Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డికి అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ

అంటువ్యాధులు మరణ మృదంగం మోగిస్తుంటే కనీస దోమలను కూడా చంపలేని స్థితి
-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ

28.09.2022
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అమరావతి
విషయం: రాష్ట్రంలో విష జ్వరాల విజృంభణ, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు శూన్యం. గుంతల రోడ్లలో నీరు నిల్వ కారణంగా దోమల స్వైర విహారం, ఎక్కడ చూసినా మలేరియా, చికెన్ గున్యా కేసులు, మన్యంలో మరణ మృదంగం, జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు అందని కనీస వైద్యం గురించి….

రాష్ట్రమంతటా విషజ్వరాల విజృంభణతో సకాలంలో వైద్యం అందక అమాయక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటువ్యాధులు మరణ మృదంగం మోగిస్తుంటే కనీస దోమలను కూడా చంపలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుగా ఉంది. నాడు-నేడు కింద వైద్య రంగంలో విప్లవం తీసుకొస్తున్నాం, వేల కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజీలు పెడుతున్నామని అసెంబ్లీలో మాటల కోటలు కడితే ప్రజారోగ్యం బాగున్నట్టేనా ముఖ్యమంత్రిగారు? జ్వరానికి గోలీబిళ్లలు ఇవ్వలేని ప్రభుత్వాసుపత్రులు ఎందుకు ?

గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అంటువ్యాధులు ప్రబలకుండా ముందే చర్యలు తీసుకున్నారు. దోమలపై దండయాత్ర పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విష జ్వరాలకు అడ్డుకట్ట వేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకపోవడం దేనికి సంకేతం? ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన? దోమలపై దండయాత్ర అంటే ఎగతాళి చేసిన మీరు విష జ్వరాలు ప్రజలను మింగేస్తుంటే చోద్యం చూడటం బాధ్యతారాహిత్యం కాదా? 2022 జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ రాష్ట్రంలో 1,337 మంది మలేరియా, 2,274 డెంగ్యూ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నప్పటికీ అనధికారికంగా ఈ కేసులు వేలల్లో ఉన్నాయి.

గ్రామాల్లో , ఏజెన్సీ ఏరియాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
విష జ్వరాల పీడితులు మంచాలకే అతుక్కుపోయారు. గోదావరి వరద ప్రభావిత ఏజెన్సీల్లోని వసతి గృహాల్లోనైతే పరిస్థితి దారుణంగా ఉంది. విద్యార్థులు విష జ్వరాలకు అన్యాయంగా బలైపోతున్నారు. పంచాయతీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులనూ దారి మళ్లించేయడంతో గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కింది. పారిశుద్ధ్య పనుల్లేవు. మొన్నటి వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గుంతల రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.

నిల్వ నీటిని తొలగించేందుకు ప్రతివారం ఫ్రైడే డ్రైడే పేరుతో నిర్వహించే డ్రైవ్ నూ అటకెక్కించారు. నాడు చంద్రబాబు గారు పారిశుద్ధ్య పర్యవేక్షణకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమించారు. మంత్రులు రాష్ట్రమంతటా ర్యాలీలు చేయడంతో పాటు స్వయంగా దోమల నివారణ మందులు పిచకారీ చేసి అవగాహన కల్పించారు. నేడు ఆ దిశగా చర్యల్లేవు. మూడేళ్లుగా ఎక్కడా దోమ తెరల పంపిణీ జరగడంలేదు.

రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వైద్యం అందడం లేదు. పీహెచ్ సీలు, సీహెచ్ సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కనీస వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పారాసిట్మాల్, డోలో కూడా అందుబాటులో ఉండని పరిస్థితి. డెంగ్యూ , మలేరియాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు కావడంలేదు. పేదలు సొంత డబ్బులతోనే చికిత్స, మందులు కొనుక్కుంటున్న పరిస్థితి. ప్రాణాలు దక్కించుకునేందుకు రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కట్టడంతో ఇదే అదనుగా అక్కడ డబ్బులు పిండేస్తున్నారు.

చేతిలో డబ్బు లేనివారు ఇంటి దగ్గరే తోచిన వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సాఆర్ విలేజ్ క్లీనిక్ ల పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో రోగులకు వైద్యం అందించలేకపోవడం సిగ్గుచేటు. అంటువ్యాధుల నిర్ధారణకు చేసే ఎలిసా పరీక్ష కూడా సరిగా చేయడంలేదంటే ఇంతకంటే దారుణం ఏముంది? ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యశాఖ నిర్లక్ష్యం వీడి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి. పాలకులు ప్రగల్భాలు పక్కనపెట్టి ప్రజల ప్రాణాల రక్షణపై దృష్టి పెట్టాలి.

– అనగాని సత్యప్రసాద్
టీడీపీ శాసనసభ్యులు

LEAVE A RESPONSE