏడీజీ , తన కులానికి చెందిన ఈ ముఠాకు ఏ స్థాయిలో దన్నుగా నిలిచారో.. జగన్ జమానాలో వారి హవా ఎలా సాగిందో ఓసారి చూద్దాం.
ఈ ప్రాంతంలోని కొందరు ఆర్టీఐ యాక్టివిస్టుల స్వైరవిహారానికి పరిశ్రమలు వణికిపోతున్నాయి. పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం.. ఏడాదిన్నర క్రితం వరకూ.. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఐ యాక్టివిస్టులు కొందరు ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు పరిధిలోని పరిశ్రమలే లక్ష్యంగా చెలరేగిపోయారు.
ఈ యాక్టివిస్టులకు ‘రింగ్‌మాస్టర్’ గా అప్పట్లో అక్కడ ‘జూనియర్’గా పనిచేసేవారట. ఫ్యాక్టరీలకు సంబంధించి శాఖాపరమైన లోటుపాట్లపై, బాగా అవగాహన ఉన్న సదరు ‘జూనియర్’..తన కులానికి చెందిన ఆర్టీఐ యాక్టివిస్టుల పేర్ల మీద తానే ఆర్టీఐకి దరఖాస్తు చేసేవారట.
మళ్లీ దానిని పై అధికారులకు ఫిర్యాదు చేయించడమే కాదు.. ఎవరిపైనయితే ఫిర్యాదులు వె ళ్లాయో, అదే పరిశ్రమలకు ఫోన్లు చేసి, ‘మీ ఫ్యాక్టరీ మీద ఫలానా వ్యక్తి ఆర్టీఐ పెట్టారు. వాళ్లతో ఎంతో కొంత మాట్లాడుకుని సెటిల్ చేసుకోకపోతే, విషయం మంత్రి వరకూ వెళుతుంది’ అని సదరు జూనియరే ఫోన్లు చేసి, పరిశ్రమలకు పొగ పెడతారట.
ఆ వెంటనే కాకినాడ-రాజమండ్రి కేంద్రంగా వెలువడే చిన్నా చితకా పత్రికలు, వాట్సాప్ పత్రికల్లో సదరు ఫ్యాక్టరీలపై కథనాలు వచ్చేస్తాయి. పరిశ్రమల్లో తనిఖీలకు వెళ్లిన ఫ్యాక్టరీ అధికారులు తీసే ఫొటోలు, వాటిలో ప్రత్యక్షమవుతాయి. తనిఖీలకు వెళ్లిన అధికారులు తీసిన ఫొటోలు, ఆ పత్రికల్లో ఎలా వ స్తాయంటే.. అదే ఆ ‘జూనియర్’ తెలివి! దానితో ఠారెత్తిన పరిశ్రమ యజమానులు, సదరు జూనియర్‌ను సంప్రదించి.. ఆ పనేదో మీరే చేయండని ఎంతో కొంత సమర్పించుకోవడం ‘మామూలే’నట.
వైసీపీ హయాంలో విజయవంతంగా జరిగిన ఈ ద ందాకు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండయిన ఓ ఏడీజీ దన్నుగా నిలిచారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆయన నిర్వహించే ఓ సంస్థలో సభ్యులైన ఈ ఆర్టీఐ యాక్టివిస్టు దళారీలు- వారికి నేతృత్వం వహించే ‘జూనియర్’ వేసిన స్కెచ్ ప్రకారం, పరిశ్రమలను పిండేసేవారట.
అంతేనా?.. సదరు ‘జూనియర్’ సీఎంఓ సహా, సచివాలయం, వివిధ శాఖలు, చివరకు పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లోని తన కులానికి చెందిన ఉద్యోగులు, అధికారులతో చిరంజీవి ‘ఠాగూర్’ సినిమాలో మాదిరిగా ఒక టీమ్ ఏర్పాటుచేశారంటే నోరెళ్లబెట్టకమానదు.
ఈ కులానుబంధంతోనే.. సదరు ‘జూనియర్’పై చర్యలు తీసుకోవాలంటూ, గతంలో కాకినాడ ఫ్యాక్టరీ ఉన్నతాధికారి ఇచ్చిన నివేదిక ఇప్పటివరకూ అమలుకాలేదట. అయినా ఓవైపు స్వయంగా సొంత శాఖ అధికారులు ఒక ‘జూనియర్’కు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే.. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా, అదే ‘జూనియర్’ను మంత్రి పేషీలో ఎలా నియమిస్తారన్నది ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు ఉద్యోగుల ప్రశ్న.
వైసీపీ హయాంలో రెచ్చిపోవడంతోపాటు.. నాటి నర్సాపురం ఎంపి ర ఘురామకృష్ణంరాజును అంతమొందించేందుకు, అత్యుత్సాహం ప్రదర్శించిన సదరు ఏడీజీ స్ధాపించిన సంస్థలో చేరిన ఈ ఆర్టీఐ దళారీలు-వారికి నాయకత్వం వహించిన ‘జూనియర్’ కలసి.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని పరిశ్రమల గుండుల్లో రైళ్లు పరిగెత్తించే వారట. ప్రధానంగా కాకినాడకు చెందిన ఓ యాక్టివిస్టు సదరు పోలీసు అధికారికి చెందిన ఇన్నోవాలో తిరిగేవారన్న ప్రచారం లేకపోలేదు.
వైసీపీ అధికారం కోల్పోయి కూటమి గద్దెనెక్కిన తర్వాత.. కాకినాడ-రాజమండ్రి ఫ్యాక్టరీస్‌లో ‘చక్ర’ం తిప్పిన సదరు జూనియర్ ‘ప్రతిభాపాటవాలు’ తెలిసిన ప్రముఖులు.. ఆయన సేవలను కార్మికశాఖ పేషీలో వినియోగించుకునేందుకు, అతగాడిని అవసరం లేకపోయినా పేషీకి డిప్యూటేషన్‌పై తెచ్చారట.
సదరు జూనియర్ పేషీలో చేరిన తర్వాత.. గతంలో కాకినాడలో తన మాట వినకుండా, సొంత నిర్ణయాలు తీసుకున్న ఇద్దరు ఫ్యాక్టరీ అధికారులను రాయలసీమకు బదిలీ చేయించి, వారి స్థానంలో తన కులానికి చెందిన అధికారిని తెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా.. థర్ఢ్పార్టీ సేఫ్టీ ఏజెన్సీని ‘వజ్ర’ సంకల్పంతో ప్రోత్సహిస్తున్నారట.
విచిత్రమేమిటంటే.. కాకినాడలో ఆ ఇద్దరు అధికారులుండగా, ఆర్టీఐ యాక్టివిస్టులు ఆ ఇద్దరు అధికారులతోపాటు, పరిశ్రమలపై డజన్లకొద్దీ ఫిర్యాదులు ఇచ్చేవారు.
కానీ ‘జూనియర్’ కార్మికశాఖ మంత్రి పేషీలో చేరిన వెంటనే.. తన కులానికి చెందిన అధికారిని బదిలీ చేయించుకున్న తర్వాత ఆశ్చర్యంగా ఆ ఫిర్యాదులన్నీ ఆగిపోయాయట! అంటే ఆ ‘జూనియర్’ ‘చక్ర’ం హవా ఎంతో ఊహించుకోవచ్చు. మరి ‘పైస్థాయి’లో ఎవరి దన్ను లేకుండానే ఒక ‘జూనియర్’ ఈ స్థాయిలో ‘చక్రం’ తిప్పుతున్నారంటే నమ్మే వెర్రి పుష్పాలెవర న్నది పరిశ్రమల ప్రశ్న. అసలు ఎవరి సిఫార్సుతో సదరు ‘జూనియర్’ పేషీలో ప్రవేశించారన్నది మరో ప్రశ్న.
నియోజకవర్గంలో జాబ్మేళాలతోపాటు, సీఎస్ఆర్ నిధుల పేరుతో జరుగుతున్న వ్యవహారాలన్నీ.. సదరు జూనియరే నిర్వహిస్తు, ఆ కుటుంబాన్ని మెప్పిస్తున్నారట. ఇప్పుడు సదరు ‘జూనియర్’, ఆ కుటుంబానికి ఆపద్బాంధుడిగా మారారట.
అయితే ఆ సీఎస్ఆర్ నిధుల వ్యవహారంలో తెరవెనుక ఏం జరుగుతోంది? దానికోసం నేరుగా ఏ కంపెనీలకు, ఏయే అధికారులకు ఫోన్లు చేస్తున్నారు? ఇటీవల జీడిపప్ప ఫ్యాక్టరీలతో ఎవరేం మాట్లాడారు? చెరువులు, అంబేద్కర్ విగ్రహాల పేరిట విరాళాలు-దానికోసం ఒత్తిళ్లు.. తెరవెనుక జరిగే బాగోతం ఏమిటో తర్వాత ముచ్చటించుకుందాం.
