-థూ.. యాక్.. ఇదేం రాజకీయం?
– అప్పుడు బాబాయ్ గొడ్డలి.. ఇప్పుడు సోషల్‌మీడియా గీతాంజలి
– ఎన్నికల ముందే శవరాజకీయాలు ఎందుకు?
– గీతాంజలిది హత్యా?ఆత్మహత్యా?
– ఆమెను రైలు నుంచి తోసిందెవరు?
– సీసీ టీవీలు స్వాధీనం చేసుకోలేదేం?
– ఆమెను వైసీపీ సోషల్‌మీడియా ఆఫీసుకు తీసుకువెళ్లేదెవరు?
– బతికున్న వీడియోతో రహస్యం బట్టబయలు
– గత ఎన్నికల ముందు వివేకా హత్యతో సానుభూతి
– ఇప్పుడు గీతాంజలి సానుభూతిలో ‘సోషల్’ మాయ
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘రా అంటే రాక్షసంగా జ అంటే జనానికి కీ అంటే కీడు చేసే యం అంటే యంత్రాంగం. అదే రాజకీయం’’ అని ప్రతిధ్వని సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ డైలాగు.. గీతాంజలి అనే మహిళ మృతి ఘటనలో గుర్తుకువస్తోంది. ఎన్నికల ముందు మనుషులను చంపి దానితో పోగయ్యే సానుభూతిని వాడుకుని, అధికారం సంపాదించే అనాగరిక, అసహ్యకర రాజకీయాలు చూసేవారికి రోత మాత్రమే కాదు, వెగటు కూడా!
గత ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలిపోటుతో తెగనరికిన చేతులే.. తర్వాత సానుభూతి డ్రామాలాడాయన్నది, ఆ తర్వాత జరిగిన సీబీఐ విచారణలో తేలింది. ముందు గొడ్డలిపోటన్న అధికారపార్టీ మేధావులు, తర్వాత నాలుక మడత పెట్టి అది గొడ్డలిపోటని బయటపడటంతో సైలెంటయ్యారు. ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఒక్కరే కాదు. హతుడి బిడ్డ డాక్టర్ సునీత కూడా చంపిన చేతులెవరో సీబీఐకి చెప్పేశారు. అనుమానితులెవరో కుండబద్దలు కొట్టారు.
చివరాఖరకు అన్నయ్య సొంత మీడియాలోనే చెల్లి-బావలనే అనుమానిస్తూ రాసిన కథనాలు, టీడీపీతో వారి సంబంధాలపై అధికార పార్టీ నేతల ఆరోపణలు, సీబీఐ ఎస్పీపైనే కేసు పెట్టే బరితెగింపు అన్నీ తెరపై చూసినవే. అప్పటినుంచీ జరుగుతున్న డ్రామాలు, సీబీఐ తెలుగుటీవీ సీరియల్ జీడిపాకం విచారణ, మధ్యలో నిందితులకు రహస్యంగా బెయిల్ గట్రాలూ, కర్నూలు ఆసుపత్రిలో హైడ్రామాలూ బహిరంగమే.
తాజాగా తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ తీరుపై పెదవి విప్పిన డాక్టర్ సునీత.. తండ్రిని చంపిన హంతకుల పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. అంటే వైసీపీకి ఓటు వేయవద్దని అచ్చ తెలుగులోనే పిలుపునిచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమయిపోయింది. జరగాల్సిన డామేజీ జరిగిపోయి, చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయింది. అది వేరే కథ.
సీన్ కట్ చేస్తే.. మళ్లీ సరిగ్గా ఐదేళ్ల తర్వాత.. సరిగ్గా ఎన్నికలకు ముందే మరో శవరాజకీయం తెరపైకి వచ్చింది. కాకపోతే ఈసారి మృతి చెందినది ఒక మహిళ. ఆమె పేరు గీతాంజలి. అధికార వైసీపీ సోషల్‌మీడియా సైనికురాలన్నది విపక్షాల వాదన. ఆమెను టీడీపీ-జనసేన సోషల్‌మీడియా సైన్యమే చంపిందన్నది వైసీపేయులు తీరికూర్చుని చేస్తున్న ఆరోపణ.
