Suryaa.co.in

Telangana

జూన్ నెల వేతనాలు, పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి

– టిఎస్ యుటిఎఫ్

జులై నెల 12రోజులు గడిచినా ఇంకా 19 జిల్లాల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు, పెన్షన్లు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ సిబ్బంది వేతనాల బడ్జెట్ విడుదల చేయకపోవటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నది. నెల మొదటి తేదీన గడచిన నెల వేతనం పొందటం ఉద్యోగుల హక్కు. గత రెండు సంవత్సరాలుగా నెల మొదటి పనిదినం నుండి పదో తేదీ మధ్య రొటేషన్ పద్దతిలో రోజు కొన్ని జిల్లాల చొప్పున వేతనాలు జమయ్యేవి. గత మూడు నెలలుగా పన్నెండు, పదిహేను తేదీల వరకు ఎప్పుడు జమ అవుతాయో తెలియని అయోమయం నెలకొంది.

ఈనెల మునుపెన్నడూ లేని విధంగా 19 జిల్లాలకు ఇంకా చెల్లింపులు జరగలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంటి నిర్మాణం కోసమో పిల్లల చదువుల కోసమో తీసుకున్న బ్యాంకు ఋణాల ఇఎంఐలు ప్రతినెల 5, 10 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుంది. గడువు లోపు ఇఎంఐ కట్టటానికి ఖాతాలో డబ్బు లేక పెనాల్టీతో కట్టాల్సి వస్తున్నది.

ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులు కూడా భాగమే కనుక ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ నిర్వహణా ఖర్చుల్లో భాగంగానే చూడాలి. కానీ ఉద్యోగుల జీతాల కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నట్లు ప్రతినెలా జరుగుతున్న ప్రచారం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది.

ఇంకా మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవ్, సెలవు వేతనాలు తదితర సప్లిమెంటరీ బిల్లుల మంజూరు కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సివస్తున్నది. ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్ సొమ్ము అవసరాలకు తీసుకుందామనుకుంటే సకాలంలో అందటం లేదు. అమ్మాయి పెళ్ళికి పార్ట్ ఫైనల్ మంజూరు చేయించుకుంటే మనవడి బారసాలకు కూడా నగదు చేతికి అందటం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల మొదటి తేదీనే వేతనాలు, నిర్ణీత గడువు లోగా సప్లిమెంటరీ బిల్లులు విడుదల చేయాలని, జూన్ నెల వేతనాలు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల వేతనాల బడ్జెట్ ను తక్షణమే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE