Suryaa.co.in

Andhra Pradesh

పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్ తీగ లాగితే.. నారాయణ దొరికాడు

– మాస్ కాపీయింగ్, పరీక్షాపత్రాల లీకేజి కల్చర్ తెచ్చింది “నారాయణ-చైతన్యలే”
– ర్యాంకుల కోసం మాల్ ప్రాక్టీస్ ను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా వ్యవస్థీకృతం చేసింది నారాయణే
– అచ్చెన్నాయుడు అయినా, నారాయణ అయినా, వైఎస్ కొండారెడ్డి అయినా.. చట్టం ముందు అందరూ ఒకటే
– చట్టం ఎవరికీ చుట్టంగా ఉండకూడదు అన్నదే మా ప్రభుత్వ విధానం
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అవి టీడీపీ హయాంలోని లీకుల రోగం ఛాయలే..
యథావిధిగా ఎప్పటిలాగే అతి పెద్ద గురివిందలా తెలుగుదేశం పార్టీ.. పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజ్‌ అంటూ నానా యాగి చేస్తే.. చివరికి లీకేజీలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆయనను ఇవాళ అరెస్ట్‌ చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో, వాళ్ల ప్రత్యక్ష అజమాయిషీలోనే ఇలాంటివి ఎన్నో జరిగినా, ఆ కథనాలు మీడియాలో వచ్చినా.. ఏమీ జరగనట్లుగా చూపుతూ వచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక, గత మూడేళ్ళలో చూస్తే, రెండేళ్లు అసలు పరీక్షలే జరగలేదు. తొలిసారి ఈ ఏడాది పరీక్షలు జరిగితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా, ఆ రోగం ఛాయలు నారాయణ సంస్థల వల్ల మళ్ళీ పొడచూపాయి.

ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ బయట పడగానే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందించిందో ప్రజలంతా గమనించారు. ఇవాళ జగన్‌ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి అని చూపించాలని టీడీపీ నేతలు తాపత్రాయపడ్డారు. తీరా, టీడీపీ ప్రచారం వికటించి చివరికి వాళ్లే దొరికిపోయారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణే అందులో ఉన్నాడు.

నారాయణ-చైతన్యలదే లీకేజీ కల్చర్
అసలు ప్రశ్నాపత్రాల లీకేజీ కల్చర్‌ మొదలైందే నారాయణ, చైతన్య సంస్థల నుంచి. వీళ్లు వందకు వంద శాతం, వీలైతే 100కు 120 మార్కులు తెచ్చుకున్నట్టు ప్రచారం చేసుకునేలా, వీలైతే ప్రపంచ రికార్డు బద్దలు చేసేవిధంగా తయారై ఇటువంటి తప్పుదారి పట్టారు. పిల్లలకు సహజంగా పోటీతత్వం, కాంపిటేటివ్‌ స్పిరిట్‌ తో పరీక్షలు నిర్వహించాల్సింది పోయి, ఆ పరిస్థితిని దశాబ్ధాలుగా మార్చేసి, మాస్‌ కాపీయింగ్‌, పేపర్లు లీకేజీలకు స్పెషలిస్ట్‌లుగా వ్యవస్థను తయారు చేశారు. ఇది తొలిసారి బద్దలైంది.

జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక, విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చర్యలను ఆయన ఏమాత్రం సహించరు. పోటీతత్వంతో చదువుకుని నిజమైన మెరిటోరియస్‌గా విద్యార్థులు రావాలి తప్ప, ఇలాంటి అడ్డదారుల్లో వచ్చి ఇవాళ పాస్‌ అయినా రేపటి రోజున విద్యార్థులకు జరిగే నష్టమే ఎక్కువని జగన్ భావిస్తారు. ఇలాంటివి ఎంకరేజ్‌ చేయకూడదనే ధోరణిలో మా ప్రభుత్వం ఉంది.

