– కేసిఆర్ దగ్గర మార్కుల కోసం తెలంగాణ మంత్రులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో?
– ఆంధ్రప్రదేశ్ పై విమర్శలు చేయడం వారి రాజకీయ అజ్ఞానం
– ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్
– 14 ఎమ్మెల్సీ స్థానాలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు మొత్తం 7 స్థానాలు
– కౌన్సిల్ చరిత్రలోనే ఎమ్మెల్సీలుగా నలుగురు మైనార్టీలు
– రూ. 70 వేల కోట్లు అప్పులు చేసి ఏ మొహం పెట్టుకుని విద్యుత్ రంగంపై టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కోటాలో 3 స్థానాలు, స్థానిక సంస్థల నుంచి 11 స్థానాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి, సామాజిక న్యాయం పాటిస్తూ, అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్, ఇషాక్ భాషా, గోవిందరెడ్డి పేర్లను ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
అధికారంలోకి రాకముందు నుంచీ, వచ్చిన తర్వాత కూడా సామాజిక న్యాయానికి జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం పదవులు దక్కే విధంగా జగన్ మోహన్ రెడ్డి అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారు.
మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల్లో 7 స్థానాలు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు, 7 స్థానాలు ఓసీలకు కేటాయించారు.
రాజ్యాంగపరమైన ఆబ్లిగేషన్ కాకపోయినప్పటికీ, ఒక రాజకీయ పార్టీగా, చరిత్రలో తొలిసారి ముందు నుంచీ సామాజిక న్యాయం పాటిస్తూ వస్తోన్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తూ, రాజకీయ, నామినేట్ పదవుల్లో ప్రాధాన్యతను కొనసాగిస్తూ వచ్చారు. దీనివల్ల కొంతమంది సీనియర్ నాయకులు మరికొంత కాలం వేచి ఉండాల్సి రావొచ్చుగానీ, పార్టీ నేతలు అర్థం చేసుకుంటున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ యాత్రలో అందరికీ అవకాశం వస్తుంది.
సమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలన్న సంకల్పంతో జగన్ ఆ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ వల్లే అందర్నీ సమన్వయపరుస్తూ సామాజిక న్యాయాన్ని కచ్చితంగా అమలు చేయగలుగుతున్నారు. ప్రస్తుతం పదవులు రాని పార్టీలోని నాయకులు కూడా పదవులు పొందడానికి ఇదే ఆఖరు అనుకోవడానికి వీల్లేదని చెప్పదలచుకున్నాను.
స్థానిక సంస్థలకు సంబంధించి ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థుల 11 పేర్లు..
స్థానిక సంస్థలకు సంబంధించి 8 జిల్లాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ జిల్లాల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలుః
విజయనగరం- రఘురాజు- క్షత్రియ
విశాఖపట్నం- వరుదు కళ్యాణి- బీసీ-కొప్పుల వెలమ
వంశీ కృష్ణ యాదవ్- బీసీ- యాదవ
తూర్పు గోదావరి- అనంతబాబు- ఓసీ- కాపు
కృష్ణా- 1. తలశిల రఘురామ్- కమ్మ- ఓసి
2. మొండితోక అరుణ్ కుమార్- ఎస్సీ- మాదిగ
గుంటూరు- 1.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు- కాపు- ఓసీ
2. మంగళగిరి- మురుగుడు హనుమంతరావు-చేనేత- బీసీ
ప్రకాశం- తూమాటి మాధవరావు(కందుకూరు)- కమ్మ- ఓసీ
చిత్తూరు- భరత్(కుప్పం ఇన్ ఛార్జి)- బీసీ- వన్యకుల క్షత్రియ
అనంతపురం- వై. శివరామిరెడ్డి-మాజీ ఎమ్మెల్సీ- రెడ్డి- ఓసీ
మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలో బీసీ, మైనార్టీలకు మొత్తం 6 స్థానాలు కేటాయించగా, ఎస్సీ మాదిగకు 1, కాపులకు 2, క్షత్రియులకు 1, కమ్మ 2, రెడ్డి కులస్థులకు 2 స్థానాలు కేటాయించడం జరిగింది.
బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ, సామాజిక సమతుల్యత పాటిస్తూ.. జగన్ మోహన్ రెడ్డిగారు సుదీర్ఘంగా ఎక్సర్ సైజ్ చేసి, పార్టీ నాయకులతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేశారు.
ఇప్పటికే కౌన్సిలో ఉన్న 18 మంది వైయస్ఆర్సీపీ సభ్యులో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. కొత్తగా రాబోయే 14 మందితో కలుపుకుని మొత్తం 32మందిలో 18 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీలకు అవకాశం రావడం చెప్పుకోదగ్గ విశేషం.. ఇందులో నలుగురు మైనార్టీలకు చోటు దక్కడం కౌన్సిల్ చరిత్రలోనే తొలిసారి. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక.. ఇస్తున్న పదవుల్లో కులాలు, వర్గాల ప్రకారం చూస్తే.. సామాజిక న్యాయం రికార్డు పూర్తిగా కొనసాగుతోంది.
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
గొడవల్లేకుండా, భేషజాలకు పోకుండా ఆంధ్రప్రదేశ్ తో ఉన్న అన్ని సమస్యలను సామరస్యకంగా పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రి కేసిఆరే అన్నారు. ఆ మాటలు తెలంగాణ మంత్రులు వినలేదేమో. ఏపీ ఎలా పోతుందనేది తెలంగాణ మంత్రులకు ఎందుకు..?
తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు, అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వల్ల, విడిపోయేటప్పుడు ఆ వాటా కూడా రావాలని ఆంధ్రా వైపు నుంచి మా వాదన గట్టిగా వినిపించాం. ఇంత అడ్డగోలుగా విడదీయటం తప్పు అని అటు కాంగ్రెస్ కు, ఇటు చంద్రబాబుకు కూడా చెప్పాం.
అయినా ఆంధ్రప్రదేశ్ పై విమర్శలు చేయడం వారి రాజకీయ అజ్ఞానం, అపరిపక్వతే అవుతుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గర మార్కుల కోసం తెలంగాణ మంత్రులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో. ఇలా మాట్లాడటం వల్ల ఇష్యూస్ డైవర్ట్ అవుతాయని, మేం సంయమనం పాటిస్తున్నాం.
టీడీపీ అధికారంలో నుంచి దిగి పోతూ, పవర్ సెక్టార్ నుంచి ఎంత నష్టాన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్ళారో అందరికీ తెలిసిందే.2014 నాటికి డిస్కంలు అప్పులు రూ. 33 వేల 580 కోట్లు.. టీడీపీ దిగిపోయేనాటికి, మేం అధికారంలోకి వచ్చే నాటికి ఆ అప్పులు రూ. 70, 254 కోట్లకు పెరిగాయి.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2014 నాటికి రూ. 2,893.23 కోట్లు అయితే, టీడీపీ అధికారంలోనుంచి దిగిపోయే నాటికి అంటే 2019 నాటికి అవి రూ. 21,540.96 కోట్లకు చేరుకున్నాయి. – ఏ మొహం పెట్టుకుని టీడీపీ నేతలు ఈఆర్సీ దగ్గరకు వెళ్ళారు. మాట్లాడటానికి సిగ్గు, ఇంగితం అన్నా ఉండాలి. ఇప్పటివరకూ పవర్ లో లేని పార్టీ ఇటువంటి మాటలు మాట్లాడినా బాగుంటుంది. రెండున్నరేళ్ళ క్రితం వరకు అధికారంలో ఉండి, అప్పులు చేసిన పార్టీ ఇలా మాట్లాడితే ఎలా..?