Suryaa.co.in

Andhra Pradesh

స‌చివాల‌యాల్లో ఇసుక బుకింగ్ స‌దుపాయం

  • వినియోగ‌దారుడు అక్క‌డే డ‌బ్బులు చెల్లించాలి
  • రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణా ఛార్జీలు కూడా స‌చివాల‌యాల్లోనే చెల్లింపు
  • ఇసుక సామాన్యుడి హ‌క్కు
  • ఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తాం
  • క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి: ఇసుక కావాల్సిన వినియోగదారులు త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. స‌చివాలయంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో గ‌నుల శాఖ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై మాట్లాడుతూ ఈ విష‌యం చెప్పారు.

ఇసుక ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌హ‌జ వ‌న‌రు అని, అది సామాన్యుడి హ‌క్కు అని, దాన్ని ఎవ‌రికి వారు ఇష్టానుసారం దోచుకోవ‌డాన్ని త‌మ ప్ర‌భుత్వం స‌హించ‌ద‌న్నారు. సామాన్యులంద‌రికీ ఇసుక ఉచితంగా ల‌భించేలా పూర్తీ పార‌ద‌ర్శ‌క‌త పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇసుక కావాల్సిన వినియోగ‌దారులు ఇక‌పైన త‌న‌కు ఎంత ఇసుక కావాలో త‌మ ప్రాంతంలోని స‌చివాల‌యంలోనే బుకింగ్ చేసుకునే విధానం తీసుకొస్తున్నామ‌ని, ఇసుక రీచ్ నుంచి త‌న ఇంటికి ఇసుక తీసుకెళ్ల‌డానికి ర‌వాణ ఛార్జీలు కూడా స‌చివాల‌యంలోనే చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

రీచ్ నుంచి ట్ర‌క్కులో ఇసుక వినియోగ‌దారుడి ఇంటికి చేరిన త‌రువాత‌, వినియోగ‌దారుడు త‌న‌కు ఇసుక చేరింద‌ని చెప్పిన త‌రువాతే ఆ ర‌వాణ ఖ‌ర్చులు ఆ ట్ర‌క్కు య‌జ‌మానికి రిలీజ్ చేసేలా ప‌ద్ద‌తి తీసుకొస్తామ‌న్నారు. ఇసుక తీసుకెళ్ల‌డానికి ఉప‌యోగించే ట్ర‌క్కుల‌న్ని కూడా ప్రీపెయిడ్ టాక్సీల త‌ర‌హాలో ఊబ‌రైజేష‌న్ చేస్తామ‌ని చెప్పారు. రేట్లు కూడా స్టండ‌ర్డైజేష‌న్ చేస్తామ‌న్నారు.

పేద‌ల‌కు, సామాన్యుల‌కు చెందాల్సిన ఇసుక ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించ‌మ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇసుక‌లో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించి ప్రభుత్వానికి చెడ్డ‌పేరు తేవ‌ద్ద‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు.

త‌ప్పు చేసినోళ్లు త‌ప్పించుకోలేరు

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇసుక అక్ర‌మాలు య‌థేచ్ఛ‌గా జ‌రిగాయ‌ని చివ‌ర‌కు సుప్రీం కోర్టుకు చెప్పినా స‌రే భ‌య‌ప‌డ‌ని స్థితికి వ‌చ్చార‌న్నారు. త‌ప్పు చేసిన‌వాళ్లు ఎవ‌రూ కూడా త‌ప్పించుకోలేర‌ని, టెక్నాల‌జీ ద్వారా ఇన్వెస్టిగేష‌న్ చేస్తే ఎవ్వ‌రూ త‌ప్పించుకోలేర‌ని సీఎం చెప్పారు. అధికారులు కూడా సుప్రీం కోర్టు అడిగిన దానికి ఎలాంటి దాప‌రికాలు లేకుండా నిష్ప‌క్ష‌పాతంగా నిజాలు తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇసుక అక్ర‌మాల‌పై సీబీసీఐడీ ద‌ర్యాప్తు చేయిస్తామ‌న్నారు. ఖ‌నిజ సంప‌ద ప్ర‌భుత్వానికి ఒక ఆదాయ వ‌న‌రు అని అందులో అక్ర‌మాల‌కు తావు లేకుండా చూడాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు

LEAVE A RESPONSE