దీక్షలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరిఫ్, కొమ్మారెడ్డి పట్టాభిరాం
సంఘీభావం తెలిపిన జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్మిక సంఘాలు
స్వచ్ఛందంగా దీక్షలో కూర్చున్న న్యాయవాదులు
మంగళగిరి టౌన్, అక్టోబర్ 2: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసగా గాంధీ జయంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపం పక్కన సత్యమేవ జయతే పేరుతో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరిఫ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి టీ.ఎన్.టి.యూసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రాఘురామరాజులు దీక్షలో కూర్చున్నారు.
ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు స్వచ్ఛందంగా దీక్షలో కూర్చున్నారు. సైకో పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దుస్థితిని వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, మునగపాటి మారుతీరావు, హుస్సెన్ రావు, సీపీఎం నాయకులు ముసలి పకీరాయ్య, సీపీఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, చిన్ని తిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జిల్లా నాయి బ్రహ్మణ సేవా సంఘం సాధికార కమిటీ సభ్యులు, స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన వారు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. సాయంత్రం కార్మికులు సంఘాల నాయకులు దీక్షలో కూర్చన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబును ఎటువంటి ఆధారం లేని కేసులో అరెస్టు చేశారని మండిపడ్డారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు తప్పు చేయలేదు. ఏవరిని చేయనివ్వలేదని పేర్కొన్నారు. 74 సంవత్సరాల వ్యక్తిని అక్రమంగా. జైల్లో పెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు.
మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాలలో సత్యమేవ జయతే దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ గాంధేయ మార్గంలో నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని ప్రజలు దగ్గరగా చూస్తున్నారన్నారు. జగన్ ను 5 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబును జైలులో చూసి చాలా బాధ కలుగుతుందని చెప్పారు.
స్కిల్ కేసు ఎప్పుడు పెట్టారు ఎప్పుడు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే 160 సీట్లుకు పైగా గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. మేము తప్పు చేయము. ఒకవేళ చేశామని నిరూపిస్తే నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామన్నారు. ఎన్నో పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. చంద్రబాబు బయట ఉంటే తమకు భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి జగన కుట్రపన్ని అక్రమ కేసుల్లో జైలుకు పంపారన్నారు. చంద్రబాబును అరెస్టుచేసి జగన్ తన పీకను తాను కోసుకున్నారని వ్యాఖ్యనించారు.
అసలు రింగ్ రోడ్డే లేదు అవినీతి జరిగిందని కేసులు పెడుతున్నారని అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో జగన్ చేస్తున్నటువంటి పరిణామాలను ఎప్పుడు చూడలేదని విమర్శించారు. ‘‘మొతా మోగిద్ధాం’’ కార్యక్రమంలో సౌండ్ చేశారని పోలీసులు కొందరి పై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ యధేచ్చగా బయట తిరుగుతున్నాడని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్ష కోట్లు అవినీతి చేసి పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఏ తప్పు చేయకున్నా జైలులో చంద్రబాబును హింసిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ కేసులో భాగస్వాములు వారు ఎక్కడికి పారిపోయిన తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు.
ప్రజాస్వామ్యంకు ఇబ్బంది కలగకుండా చూడాలని మా నాయకుడు జైలు వెళ్ళేటప్పుడు మాకు చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ 70 దేశాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. సత్యమేవ జయతే తమ నినాదమన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్ బంగాళఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అంతవరకు తాము విశ్రమించమని, పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. రేపు సుప్రీంకోర్డులో న్యాయం జరుగుతుందన్నారు. దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.