Suryaa.co.in

Andhra Pradesh

గ్రామపంచాయతీలలో దొంగలు పడి.. రూ. 8660 కోట్లు దొంగిలించారు

– సైబర్ క్రైమ్ కేసు కట్టి సిబిఐ చేత దర్యాప్తు జరిపించండి
– కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులు
– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ లో కలిసి గ్రామపంచాయతీల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించడంపై ఫిర్యాదు చేసిన ఆం.ప్ర. సర్పంచుల సంఘం, ఆం.ప్ర. పంచాయతీరాజ్ ఛాంబర్
– ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల “చలో ఢిల్లీ”
– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్ర ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కమిటీల వైయస్సార్సీపి, టిడిపి, జనసేన, బిజెపి, సిపిఐ, సీపీఎం మొదలగు అన్ని పార్టీలకు చెందిన 100 మంది సర్పంచులు ” చలో ఢిల్లీ ” కార్యక్రమం చేపట్టి 2 – 8 – 2023 న ఢిల్లీకి వచ్చాం.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి , కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి , కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి , కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి మొదలగు కేంద్ర ప్రభుత్వ పెద్దలను అధికారులను కలిసి రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల, పంచాయితీల, సర్పంచుల దుస్థితి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు దొంగలించడంపై, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి మెమోరండములు సమర్పించాం.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు ఇచ్చిన ఆర్దిక సంఘం నిధులు రూ,,8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా,దొంగిలించి, దారి మళ్లించి తన సొంత పథకాలకు, సొంత అవసరాలకు వాడి వేసుకున్న విషయం పైన మరియు 2022-23 సంవత్సరమునకు చెందిన 2010 కోట్లు, 2023 -24 సంవత్సరము కు చెందిన 2035 కోట్లు, మొత్తం రూ,,4045 కోట్లు ఇంకా మా పంచాయతీలకు విడుదల చేయకపోవడం గూర్చి కేంద్రానికి ఫిర్యాదు చేశాం.

ఇంకా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం – 2006 క్రింద వచ్చే నిధులు నరేగా చట్టప్రకారం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు సుమారు రూ,, 35 వేలకోట్ల రూపాయలను హైజాక్ చేసి తన సొంత అవసరాలకు, పథకాలకు వాడి వేసుకుంటున్న విషయం గూర్చి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం.

భారత రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ఏర్పడిన గ్రామపంచాయతీలను, సర్పంచులను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను డమ్మీలను చేస్తూ వారి అధికారాలను రాజ్యాంగేతర శక్తులైన గ్రామ వాలంటీర్లకు కట్టబెట్టడం గూర్చి, రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జప్పీటీసీలకు , వార్డు మెంబర్లకు సమాంతరమైన, పోటీ వ్యవస్థ, రాజ్యాంగేతర శక్తులుగా గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, సర్పంచులను,ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలు లాగా మార్చి వేసిన దుస్థితి గూర్చి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక,చట్ట వ్యతిరేక చర్యలు గూర్చి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 12918 మంది గ్రామ సర్పంచులు కనీసం త్రాగునీరు కూడా అందించలేని దుస్థితి గూర్చి , ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం “జల జీవన్ మిషన్” పథకాన్ని కూడా మూలనపడేసిన దారుణం గూర్చి, ఇంకా మొదలగు అనేక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల పై చేస్తున్న అరాచకాల గూర్చి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం.

అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలుగా 2019 – 23 వరకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా మా స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన వేలకోట్ల రూపాయల వాటా నిధులను ఇవ్వకుండా ఎగ వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్య గూర్చి, అదేవిధంగా మా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చట్టప్రకారం ఇవ్వవలసిన మైనింగ్ సెస్, ఇసుకలో వాటా నిధులు, రిజిస్ట్రేషన్ ఫీజు సెస్, ప్రొఫెషనల్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్, నీటి తీరువా నిధులు, తలసరి గ్రాంట్, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు 2019 నుంచి 2023 వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సుమారు రూ,,3 వేలకోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టి ఆ నిధులు దారి మళ్లించి తన సొంత పథకాలకు, అవసరాలకు వాడి వేసుకుంటున్న దారుణమైన విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం.

దేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా మా గ్రామపంచాయతీ ” పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లోనే జమ చేయాలని “, అలాగే “రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన రూ,,8660 కోట్ల నిధుల పైన సైబర్ క్రైమ్ కేసు కట్టి, సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించి మా నిధులు మాకు వెంటనే ఇప్పించాలని” , రాజ్యాంగేతర, సమాంతర వ్యవస్థలైన “గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను” రాజ్యాంగం ప్రకారం మా గ్రామ పంచాయతీల్లో విలీనం చేయాలని, “నరేగా నిధులు కూడా నేరుగా మా గ్రామపంచాయతీలకే పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో జమ చేయాలని” మొదలగు అంశాలను, డిమాండ్లను లిఖితపూర్వకంగా మా మెమోరాండంలను కేంద్ర ప్రభుత్వానికి మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులం సమర్పించాం. .

మా న్యాయబద్ధమైన 16డిమాండ్ల పరిష్కారం కోసం గత రెండు సంవత్సరాలుగా మా సర్పంచ్ ల సంఘం ,పంచాయతీ రాజ్ ఛాంబర్ లు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తూ వివిధ ఆందోళనా కార్యక్రమాలు చేస్తూ, వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం పైన, ఆ 16 సమస్యలపై స్పందించకపోవడం పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం.

మరియు సర్పంచుల న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ఆ 16 డిమాండ్లు సర్పంచుల వ్యక్తిగతమైనవి కావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలవే ఆ డిమాండ్లు. కనుక ఆ 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.

2 -8 – 2023 నుంచి 5 – 8 – 2023 వరకు ఢిల్లీలోనే ఉండి అందరు నాయకులను కలిసి పంచాయతీలపై – సర్పంచుల పై రాష్ట్ర ప్రభుత్వ దమన కాండను సాక్షాధారాలతో సహా వివరించినాము. ఢిల్లీ వచ్చిన సర్పంచ్ లలో వైఎస్ఆర్సిపి, టిడిపి, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం మొదలగు అన్ని పార్టీలకు చెందిన 100 మంది సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు ఉన్నారు.

LEAVE A RESPONSE