Suryaa.co.in

Andhra Pradesh

ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది!

• వైసీపీవాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది జనసేన- తెలుగుదేశం ప్రభుత్వమే
• పొత్తు ధర్మం పాటించి పరస్పరం సహకరించుకుందాం
• రాష్ట్రాన్ని అంధకారం నుంచి కచ్చితంగా బయటకు తీసుకొస్తాం
• అభివృద్ధి జరగాలంటే కులాలను దాటి ఆలోచించాలి
• ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది
• దుర్మార్గ స్వభావం కలిగిన వ్యక్తి జగన్… అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు
• మచిలీపట్నం నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ 

‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాం. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే ముందున్న లక్ష్యం. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయి. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం. గెలుపు నిష్పత్తి బట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయిద్దామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సోమవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వైసీపీ నాయకుడు డ్రాకులా మాదిరిగా అధికారానికి అలవాటుపడ్డాడు. దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. జగన్ ను టీనేజ్ నుంచి గమనిస్తున్నాను. కడప జిల్లాలో ఒక పోలీస్ అధికారిని లాకప్ లో వేసి దాడి చేసిన నైజం అతనిది. జగన్ స్వభావం కూడా అత్యంత దూకుడు, దుర్మార్గంగా ఉంటుందని చాలా మంది సన్నిహితులు చెప్పేవారు. తెలంగాణలో జగన్ బ్యాచ్ చేసిన దోపిడీ అంతాఇంతా కాదు. వారి దోపిడీని భరించలేక తెలంగాణ యువత తిరుగుబాటు చేసింది. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు హానికరం అని భావించే మొదటి నుంచి వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు హానికరమని చెబుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ప్రత్యక్షంగా అతను పెడుతున్న బాధలు అనుభవిస్తున్నారు.

• ప్రజలు కోరుకున్న పొత్తు ఇది
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే బలమైన సీట్లు సాధించేది. అయితే అధికారం సాధించేందుకు మన బలం సరిపోతుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రజలు సైతం జనసేన పార్టీని నమ్ముతున్నప్పటికీ అధికారం సాధించే దిశగా పార్టీ ప్రయాణం చేస్తుందా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ద్వారా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామనే నమ్మకం ప్రజల్లోనూ కలిగింది. జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొవాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కచ్చితంగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

దీనిని ప్రజలు కూడా ముక్త కంఠంతో ఆమోదిస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు ప్రజలు నిర్ణయించిన పొత్తు. వారు కోరుకున్న పొత్తు. రాజకీయాల్లో ప్రజల కోసం మాత్రమే పని చేయాలి. వారి ఉన్నతి కోసమే ఆలోచించాలి. వ్యక్తిగత లెక్కలు ఏమీ ఉండవు. జనసేన పార్టీ రోడ్ల మీద పోరాటం చేసే పార్టీగానే ఉండిపోకూడదు. రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయడం అవసరం. మన దగ్గర సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి పరిష్కారం చూపించే విధంగా మనం తయారవ్వాలి.

• సహకారం, సంఘర్షణ రెండు కీలకమే
రాజకీయాల్లో అవసరం మేరకు కలుస్తాం. నేను తెలుగుదేశం పార్టీతో గతంలో విభేదించిన మాట వాస్తవం. రాజధానికి 33 వేల ఎకరాలు ఒకేసారి సేకరించడం మీద విభేదించాను. హైదరాబాద్ నగరం మాదిరి అంచలంచెలుగా ఎదగాలని భావించాను. క్రమక్రమంగా రాజధాని ఉన్నత దశకు వెళ్తుందని నమ్మాను. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ విధానం విషయంలో విభేదించాను.

అయితే ప్రస్తుతం అంధకారంలోకి వెళ్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవడం కోసం పరస్పర సహకారం అవసరం. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. ముఖ్యంగా సహకారం, సంఘర్షణ కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భావి భవిష్యత్తు బాగుండాలి అంటే సహకారం అవసరం. 2024లో సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల జనసేన ఎదుగుతుంది. తెలుగుదేశం స్థిరపడుతుంది. ఇంకా మాతో కలిసి పని చేయాలి అనుకునే వారిని కూడా కలుపుకొని వెళ్తాం.

• ఆరు నెలల్లో ఇంటికి వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి
వైసీపీ నేతలు మరో 6 నెలల్లో ఇంటికి వెళ్లబోతున్నారు. ఇష్టానుసారం ప్రవర్తించకండి. మా నాయకులను, కార్యకర్తలను కేసులు, దాడులు పేరుతో భయపెట్టకండి. భవిష్యత్తులో వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తల దగ్గరకే వచ్చి కాస్త సహాయం చేయండి అని అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అధికారులు, పోలీసులు కూడా దీనిని గుర్తుపెట్టుకోండి.

