Suryaa.co.in

Editorial

సజ్జలకు ‘సలహా’ల సంకటం!

– బాబు సరే.. జగన్‌ సంగతేమిటి?
– జగన్‌ కూడా బెయిల్‌ రద్దు చేసుకోవచ్చు కదా?
– కోర్టు నమ్మినందుకే జగన్‌కు రిమాండ్‌ విధిందించి కదా?
– జగన్‌ కూడా నిర్దోషిత్వం నిరూపించుకోవచ్చు కదా?
– ఇంతకూ సజ్జల సలహాలు బాబుకా? జగన్‌ కోసమా?
– సోషల్‌మీడియాలో సజ్జలకు ట్రోల్‌ సంకటం
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే అడ్డంగా బుక్కయిపోతారు. గతానుభవాలు గమనంలోకి తీసుకోకుండా, విమర్శిస్తే వెల్లువెత్తేప్రతి విమర్శలకు సిద్ధంగా ఉండాల్సిందే. ప్రధానంగా నోరు జారితే అంతే సంగతులు. ఇప్పుడు ఏపీ సర్కారీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా, అచ్చం అలాగే కనిపిస్తోంది. టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన విమర్శల బాణాలు, రాజమండ్రి వరకూ వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్‌ చంచల్‌గూడకు.. అక్కడి నుంచి తాడేపల్లికి తగులుతున్నాయి. అంటే మళ్లీ జగన్‌ జైలు-బెయిలు వ్యవహారం సజ్జల వ్యాఖ్యల ఫలితంగా మళ్లీ చర్చల్లోకి వచ్చిందన్నమాట!

చంద్రబాబు జైలు కేంద్రంగా హైడ్రామా నడిపిస్తున్నారని, ఖైదీలకు ఏసీలు ఎక్కడైనా ఇస్తారా? అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు సంధించారు. ఆయన జైల్లో ఒక కిలో బరువు పెరిగారని చెప్పారు. డాక్టర్లు ఆయనను బాగా చూసుకుంటున్నారని వెల్లడించారు. అంతవరకూ బాగానే ఉంది.

ఆ తర్వాత ఇచ్చిన సలహాలే సోషల్‌మీడియాలో బూమెరాంగవుతున్నాయి. స్కిల్‌ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసి బాధ్యత చంద్రబాబుదే అని సజ్జల సలహా ఇచ్చారు. తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు తప్పని, కోర్టులో నిరూపించుకోవాలని సూచించారు. బెయిల్‌ పిటిషన్‌ వేసుకోకుండా క్వాష్‌ పిటిషన్‌ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఇక ప్రధానంగా.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని నమ్మిన తర్వాతనే, కోర్టు ఆయనను రిమాండుకు పంపించిందని సజ్జల వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు సజ్జల సలహా ఇచ్చిన తర్వాత.. సజ్జలపై సోషల్‌మీడియాలో విమర్శల వాన మొదలయింది. సజ్జల కవి హృదయం ప్రకారం.. సీఎం జగన్‌ కూడా కోర్టులో తన నిర్దోషిత్వం నిరూపించుకోకుండా, బెయిల్‌పై ఎందుకు బయటకు వచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నాస్ర్తాలు సంధిస్తున్నారు. జగన్‌ కూడా తన నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు జైల్లోనే ఉండకుండా, పదేళ్లుగా బెయిల్‌పైనే ఎందుకు తిరుగుతున్నారని సోషల్‌మీడియా సైనికులు నిలదీస్తున్నారు.

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని జడ్జి నమ్మినందుకే, ఆయనకు రిమాండ్‌ విధించారన్న సజ్జల మాటలు నిజమైతే… జగన్‌ కూడా అవినీతికి పాల్పడ్డారని కోర్టు నమ్మినందుకే, ఆయనను 16 నెలలపాటు రిమాండ్‌లో ఉంచిందని అనుకోవాలా? అని లాజిక్కు పాయింట్లు లేవనెత్తుతున్నారు. సజ్జలన్న మాటల ప్రకారమే.. జగనన్న ఎలాంటి అవినీతి చేయకపోతే, అన్న 16 నెలలు జైల్లో ఎందుకుంటారు? నిజంగా జగన్‌ ఎలాంటి తప్పు చేయకపోతే.. తప్పుడు కేసులని కొన్ని, మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ అని మరికొన్ని, మిస్టేక్‌ ఆఫ్‌లా, ఆధారాలు లేవని ఇంకొన్ని.. మొత్తం 11 కేసులు విచారణ లేకుండానే ప్రభుత్వం ద్వారా ఎలా ఎత్తివేశారని నిలదీస్తున్నారు.