మాల్ ప్రాక్టీస్ తీగ లాగితే.. నారాయణ దొరికాడు
పరీక్షాపేపర్ల లీకేజీని వైయస్సార్‌ సీపీవాళ్లే ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఎంతగా దుష్ప్రచారం చేసినా.. అది కాస్తా వికటించి వాళ్లకే దెబ్బ కొట్టింది. ఆ తీగ లాగితే అరెస్ట్‌ అయినవాళ్లు అంతా టీడీపీవాళ్లే. వాళ్లకు సంబంధించివాళ్లే ఉన్నారు. పేపర్‌ మాల్ ప్రాక్టీస్ ఘటనపై ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

విద్యార్థుల నుంచి అధికమొత్తంలో ఫీజులు కట్టించుకుని, విద్యార్థుల తల్లిదండ్రులు ఉసురుపోసుకుని, విద్యార్థులకు యాంత్రికమైన చదవులు అంటకట్టి.. ఆ ప్రాసెస్‌లో వేలకోట్లు సంపాదించి, అందులో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నారాయణ టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ వాళ్ళు ప్రోత్సహించిన ఈ విధానం ఒక చీడలా తయారై పరీక్షలు పెట్టడం అంటేనే కష్టమైనది, దుస్సాధ్యమైనదిగా, ఉపాధ్యాయు లోకానికి కూడా మచ్చ వచ్చేవిధంగా తయారైంది. మా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు కారణంగా, ఉపాధ్యాయులు కూడా కష్టపడి చదువులు చెబుతూ, వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని విద్యార్థులను ఉన్నత పౌరులులాగా తీర్చిదిద్దాలనే తపన వల్లే ఈరోజు మంచి ఎడ్యూకేషన్‌ అందుతుంది.

విద్యా, వైద్య రంగాల్లో చెడు అనేది ఎంటర్‌ అయితే, దాని దుష్ప్రభావం భవిష్యత్‌ తరాల మీద ఉంటుంది. దాన్ని అదుపు చేసి, మొగ్గలో తుంచడం అవసరం. ఫస్ట్‌టైమ్‌ అరెస్ట్‌లు జరగడం కూడా. ఇంత టఫ్‌గా ఏ ప్రభుత్వమూ మూవ్‌ కాలేదు. ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ ను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని, ఇటువంటి వాటికి అవకాశం లేకుండా, కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆదేశాలు ఇచ్చినందువల్లే అధికారులు, పోలీస్‌ యంత్రాంగం సీరియస్‌గా కదిలి నిందితులను అరెస్టు చేశారు.

అచ్చెన్నాయుడు అయినా, నారాయణ అయినా.. వైఎస్ కొండారెడ్డి అయినా చట్టానికి అంతా సమానులే
పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందువల్లే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అసలు దొంగ అయిన నారాయణ సంస్థల అధినేత నారాయణను పట్టుకురాగలిగారు. దీన్ని రాజకీయం, రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని దుష్ప్రచారం చేయడం తగదు. చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలన మిస్‌రూల్‌ అనే రాష్ట్ర ప్రజలు జగన్‌ మోహన్‌ రెడ్డి కి పట్టం కట్టి అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ మిస్‌రూల్‌కు కారణం అయినవారిని, వాళ్లు ఎవరైనా సరే.. ఆ లక్షణాలు మళ్లీ మళ్లీ వచ్చినా వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే ప్రజల తీర్పును అర్థం చేసుకోనట్లే అవుతుంది. అందుకే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అయినా, నారాయణ అరెస్టు అయినా… ఎవరినీ అన్యాయంగా, అక్రమంగా మా ప్రభుత్వం అరెస్ట్‌ చేయలేదు.

చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎవరికైనా చట్టం ఒకేలా అమలు చేయాలి అన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానం. చట్టం పరిధిలో అందరూ సమానులే. టీడీపీ హయాంలో ఇవన్నీ కేవలం సూక్తులుగానే ఉండేవి. తనవారు, తన పార్టీ వారు అని చూడకుండా, పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్నారు. లాజికల్‌గా ఆ కేసును ఎక్కడకు తీసుకువెళ్లాలో అక్కడకు తీసుకువెళ్లే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది.

యాధృచ్ఛికంగా అయినా నిన్ననే మా పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి సమీప బంధువు వైఎస్ కొండారెడ్డి మీద వచ్చిన ఆరోపణలు, ఫోన్‌లో ఎవరినో బెదిరించినట్లు ఆరోపణలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి రాగానే, దానిపై క్షణం ఆలోచించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పదవి, అధికారం ప్రజలు ఇచ్చినవి.. తన, మన తారతమ్యాలు చూపకూడదనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఎల్లో మీడియా దానిపై ఎంత రాద్దాంతం చేసినా, అది బీజేపీ పెద్దల దృష్టికి వెళ్లిందని, దానివల్లే ఉలిక్కిపడి అరెస్ట్‌ చేసినట్లు కథనాలు ప్రసారం చేశాయి. ముఖ్యమంత్రి చట్ట ప్రకారం వ్యవహరించినా… ఎల్లో మీడియా ఎంతగా దిగజారుతున్నదనేది వాళ్ల జర్నలిజం స్థాయి ఎలా ఉందనేది తెలుస్తోంది. ఎవరు తప్పు చేసినా దానికి అనుగుణంగానే చర్యలు ఉంటాయి.

చట్టం తన పని చేసుకుని పోతుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ప్రభుత్వం, ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి తన వ్యవహార శైలి, మార్గదర్శకం చేయడంలో అందర్నీ ఒకేలా చూస్తున్నారనేది చూడాలి. సామాన్య వ్యక్తి మొదలు తన వాడి వరకూ చర్యలు ఒకేలా ఉంటాయనే ముఖ్యమంత్రి సందేశం ఇచ్చారని మేము భావిస్తున్నాం.

కొండారెడ్డి విషయమే కాదు… ముఖ్యమంత్రికి వరుసకు పెదనాన్న అయ్యే మరో ఆయన విషయంలోనూ చట్టం ఏం పనిచేస్తుందో అది చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి ఆ లైన్‌ ఆఫ్‌ థింకింగ్‌లో ఉన్నారు కాబట్టే మూడేళ్లుగా పార్టీలో వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అంతా అధికారం అంటే ఒక బాధ్యత అనేలా అందరూ వ్యవహరిస్తున్నారు. నారాయణ టీడీపీ కాబట్టే అరెస్ట్‌ చేశారు. అదే మా పార్టీ కాకుంటే ఇలా చేసేవాళ్లు కాదంటూ ఇంటి పైకప్పు ఎక్కి అరిస్తే అది చెల్లదని చెబుతున్నాం. ఇల్లు లాక్‌ చేసుకున్నా దొంగ వచ్చి దూరాలని ప్రయత్నం చేస్తాడు. అలా అని ఇల్లు అంతా ప్రోటెక్ట్‌ చేయలేకపోవడం, దొంగది తప్పుకాదు, నువ్వు కాపాడుకోలేకపోవడమే తప్పు అంటే ఇది కూడా అంతే.

