ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళతారు?

– మూడేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదీ?
– ప్రత్యేక హోదా సాధన లో విఫలమైనందుకా?… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినందుకా?
– ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఏవీ?
– పన్నులు పెంచినందుకా…? ప్రాజెక్టులు పూర్తి చేయనందుకా?
– అప్పులు చేసి ప్రజలపై భారం మోపినందుకా?
– అరాచక పాలనపై ప్రజలే తిరగబడే రోజు వచ్చింది
– తాడేపల్లి ప్యాలస్ లో కూర్చుని బటన్ నొక్కటం అభివృద్ధి కాదు!
– ప్రజలే బటన్ నొక్కి తాడేపల్లి ప్యాలస్ లో పెర్మనెంట్ గా కూర్చోబెట్టే రోజులు వస్తున్నాయి
– పొత్తుల గోల వదిలి అభివృద్ది పై దృష్టి పెట్టండి
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

అమరావతి : మూడేళ్ల పాలన లో రాష్ట్రంలో ఏం వెలగబెట్టారని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు ఎం సమాధానం చెబుతారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలస్ లో కూర్చుని బటన్ నొక్కినట్లే త్వరలో ప్రజలు బటన్ నొక్కి జగన్ రెడ్డి ని పెర్మనెంట్ గా తాడేపల్లి ప్యాలస్ లో కూర్చోబెట్టే రోజులు అతి త్వరలో వస్తున్నాయి అని జోస్యం చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ రెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏం పోరాటం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలపై పన్నుల భారం వేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజార్చిందని విమర్శించారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మంత్రులపై ప్రజలే తిరగబడే రోజు వచ్చిందని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

అధికారంలోకి వచ్చాక విధ్వంసక కార్యక్రమాలు… అరాచక పాలన చేశామని గొప్పలు చెప్పడానికే ప్రజల్లోకి వెళుతున్నారా? అని శైలజనాథ్ ప్రశ్నించారు. కనీసం ఒక్క ప్రాజెక్టు ను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేదని, రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నా వేయలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు. మద్యం అమ్మకాలు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం కల్తీ చీప్ లిక్కర్ మాఫియా ను పెంచి పోషిస్తోందని విమర్శించారు.

మంత్రులు కేవలం రబ్బరు స్టాంపులుగా సిట్ & స్టాండ్ లా మారారని శైలజనాథ్ ధ్వజమెత్తారు. శాంతి భద్రతలు అదుపు చేయడానికి, ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు వదిలి పెట్టి పొత్తుల గురించి వైసీపీ నేతలు పోటీ పడి ముఖ్యమంత్రి వద్ద మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున ప్రభుత్వం అభివృద్ది పై దృష్టి సారించాలని శైలజనాథ్ సూచించారు.

ఆర్బాటంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన జగన్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నవరత్నాలు అంటూ నవమోసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర లో ఇచ్చిన హామీలకు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని శైలజనాథ్ ప్రశ్నించారు.

Leave a Reply