ఆమె తనకు వైసీపీ సర్కారు సకల సౌకర్యాలు కల్పించిందని, దానితో తన కుటుంబ జీవితం బాగుపడిందని, అమ్మఒడి డబ్బులు కూడా వచ్చాయన్న వీడియాపై టీడీపీ-జనసేన సొషల్‌మీడియా సైనికులు, దారుణంగా ట్రోల్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందన్నది వైకాపా నేతల ఆరోపణ.
దీనికి సంబంధించి గత రెండురోజుల నుంచీ అధికార నేతల నుంచి వచ్చే వాంతులూ, విరేచనాలూ, ఏడుపులూ, పెడబొబ్బలూ వినలేక-చూడలేక వెగ టు పుట్టిస్తోంది. ఈ మధ్యలో అసలేం జరిగిందో విపక్ష టీడీపీ విడుదల చేసిన వీడియోతో ఆ రోత ఏడుపులూ- పెడబొబ్బలూ, వాంతులూ-విరేచనాలు బందయిపోవడమే విచిత్రం.
ఆ వీడియోలో గీతాంజలి అనే మహిళ రైలులో ప్రయాణిస్తున్న దృశ్యం సచిత్రంగా కనిపించగా, ఆమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు కదులుతున్న రైలు నుంచి తోశారన్న తోటి ప్రయాణీకుల మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ తర్వాత కూడా ఆమె బతికుందని, ఆతర్వాతనే ఆమె మృతదేహాన్ని రైలు పట్టాల వద్ద ఉంచారన్నది మరో అనుమానం. అంటే ఆమెది ఆత్మహత్య కాదు. హత్యేనని మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చి తీరాలి. అది ఎవరు చేశారో తేల్చాల్సింది పోలీసులే. దానికంటే ముందు సీసీటీవీ పుటేజ్ పరిశీలించాల్సి ఉంది. ఆ పని ఇప్పటిదాకా చేయకపోవడమే వింత.
మరి టీడీపీ-జనసేన ట్రోలింగులకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందన్న కట్టుకథలు-పిట్టకథలు ఎవరి సానుభూతి కోసం? సరిగ్గా ఎన్నికల ముందే ఈ కథను ఎందుకు.. ఎవరి ప్రయోజనాల కోసం తెరపైకి తెచ్చారు? కథల వేదిక సీమ నుంచి తెనాలికి ఎందుకు మారింది? ఈ కథ వైఎస్ వివేకానందరెడ్డి తన గొడ్డలితో తానే చంపుకుని, చనిపోయిన తర్వాత పైకి లేచి లేఖ రాసి, మళ్లీ తానే రక్తపు మరకలను తుడిచేసి, తన చేత్తోనే కుట్లువేసుకున్నంత అందంగాలేదూ?
గీతాంజలి మృతి తర్వాత వాస్తవాలేమిటన్నదానిపై.. సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ, తెరపైకి వ స్తున్న అనుమానాలు పరిశీలిస్తే.. డిటెక్టివ్ నవలా రచయితలు పానుగంటి-మధుబాబులు కూడా రాజకీయుల అద్భుతం-అనితర సాధ్యం-అనన్యసామాన్యమైన ఊహాశక్తికి మురిసిముక్కలయి, ఈర్ష్యతో కుళ్లుకోవాల్సిందే! గీతాంజలి అసలు ఎప్పుడు రైలెక్కింది? ఎప్పుడు చనిపోయింది? పోలీసులు ఎప్పుడు కేసు పెట్టారు? అన్న వివరాలను కూలంకషంగా వివరిస్తున్న సోషల్‌మీడియా సైనికులను అభినందించాల్సిందే. వారి పరిశోధనలో పదోవంతయినా పోలీసులు పనిచేసి ఉంటే, ఈపాటికే నిందితులెవరో తేలిపోయేదన్నది బుద్ధిజీవుల ఉవాచ.