మరో ఆరు నెలల్లో పోతున్నారు. పద్దతిగా ఉండండి. ప్రస్తుతం వైసీపీ నాయకులు, కార్యకర్తల ఫ్రస్టేషన్ చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలి వేస్తుంది. కొండ అంచుకు వెళ్ళి దూకేసే వాడిని చూసి ఏం చేయగలం? ఓడిపోయే పార్టీలోని ఓడిపోయే నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జన సైనికులు వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

• పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాం
రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు అంటూ ఉండరు. ప్రస్తుత పొత్తు ధర్మం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలి. పాత విషయాలను మనసులో పెట్టుకొని మనలో మనం గొడవలుపడితే కచ్చితంగా మళ్లి జగన్ అధికారంలోకి వస్తాడు. మన మధ్య లేనిపోని చిచ్చుపెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు.

లోక కళ్యాణం కోసం గరళం కంఠంలో నింపుకున్న పరమశివుడిలా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర శ్రేయస్సు కోసం పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలి. నేను కూడా సభ వేదికలపై జనసేన – తెలుగుదేశం అని సంబోధిస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ల వేదికలపై తెలుగుదేశం- జనసేన అని చెబుతారు. ఇరువురి గౌరవాలకు ఏ మాత్రం భంగం కలగకుండా పొత్తును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండి. వారి పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటుంది. ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దాం. అలాగే పోరాటాలకు వేదిక అయిన జనసేన పార్టీని సైతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సముచితంగా గౌరవించాలని ఆకాంక్షిస్తున్నాను.

• చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దుతాం
ఒకప్పుడు అద్భుతమైన ప్రగతిని సాధించి ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన కేంద్రమైన మచిలీపట్నం అద్భుతమైన నేల. దీంతో పాటు అవనిగడ్డ, పెడన, కైకలూరు పట్టణాలను అద్భుతంగా అభివృద్ధి చేసి చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దే ప్రణాళికను చేపడతాం. ఇక్కడ నుంచి మత్స్య సంపదతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులను అధ్యాయనం చేసి ఈ పట్టణాల దశదిశ మార్చేలా ప్రణాళిక రచిస్తాం.

జగన్ ఏ ఒక్కరి సంపదను వదిలేలా కనిపించడం లేదు. తాజాగా దస్టావేజులు మనకు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకొస్తానని చెబుతున్నారు. అంటే మన సొంత ఆస్తుల దస్టావేజులు కూడా మన దగ్గర ఉండే పరిస్థితి ఉండదు. ఫోటోస్టాట్ కాపీలు ఇస్తాడట. అవేందుకు నాలుక గీసుకోవడానికి. ఒక్క బటన్ నొక్కి వైసీపీ నాయకులే వాటిని కాజేస్తారు. మత్స్యకారుల పొట్టకొట్టేలా జీవో 217 తీసుకొస్తే జనసేన ధైర్యంగా మత్స్యకారుల తరఫున పొరాడింది.

2047కు బలమైన నాయకులు జనసేన నుంచి తయారు కావాలి. బందరు పోర్టు నిర్మాణం ఎన్నికల స్టంట్ గా తయారైంది. ఇప్పటికి మూడు సార్లు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పోర్టు నిర్మాణం చేస్తామని చెబుతున్నారు. దీనిని బందరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రూ.10 వేల కోట్లు కాదు రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసినా పోర్టు నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు.

• సినిమాలు ఎందుకు చేస్తున్నాను అంటే..?
150 మంది క్రియాశీలక కార్యకర్తలతో మొదలైన జనసేన ప్రస్థానం నేడు 6 లక్షల 60 వేల క్రియాశీలక కార్యకర్తలుగా మారింది. మనందరినీ బలమైన భావజాలం కలిపింది. అంచలంచెలుగా మనం ఎదుగుతున్నాం. అదే పద్ధతిలోనే అధికారంలోకి వస్తాం. గత ఎన్నికల్లో సుమారు 7 శాతం ఓటింగ్ శాతం వస్తే ఇప్పుడు పార్టీ గ్రాఫ్ పెరిగినట్లు వైసీపీ నాయకులే చెబుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో గెలిచే స్థాయికి పార్టీ ఓటింగ్ పెరిగింది. జగన్ నడిచాడు, ముద్దులు పెట్టాడు, మాయమాటలు చెప్పి నమ్మించాడు. దేవుడని నమ్మి అధికారం ఇస్తే ఇప్పుడు దెయ్యమై పీడుస్తున్నాడు. మనల్ని జనం నమ్మాలంటే వారి తరఫున మనం బలంగా నిలబడాలి. వారి సమస్యలు తీర్చేందుకు పోరాడాలి. ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడి తట్టుకోవాలి. మన కోసం వీళ్లు నిలబడారు అనే నమ్మకం ప్రజల్లో రావాలి.