జగన్‌పై 38 కేసులుంటే.. దానిపై కోర్టులో 54 డిశ్చార్జి పిటిషన్లు వేశారు. 158 స్టే పిటిషన్లు వేశారు. మరి సజ్జల చెప్పినట్లు జగన్‌ కూడా నిర్దోషి అయితే, ఇన్నేసి పిటిషన్లు ఎందుకు వేసినట్లు? జైల్లోనే ఉండి తాను నిర్దోషినని రుజువుచేసుకుని, తుది తీర్పు వచ్చిన తర్వాత పులుకడి గిన ముత్యం మాదిరిగా బయటకు రావచ్చు కదా? ఆ పనిచేయమని సజ్జల ఆయనకు ఎందుకు సలహా ఇవ్వలేదు? అని నెటిజన్లు ప్రశ్నాస్ర్తాలు సంధిస్తున్నారు.

సజ్జల మాటల ప్రకారమైతే.. జగన్‌ నిజంగా నిర్దోషి అని భావిస్తే, ఏళ్ల తరబడి కోర్టు విచారణలకు ఎందుకు హాజరుకావడం లేదు? సెక్యూరిటీ సాకుతో ఎందుకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు? పోనీ బెజవాడలోనే ఉన్న ఎన్‌ఐఏ కోర్టు విచారణకు ఎందుకు హాజరుకావడం లేదు? తాను నిర్దోషినైతే కోర్టుకు హాజరవాలి కదా? జగనన్నను విచారణకు హాజరయి బెయిల్‌ రద్దు చేసుకుని, న్యాయస్ధానాల్లో నిర్దోషిగా రుజువుచేసుకున్న తర్వాతనే బయటకు రావాలని.. సజ్జలన్న ఎందుకు సలహా ఇవ్వలేకపోతున్నారని, నెటిజన్లు ప్రశ్నలతో వీరవిహారం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో, జగన్‌ కేసులకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను కూడా నెటిజన్ల సమాచారం కోసం ఉంచారు.

అయితే మరికొందరు నెటిజన్లు మరో అడుగు ముందుకేసి, సజ్జల సలహాలపై ఎకసెక్కాలాడుతున్నారు. ఇంతకూ కోర్టులో తాను నిర్దోషినని రుజువుచేసుకోవాలన్న సజ్జల సలహా చంద్రబాబుకా? జగనన్నకా? అర్ధం కావడం లేదని వెటకారాలాడుతున్నారు.

‘ ఎందుకంటే జగనన్న కూడా బెయిల్‌పైనే ఉన్నారు కాబట్టి, సజ్జల సలహా జగనన్నకూ వర్తిస్తుంది కదా? సజ్జలన్న మాట ప్రకారమైతే జగనన్న కూడా.. కోర్టులో తన నిర్దోషిత్వం నిరూపించుకోకుండా, పదేళ్లుగా బెయిల్‌పై బయట ఉండకూడదన్నదే కదా సజ్జల లా పాయింట్‌?’’ అని మెలిక పెడుతున్నారు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి సోషల్‌మీడియా పనిమంతులు.. సజ్జల మాటలను డైరెక్టుగా జగనన్నకే చుట్టేశారన్నమాట.

అసలు జగన్‌ జైలు-బెయిలు వ్యవహారాన్ని ఆ పార్టీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి కొద్దిమంది తప్ప.. ఏపీ జనం దాదాపు మర్చిపోయారు. రఘురామకృష్ణంరాజు అప్పట్లో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ తర్వాతనే రాజును సీఐడీ గుంటూరుకు తీసుకుని ‘సగౌరవంగా’ సత్కరించింది. అది వేరే విషయం.

నిజానికి జగన్‌ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారని తెలిసిన తర్వాతనే, జగన్‌ నాయకత్వంలోని వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారు. మూడు ఎంపీ సీట్లు తప్ప, మిగిలిన లోక్‌సభ సీట్లన్నీ వైసీపీకే అర్పించారు. అంటే జనం.. జగన్‌పై కేసులను పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమవుతుంది.

వాస్తవానికి జగన్‌ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ జనం ఆయనకు 67 సీట్లు కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీకి ఓట్ల తేడా కేవలం ఐదులక్షలే. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో, ప్రజలు ఆయనపై కేసులున్నాయన్న విషయాన్ని పట్టించుకోవడం మానేశారు.

కానీ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల చేసిన వ్యాఖ్యలు-ఇచ్చిన సలహాల తర్వాత.. జగన్‌ జైలు-బెయిలు కేసుల చర్చ, మళ్లీ తెరపైకి వచ్చినట్టయింది. ఈ చర్చ లాంటి రచ్చ మరెంత కాలం కొనసాగుతుందో చూడాలి.

LEAVE A RESPONSE