వచ్చే వారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది.రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు.మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది.
2 నెలల పాటు వర్చువల్ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు అనుమతించనున్నారు.15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్ ఆలయ గర్భ గుడిని తెరుస్తారు. అయ్యప్పస్వామి ఆలయం, మల్లికాపురం ఆలయాలకు కొత్తగా ఎంపిక చేసిన అర్చుకులను.. అధికారికంగా నియమించే ప్రక్రియ అదే రోజు రాత్రి జరగనుంది.
16వ తేదీ నుంచి భక్తులకు అనుమతినిస్తారు. డిసెంబర్ 26న మండలపూజ ముగుస్తుంది.
డిసెంబర్ 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. కఠినమైన కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.కట్టుదిట్టమైన భద్రత మధ్య భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. ఇందుకు సంబధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
రెండు డోసులు తీసుకున్న వారు కొవిడ్ సర్టిఫికేట్ చూపించాలి. లేకపోతే శబరిమలను సందర్శించుకునే 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాలి, ఆ నెగిటివ్ రిపోర్టును అధికారులకు సమర్పించాలి.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెకప్ చేయించుకుని ఆలయానికి రావాలి.ఒరిజినల్ ఆధార్ తప్పనిసరిగా చూపించాలి.పంపాలో స్నానానికి అనుమతి ఉంది. కానీ పంపా, సన్నిధానంలో బస చేసేందుకు అనుమతులు లేవు. పంపాలో వాహనాలకు పార్కింగ్ వెసులుబాటు కూడా ఉండదు. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.
దర్శనం ముగించుకున్న వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలి. కాలి నడకన వచ్చే భక్తులు.. స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలి. నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడే నెయ్యిని తిరిగి ఇస్తారు. దర్శనం తర్వాత ప్రసాదం కోసం పంపా వద్ద ఏర్పాట్లు చేశారు.
నవంబర్ 3న.. చితిర అట్టవిశేష పూజ కోసం శబరిమల ఆలయాన్ని ఈ నెల 3న తెరిచారు.
వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయం తలుపులు తెరిచిన పండితులు.. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి స్వామివారిని దర్శించుకునే అవకాశం దక్కింది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసి అదే రోజు రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. అంతకుముందు.. తులా మాసం పూజల కోసం శబరిమల ఆలయాన్ని అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు తెరిచారు. అదే నెల 21న ఆలయాన్ని మూసివేశారు.