నారాయణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం..

– 14ఛలో నెల్లూరుకు బహుజనులంతా కదంతొక్కాలి
– ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే…
– హత్య చేసిన పోలీసులను కోర్టుకు ఈడుస్తాం…
– టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు

ఉదయగిరి నారాయణను ముమ్మాటికీ పోలీసులే హత్య చేశారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆరోపించారు. నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని కోరేందుకు టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఛలో నెల్లూరు చేపడుతున్నామని, దీనికి బహుజనులంతా కదంతొక్కి కదలిరావాలని పిలుపునిచ్చారు. దళిత ఆడపడుచుల మాంగల్యాలను తెంపుతున్న ఖాకీలకు శిక్ష పడేంతవరకు నిర్విరామ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకాలకు నారాయణ హత్య పరాకాష్ట అని పేర్కొన్నారు. మంత్రి కాకాణి ఒత్తిడి, రీపోస్టుమార్టం జరగనీయబోమనే హామీతోనే పోస్టుమార్టం రిపోర్టు తారుమారు చేశారని తెలిపారు. నారాయణ ఛాతి, మర్మాంగాలపై ఉన్న బలమైన గాయాలను దాచిపెట్టి మిగిలిన గాయాలను పేర్కొంటూ నివేదిక తయారు చేయడం అధికార పార్టీకి దళితుల పట్ల ఉన్న వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.

వైసీపీ దోపిడీ, అరాచకాలు, దుర్మార్గపు చర్యలకు దళితులు సమిథలవుతున్నారని, ఈ హత్యలన్నీ తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. తీవ్రగాయాలతో ఉన్న నారాయణ పొదలకూరు నుంచి కందమూరు అడవిలోకి వెళ్లడం అసాధ్యమని, చంపేసిన వాళ్లపై కేసు లేదు కానీ చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం వైసీపీ పాలనలో అధికారుల పిచ్చికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. మనుషులను చంపేస్తుంటే జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ చూస్తూ ఊరుకోవడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని రుజువైందని, దళితుల ప్రాణాలంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి లెక్కలేదని తెలిపారు.

సామాజిక న్యాయం ముసుగులో, దళితుల్ని కిరాతకంగా హత్య చేస్తున్నారని, దీన్ని రాష్ట్రంలోని దళితులంతా గమనించాలని విజ్ఞ‌ప్తి చేశారు. నారాయణ లేని కుటుంబం దిక్కులేనిదైపోయిందని, ఆ కుటుంబాన్ని చూస్తే ప్రాణం తరుక్కుపోతోందని తెలిపారు. నారాయణ చావుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, న్యాయం జరిగేవరకు ఎక్కడా తగ్గే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. దోషులను కోర్టుకు ఈడ్చి, నారాయణ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు.

“జైం భీమ్” సినిమాను తలపించే విధంగా నారాయణ మృతికి సంబంధించిన విషయాలు. క్రింది విధంగా ఉన్నాయని పేర్కొన్నారు…
– కందమూరుకు చెందిన దళితుడు ఉదయగిరి నారాయణ పోలీసులు కొట్టిన దెబ్బలతోనే చనిపోయాడు.
– ఉద్దేశపూర్వకంగానే పోస్టుమార్టంను ఆలస్యంగా నాలుగో రోజు నిర్వహించారు.
– ఛాతి, మర్మాంగాలతో పాటు శరీరమంతా గాయాలున్నాయని మాకు సమాచారం ఉంది.
– మృతదేహానికి రీపోస్టుమార్టం చేయనీయకుండా చేస్తామని వైద్యాధికారికి మంత్రి ఇచ్చిన హామీతో నివేదిక తారుమారు చేశారు.
– మర్మాంగాలు, ఛాతిపై తగిలిన ప్రధాన గాయాలను చూపకుండా మోకాళ్లు, మణికట్టు, చేతులు తదితర ప్రాంతాల్లోని గాయాలను మాత్రమే నివేదికలో పేర్కొన్నారు…అవి కూడా తీవ్రగాయాలే
– పోలీసులు మోకాళ్లు. మణికట్టు, చేతులపై కొడతారనే విషయం బహిరంగ రహస్యమే.
– వైద్యాధికారికి మంత్రి ఇచ్చిన హామీలో భాగంగానే 40 మంది పోలీసులను కందమూరుకు పంపి దళితుల కుల, కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా మతదేహాన్ని పూడ్చిపెట్టడానికి బదులు దహనం చేయించారు.
– మరో దారుణమైన విషయమేమంటే 19వ తేదీన వేకువజామున కందమూరు అటవీ ప్రాంతంలో నారాయణ శవంగా చెట్టుకు వేలాడుతుంటే అదే రోజు ఆయనపై పోలీసులు ఏ4గా దొంగతనం కేసు నమోదు చేశారు.
– తీవ్రగాయాలైన నారాయణ పొదలకూరు నుంచి కందమూరు అడవిలోకి ఎలా వెళ్లారు…అది సాధ్యం కాదు..నారాయణను చంపేసిన తర్వాతే అడవిలోకి తీసుకెళ్లి చెట్టుకు వేలాడదీశారు.
– రక్షించాల్సిన పోలీసులే ఇలా భక్షిస్తుంటే మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు?
– కాకాణి ధనదాహానికి, అరాచకత్వానికి, కక్షసాధింపులకు టీడీపీ నేతలు, కార్యకర్తలే కాదు..సామాన్యులు కూడా బలైపోతున్నారు.
– ఇలాంటి రాక్షస పరిస్థితులు నిజాం పాలన కాలంలో ఉండేవని పత్రికలు, పుస్తకాల్లో చదివాం..గడీల్లో మనుషులను చంపేసినా కేసులుండేవి కావట..ఏపీలోనూ ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
– పోలీసు స్టేషన్ లోనే దళితుడిని చంపేస్తే కేసు లేదు..చంపేసిన ఎస్సైపై చర్యలు లేవు…చనిపోయిన వ్యక్తిపై మాత్రం దొంగతనం కేసు నమోదు చేశారు..ఇంటి పేర్లు, తండ్రి పేర్లు లేకుండానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా?
– నారాయణను చంపడంలో కీలకమైన ఎస్సైపై కేసు నమోదు చేయకుండా వంశీనాయుడును అరెస్ట్ చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
– తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు వచ్చి నిరసన తెలిపిన తర్వాతే వంశీనాయుడును అదుపులోకి తీసుకున్నారు..
– వంశీనాయుడుతో పాటు ఎస్సై కరిముల్లాపై కూడా కేసులు పెట్టాలి..అది కూడా హత్య, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి.
– పోస్టుమార్టం ఆలస్యం కావడంపైన, నివేదికను తారుమారు చేయడంపైన, మృతదేహాన్ని బలవంతంగా దహనం చేయించిన వారిపైన, చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.
– ఎన్నో అరచాకాలు, అక్రమాలకు పాల్పడుతున్న ఎస్సై కరిముల్లా అమాయకుడని చెప్పి వెనకేసుకొచ్చిన పొదలకూరు సీఐ సంగమేశర్వరావు సిగ్గుపడాలి….ఖాకీ చొక్కా వేసుకునే అర్హత కూడా కోల్పోయారు.
– సంగమేశ్వరరావు చెడ్డ వ్యక్తి కానప్పటికీ పోలీసుకు ఉండాల్సిన సత్తా లేకుండాపోయింది..పక్కన దుర్మార్గుడైన ఎస్సైని పెట్టుకుని సమర్ధిస్తారా…ఊరు, పేరు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేసిన మీరు కూడా మాట్లాడుతారా?
– రెండు నెలల క్రితం తాటపర్తిలో రైతు శ్రీనివాసులు రెడ్డిని దారుణంగా కొట్టిన కేసులో కరిముల్లా ముద్దాయిగా ఉన్న విషయం సీఐ మరిచిపోయారా..వెంకటాచలం ఎస్సైగా ఆయన చేసిన అరాచకాలు సంగమేశ్వరరావుకి తెలియవా?
– అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వెనకేసుకొస్తున్న జిల్లా ఎస్పీ ఉన్నా ఒకటే…లేకపోయినా ఒకటే…
– కొందరు పోలీసులకన్నా దారిదోపిడీ దొంగలు మేలనే పరిస్థితులు వస్తున్నాయి…ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటే తిరిగి వారినే హింసిస్తున్నారు.
– దళితుడిని కొట్టి చంపేసిన పోలీసులపై చర్యలు తీసుకుని డీజీపీ నిజాయితీపరుడు, నిష్పక్షపాతి అని నిరూపించుకోవాలని కే.వీ.రాజేంద్రనాథ్ రెడ్డిని కోరుతున్నాం.

Leave a Reply