కమ్మ-కాపు కంపెనీపైనే వేధింపులు!
కాగా గత ఏడాదిన్నర కాలం నుంచి అనకాపల్లి-విశాఖ- కాకినాడ-రాజమండ్రి ప్రాంతాల్లో కమ్మ-కాపులకు చెందిన పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును హింసించి, కొంతకాలం క్రితం సస్పెండయిన ఓ ఏడీజీకి చెందిన సంస్థలో సభ్యులయిన వారే.. వ్యూహాత్మకంగా కమ్మ-కాపుల పరిశ్రమలను వేధిస్తున్నట్లు పీసీబీ-ఫ్యాక్టరీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని దాదాపు 400 పరిశ్రమల్లో 60 శాతం కమ్మవారివి కాగా, 30 శాతం కాపు కులాలకు, మిగిలినవి క్షత్రియ, రెడ్డి కులాలకు చెందినవి. వీటిలో రైస్‌మిల్లులు 60 శాతం కాపులకు చెందినవి కాగా, మిగిలినవి కమ్మ-క్షత్రియ కులాలవి. ఇక జీడిపప్పు ఫ్యాక్టరీలు 80 శాతం కాపులకు చెందినవే. సగ్గుబియ్యం ఫ్యాక్టరీల్లో 80 శాతం కమ్మవారివే. రొయ్యల ఫ్యాక్టరీల్లో 60 శాతం కమ్మవారివి కాగా మిగిలినవి క్షత్రియవర్గానివి. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులకూ పెద్ద సంఖ్యలో రైస్‌మిల్లులున్నాయి.
ఫ్యాక్టరీస్ నుంచి అమరావతి సచివాలయంలో చేరిన ‘జూనియర్’ కులానికి చెందిన చెందిన అధికారులు.. కమ్మ-కాపు కులాలకు చెందిన పరిశ్రమల నుంచే ‘నిబంధన ఉల్లంఘన’ పేరుతో ముడుపులు పిండుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘కమ్మ వర్గానికి ఈ శాఖలో ఎంత అన్యాయం జరుగుతుందో మేం మా సంఘం ద్వారా సీఎం, లోకేష్‌కు వినతిపత్రం ఇవ్వబోతున్నాం. ఎన్నికల ముందు పార్టీకి పనిచేసిన మాకే ఇంత అన్యాయం జరిగిదే ఎలా? అసలు ఫ్యాక్టరీస్‌లో ఏం జరుగుతుంది? ఎవరు ఈ శాఖను నడిపిస్తున్నారో పార్టీ నాయకత్వానికి వివరిస్తాం. ఎంత మంది కమ్మవ్యాపారులు నష్టపోతున్నారో వివరిస్తాం’’ అని ఉత్తరాంధ్ర కమ్మ యువజన సంఘం అధ్యక్షుడు గుమ్మడి శివసుబ్రమణ్యం వెల్లడించారు.
‘సేఫ్టీ ఆడిట్ ఏజెన్సీల్లో ఎవరి బినామీలతో పనిచేస్తున్నారో పార్టీ దృష్టికి తీసుకువెళతాం. గత ఏడాదిన్నర నుంచి కమ్మ-కాపులను ఎంత దెబ్బతీసి రోడ్డున వేశారో ఆధారాలతో సహా పార్టీ దృష్టికి తీసుకువెళతామ’ని చెప్పారు.
——–
కిరణ్ పేరుతో పరిశ్రమలకు ఫోన్లు
కాగా ప్రమాదాలు జరిగే పరిశ్రమలు.. ఫిర్యాదులు వచ్చిన పరిశ్రమలకు సచివాలయంలోని మంత్రి పేషీ నుంచి కిరణ్ పేరుతో ఫోన్లు వెళుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆరా తీయగా.. అసలు కిరణ్ అనే పేరు గల అధికారి గానీ, ఉద్యోగి గానీ ఎవరూ కార్మిక మంత్రి పేషీలో లేరని తెలిసింది. విచిత్రమేమిటంటే.. సొంత శాఖ ఉన్నతాధికారులకు సైతం.. నేను కిరణ్. మంత్రి గారి పేషీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడం! అసలు విషయం ఆరా తీస్తే.. పేషీలో ‘చక్ర’ం తిప్పే సదరు జూనియర్ రెండవ రూపమే కిరణ్ అని తేలిందట!