Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం

– అనుకున్న సమయానికే ఏర్పాటు కానున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
– తుది రూపును పరిశీలించడానికి ఢిల్లీ వెళ్లనున్న విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు
– నిర్మాణ పనులను సమీక్షించిన మేరుగు నాగార్జున

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులు సజావుగా జరుగుతున్నాయని, నిర్ణీత గడువులోగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. నమూనా విగ్రహాన్ని పరిశీలించడానికి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆగస్టు నెలలో ఢిల్లీ కి వెళ్లనుందని తెలిపారు.

సచివాలయంలో మంగళవారం ఆయన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాబోయే అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని ఈ నేపథ్యంలోనే విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ స్థాయిల్లో రూపొందించిన విగ్రహాల నమూనాలను నిర్మాణ కమిటీ పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగిందని చెప్పారు.

కమిటీ సభ్యుల సూచనల ప్రకారం విగ్రహ శిల్పి ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం తుది రూపు ను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ చిన్న పరిమాణాలలో విగ్రహ రూపు రేఖలు పరిశీలించిన నిర్మాణ కమిటీ 125 అడుగుల స్థాయిలో ఉన్న విగ్రహ నమూనాలను పరిశీలించడానికి ఆగస్టు నెలలో ఢిల్లీ కి వెళ్లనుందని నాగార్జున వెల్లడించారు. వాస్తవమైన పరిమాణంలో బంకమట్టి, మైనంలతో రూపొందించిన విగ్రహాల నమూనాలను కమిటీ సభ్యులు అక్కడ పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగానే విగ్రహ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అనుకున్న సమయానికే విగ్రహం ఆవిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని నాగార్జున అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, డైరెక్టర్ కే. హర్ష వర్ధన్,. ఏపీఐఐసి ఎస్.ఈ. నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE