– “చిట్కా వైద్యం” కనిపెట్టామంటున్న నాసిరకం వైద్యులు
మొన్నేమో! ఒక పెద్దమనిషి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకీకరణకు అడ్డుకట్ట వేయడానికి సింగరేణి బొగ్గును టిప్పర్లలో తోలడానికి అధ్యయనం చేసి రమ్మని ఏకంగా ఒక బృందాన్నే పంపారు. ప్రసారమాధ్యమాల్లో కర్మాగారాన్నే కొనేంత “బిల్డప్” కూడా ఇచ్చారు.
ఈ రోజు దినపత్రికల్లో చదివాను, ఎనిమిదిన్నర కోట్ల మంది (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) తెలుగు ప్రజలు, నాలుగు నెలలుపాటు, ఒక్కొక్కరు కేవలం రు.100 చొప్పున విరాళమిస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే పరిరక్షించుకోవచ్చన్న “చిట్కా వైద్యాన్ని” సూచించారు. దీనికి కూడా బాగానే ప్రచారం లభించింది. వినడానికి కూడా భలే సరదా ఉన్న “ఐడియా” కదా!
“ప్రభుత్వం వ్యాపారం చేయకూడదన్నది” మా భావజాలమని, అందుకే విధాన నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నామని, వందకు వంద శాతం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తామని, వెనక్కి తగ్గేదేలేదని, మోడీ ప్రభుత్వం మరొకసారి పునరుద్ఘాటించింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా స్వార్థ చింతనను త్యజించి, అంకితభావం – చిత్తశుద్ధి తో ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా భాగస్వాములు అయితేనే లక్ష్యాన్ని సాధించుకోవచ్చు.
సమస్యకు కారకులేవ్వరో, పరిష్కారం ఎవరి చేతుల్లో ఉందో ముందుగా నిర్ధారణకు రావాలి. విశాఖ ఉక్కు కర్మాగారం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై స్పష్టమైన అవగాహనతో సమస్య ములాలను అర్థం చేసుకొని వ్యవహరించాలి.
స్వార్థాన్ని బుర్రనిండా నింపుకొన్న రాజకీయ నేతల జిమ్మిక్కులకు, కాకిలెక్కలతో ఆచరణ సాధ్యంకాని చిట్కా వైద్యాన్ని నమ్ముకుంటే “కుక్క తోక పట్టుకొని గోదావరి నది ఈదినట్లు” అన్న నానుడిగా తయారవుతుంది. ప్రసారమాధ్యమాలు రాజకీయ జిమ్మిక్కులకు, చిట్కా వైద్యానికి విస్తృత ప్రచారం ఇచ్చి, ప్రజల ఆలోచనలను కొంత ప్రభావితం చేశాయి. చైతన్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు – ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.