నేను పార్టీని ప్రజల కోసం పెట్టాను. ఎవరి దగ్గర చేయి చాచి దేహీ అని అనకుండా బలంగా ఆత్మగౌరవంతో పార్టీ నడపాలంటే కచ్చితంగా నేను సినిమాలు చేయాలి. పార్టీని వేరే వ్యక్తుల దగ్గర తీసుకున్న డబ్బుతో నడపడం నా ఆత్మగౌరవానికి నచ్చదు. నాది చాలా చిన్న జీవితం. నా ఇష్టాలు కూడా స్వలంగా ఉంటాయి.

2008లో రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మొగ్గలోనే తుంచేశారు. మనవారే మనకి వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో ఎంతో అంతర్మథనం చెందాను. అప్పుడు నేను ఇచ్చిన మాటకు కట్టుబడే సమయం కోసం వేచి చూసి జనసేన పార్టీని సిద్ధాంత బలంతో స్థాపించాను. నాకు నైతిక బలం ఎక్కువ. అదే భావజాలాన్ని పార్టీ కార్యకర్తలకు తీసుకు వెళ్లాను. ఈ రోజు ప్రభుత్వం జనసేన మీద దాడులు చేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది అంటే మనది పోరాట బలం. ఆ బలం నైతిక బలంతోనే వస్తుంది. గొప్ప ఆత్మబలం ఉన్న రాజకీయ శక్తి జనసేన పార్టీ.

• కులాలను దాటి రాజకీయం చేస్తేనే అభివృద్ధి సాధ్యం
అన్ని కులాలనీ గౌరవించే వ్యక్తి కాపు కులంలో ఉంటే కాపులు ఎందుకు హర్షించరు. కాపు కులంలో పుడితే కేవలం కాపుల కోసమే పని చేయాలంటే ఎలా? అభివృద్ధి జరగాలంటే కులాలను దాటి పని చేయాలి. చేతి వేళ్లు అన్ని కలిసి ఉన్నట్లే మనం కలిసి ఉండాలి. అన్ని కులాల ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా ఆలోచించినప్పుడే నాయకుడు అవుతాడు. అన్ని కులాల మద్దతు ఉన్నప్పుడే అధికారం దక్కుతుంది. నేను వ్యక్తిగత జీవితంలోనూ కులాల గురించి ఎప్పుడు ఆలోచించను. వాటి ఆధారంగా స్నేహాలు చేయను.

వివిధ కులాల నుంచి తమ కొడుకులు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన వారు సైతం కులం గురించి మాట్లాడం చూస్తే నవ్వొస్తుంది. మనతో పాటు అందరూ అనుకోవాలి. బీఎస్పీ లాంటి యాంటీ బ్రాహ్మిణ్ సిద్ధాంతంతో వచ్చిన పార్టీ సైతం 20 ఏళ్ల తరువాత బ్రాహ్మణులను కలుపుకొనే రాజ్యాధికారం సాధించింది. కులాలను పూర్తిగా గౌరవిస్తాం. సమస్త కులాలకు న్యాయం జనసేన పార్టీతోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కులాభిమానం అడ్డంకిగా మారకూడదు.

మూడేళ్ల క్రితం రాజమండ్రిలో – కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని నేను చెప్పాను. బలమైన సమూహం ఉన్న కాపులు మిగిలిన కులాలను కలుపుకొని ముందుకు వెళ్లాలి అని ఆలోచించి చెప్పిన మాట. ఒక్క కులం వల్ల అధికారం సాధ్యం కాదు. సామాజిక అంశంగానే కులాన్ని చూస్తాను. మనమంతా కులం, భాష నుంచి తప్పించుకోలేం. విశాలదృక్పథంతో జనసేన పార్టీ అందరినీ కలుపుకొని వెళ్లాలని ఆలోచిస్తుంది. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని విశ్వదృష్టి ఉన్న పార్టీ జనసేన. నాకు బలంగా నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు జనసేన పార్టీ భావజాలం దేశమంతా వ్యాప్తి చెందుతుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

• ప్రజలు ఆశీర్వదించాలి
రాష్ట్ర విభజన సమయంలో ప్రజా ప్రతినిధులు వ్యవహార శైలి సరిగా లేకనే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అప్పటి ప్రజాప్రతినిధులు చేసిన తప్పిదం ఇప్పటికీ శాపంగా ఉండిపోయింది. మూడు రాజధానులు అంటూ హడావుడి చేశారు. సామాన్యుడు ఎక్కడికి తిరగగలడు. రాష్ట్రం విడిపోయి దశాబ్దం అవుతున్నా ఏది రాజధానో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాం. రాష్ట్ర దశదిశ మార్చడానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం కూటమికి ప్రజలు తమ మద్దతును తెలియజేయాలి. కచ్చితంగా ఉజ్వల ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేలా బాధ్యత తీసుకుంటాం” అన్నారు.

LEAVE A RESPONSE