మాల్ ప్రాక్టీస్ ను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా వ్యవస్థీకృతం చేసింది నారాయణే
నారాయణ అరెస్టు గురించి ఎల్లో మీడియా ఎంతగా గగ్గోలు పెట్టినా, కక్ష సాధింపు అని కేకలు వేసినా దాన్ని ఎవరూ ఒప్పుకోరు. నారాయణ గురించి రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాపీయింగ్‌ అనేది, మాల్‌ ప్రాక్టిసింగ్‌ అనేది ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌గా చేసుకుంటూ వచ్చిన వ్యవస్థీకృత సంస్థల అధినేత నారాయణ. ఏదైన ఒక విషయాన్ని ఘనంగా చెప్పుకోవాలంటే వెనక్కి తిరిగి చూడమంటాం. ఏదైనా పోలిక చెప్పాలన్నా, గీటురాయి అయినా చిన్న గీత, పెద్దగీతలా చూపాలంటే టీడీపీ పాలన ఎలా జరిగిందో, మా పాలన ఎలా జరుగుతుందో గమనించవచ్చు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక అక్రమ క్వారీకి ఎమ్మార్వో వనజాక్షి అడ్డం వెళితే.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ ఆమెను ఎలా అవమానించాడు. అధికారిణి, మహిళ అయిన ఆమెకు ఎలాంటి అవమానం జరిగిందనేది అందరికీ తెలుసు. అది చరిత్రలో మిగిలిపోయింది. ఆ వ్యవహారంలో కాన్షియస్‌గా చంద్రబాబు నాయుడు వనజాక్షిదే తప్పు అని తేల్చి నిసిగ్గుగా వ్యవహరించి, ఆమెను పిలిపించి, సర్ధిచెప్పి ఇంటర్నల్‌గా వార్నింగ్‌ ఇవ్వడం ఆరోజు చంద్రబాబు వ్యవహార శైలిగా చెప్పవచ్చు.

ఈరోజు జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరశైలి ఎలా ఉందో స్పష్టంగా అందరూ గమనించాలి. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొండా ఉమా కొడుకు కారు రేసులకు వెళ్ళి యాక్సిడెంట్‌ చేసి, వారి ప్రభుత్వం ఉందికాబట్టి, కుక్క అడ్డం వస్తే చనిపోయాడని కథలు అల్లిన ఘటన తెలిసిందే. అదే కొండారెడ్డి వ్యవహారంలో ఆ ఆడియో టేప్‌ మావాళ్లది కాదని మేం కూడా చెప్పవచ్చు. అయితే మా ముఖ్యమంత్రి రెండు అడుగులు ముందుకు వేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు హయాంలో అయితే, వారి పార్టీ నేతలు నేరాలు చేస్తే, కనీసం కేసు కూడా పెట్టిన దాఖలాలు లేవు. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమాలు ఎలా దౌర్జన్యం చేశారో గుర్తుండే ఉంటుంది. దానిపై కేసు పెట్టారో లేదో కూడా తెలియదు. తణుకు ఎమ్మెల్యే తన కార్యాలయంలో ఒక ఎస్ ఐని, పోలీస్ స్టేషన్ రైటర్ ను పిలిపించి, బెదిరించి, వారిని తన రూములో బంధించి, నేలపై కూర్చోపెట్టి ఎలా అవమానించారో చూశాం. ఎంతగా అంటే టీడీపీ జోలికి వస్తే తోలు వలుస్తాం అనే రీతిలో వారు వ్యవహరించారు. ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు ఒకలైన్‌ క్రియేట్‌ చేసి మనవాళ్లు అయితే ఎలా చూసుకోవాలి అనేలా గతంలో, భవిష్యత్‌లో ఎప్పుడూ లేని, ఉండబోని విధంగా కొత్త చెత్త చరిత్ర రాశారు. అవన్నీ భరించలేక జనం వాళ్లను చెత్తబుట్టలో పడేశారు. అది ఆరోజుది… ఇది ఈరోజుది.

ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు ఖండించాలి
ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్లు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్ద్వందంగా ఖండించాలి. అధికారంలో ఉంటే వాటిని కట్టుదిట్టంగా ఆపే ప్రయత్నం చేయడం అనేది ప్రథమ కర్తవ్యం. అవాంఛనీయ ఘటనలు, దుర్ఘటనలు జరగకుండా అంతా ప్రశాంతంగా ఉంటే ఈ వ్యవస్థలు అవసరమే ఉండదు. ఇందులో జగన్‌గారి ప్రభుత్వం టాప్‌లో నిలబడుతుంది. ఎందుకంటే డిస్క్రిమినేషన్‌, డీవియేషన్‌ చూపించడం లేదు కాబట్టే మేము సగర్వంగా చెప్పుకుంటాం.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వితండవాదం చేయడం చూస్తే అంతకన్నా దివాళాకోరు తనం ఉండదు. నారాయణ విద్యా సంస్థలు నారాయణవే. ఎవరిది అయితే వాళ్లవే. ప్రజా జీవితంలో ఉ‍న్నవాళ్లు ఎవరైనా ఇలాంటి సంబంధం లేని సిల్లీ వాదనలుచేస్తే వాటికి ఎలాంటి ఆన్సర్‌ ఇవ్వగలం..? అడ్డగోలు వాదనలు మాట్లాడటం సరికాదు కదా? అధికారంలోకి రాగానే కేసులు పెడితే.. రావడం రావడమే కక్ష సాధింపు అంటారు. మేం ప్రభుత్వంలోకి వచ్చేముందు, వారు తప్పులు చేశారని వారికి తెలుసు. దానికి సంబంధించి ఆధారాలు లభించాకే మేం చర్యలు చేపట్టాం. ఏతావాతా టీడీపీ ఉద్దేశం ఏంటంటే.. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా చర్యలు అసలు వద్దనే కదా?

చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ముఖ్యమంత్రి దృష్టిలో ఎవరైనా, ఎంతటివారైనా, అందరూ సమానమే. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా చర్యలు ఉంటాయి. జగన్‌గారి ప్రభుత్వంలో కక్షసాధింపులకు అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బ్రహ్మాండంగా, ఆదర్శంగా ఉండాలి. పౌరులయినా, నాయకులయినా చట్టం ముందు సమానమే అనేలా ఏం చేయాలో అవన్నీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆ ప్రాసెస్‌లో ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్‌ అవుతారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
అమరావతి రాజధానిలో ఇన్నర్ రింగు రోడ్డుకు సంబంధించి లింగమనేని, హెరిటేజ్ సంస్థలకు సంబంధించిన భూముల పక్క నుంచే అలైన్ మెంటు ఎలా వెళుతుంది..? ప్రాథమిక సాక్ష్యాలు ఉన్న తర్వాత, ఎవరిపైన అయినా చర్యలు ఉంటాయి. ఇందులో ఎవరూ అతీతులు కాదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసు ముగియలేదు. విచారణ ఆపారు అంతే. దానికి కావాల్సినంత స్ట్రాంగ్‌ కేసు ఉందని మేం భావిస్తున్నాం. లాజికల్ ఎండ్ కు కూడా అది వెళుతుంది.

ఈమధ్య జరిగిన ఘటనలు చూస్తే.. మహిళలపై దాడులుకు సంబంధించి చాలావరకూ టీడీపీ వాళ్ల ప్రమేయమే కనిపిస్తోంది. అయితే నిర్థారణ పూర్తికాకముందే అరగంటలో లోకేష్‌ ట్వీట్‌ వస్తుంది. పావుగంటకు చంద్రబాబు ట్వీట్‌, ఆ తర్వాత వర్ల రామయ్య ప్రెస్‌మీట్‌, అంతకు ముందే టీవీ5, ఏబీఎన్‌ నుంచి ఈనాడులో ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలు అవుతుంది. మేము రియాక్ట్‌ అయ్యాక చూస్తే.. టీడీపీ వాళ్లే చివరికి దొరుకుతారు. ఇవన్నీ పొలిటికల్‌ మైలేజ్‌ కోసం చేస్తున్నారేమో అనే అనుమానం వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా దుష్ప్రచారం జరగడం మాత్రం ఈ శక్తులన్నీ కలిసి ఒక కోఆర్డినేషన్ తో జరుగుతోంది. ఇదంతా ఒక కుట్ర కోణంలోనే జరుగుతోందన్నది వాస్తవం.

LEAVE A RESPONSE