సోషల్‌మీడియాలో గీతాంజలి మృతిపై జరుగుతున్న చర్చల తర్వాత, సహజంగానే కొన్ని అనుమానాలు తెరపైకొస్తున్నాయి. అసలు గీతాంజలికి ఫోన్లు చేసి సోషల్‌మీడియా వీడియోలు చేయాలని వేధించింది ఎవరు? ఆ ఫోన్ కాల్‌డేటాను ఎందుకు బయటపెట్టడం లేదు? గీతాంజలిని కదులుతున్న రైలు నుంచి తోసిన ఆ ఇద్దరు ఎవరు? గీతాంజలిని తాడేపల్లిలోని అధికార పార్టీ సొషల్‌మీడియా ఆఫీసుకు తరచూ తీసుకువెళ్లేవారెవరు? వైసీపీ మహిళా నేతల గావుకేకల ప్రకారం.. గీతాంజలి మార్చి 7న ఆత్మహత్య చేసుకుంటే, 11వ తేదీ వరకూ ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు? అసలు భర్త ఆమె మృతిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
ఇంకొద్దిగా లోతుకు వెళితే.. గీతాంజలి వీడియో చేసింది మార్చి 5న. తెనాలిలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది మార్చి 7న. టీడీపీ-జనసేన ఆమెను విమర్శించినదేమో మార్చి8న. గీతాంజలి మృతి చెందిందేమో మార్చి 11న. అంటే దీన్నిబట్టి తనపై ట్రోల్స్ వస్తాయని గీతాంజలి ముందే ఆత్మహత్య చేసుకుందా? అన్నది డిటెక్టివ్ నవలలు చదివే పాఠకుల ప్రశ్న. ఏమో.. వివేకా తన గొడ్డలితో తానే నరుక్కోలా? తన కుట్లను తానే వేసుకుని, నేలపై రక్తపుమరకలను డెట్టాల్‌తో కడిగేసి మళ్లీ చనిపోలా? మళ్లీ మర్చిపోయి పైకి లేచి తన లేఖ తానే రాసుకోలా? ఏమో.. గీతాంజలి కూడా తనపై ట్రోలింగులను ముందే ఊహించుకుని ఆ కారణంతో మృతి చెందిందని అనుకోవాలేమో?
అయితే.. గీతాంజలి ఘటనపై కేసు నమోదు చేసిన తెనాలి పోలీసులు మాత్రం.. మార్చి 7న గీతాంజలి పట్టాలు దాటుతుండగా, ప్రమాదవశాత్తూ రైలు ఢీకొందని, నాలుగురోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించిందని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం విశేషం. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సో.. గత ఎన్నికల ముందు బాబాయ్‌పై గొడ్డలిపోటు ఎపిసోడ్.. దానికి ‘నారాసుర రక్తచరిత్ర’ అని టైటిల్‌తో ఎన్నికల్లో సానుభూతి గెలుపు. ఇప్పుడు గీతాంజలిని టీడీపీ-జనసేన చంపేశారని ‘గీతాంజలి పట్టాల చరిత్ర’ అని మరో టైటిల్‌తో సానుభూతి గెలుపు కోసం కొత్త కథ అన్నది డిటెక్టివ్ రచయిత విశ్లేషణ. మీకు అర్ధమవుతోందా?
గీతాంజలి ఎపిసోడ్‌లో మహిళపై దారుణంగా ట్రోల్ చేశారంటూ.. అధికార పార్టీ నేతలు కారుస్తున్న టన్నుల కొద్దీ కన్నీరును తుడిచి, వారిని ఓదార్చాలంటే మళ్లీ ఒక ఓదార్పు యాత్ర కావాలి. దాన్నలా పక్కనపెడితే.. పాలకపార్టీ ట్రోలింగ్ విలాపం చూస్తుంటే.. ‘పార్టీలూ వేదాలువల్లిస్తాయ’నిపిస్తోంది.
హైకోర్టు జడ్జిలపై అమానవీయంగా ట్రోలింగ్ చేసిన మహనీయులను వదిలేసి.. వారిలో ఇద్దరికి సర్కారీ కొలువులిచ్చి.. ఆ జాబితాలో మొదటి వరసలో ఉన్న పంచ్ ప్రభాకర్‌ను ఇప్పటిదాకా చెరపట్టలేని మహానుభావులు, ట్రోలింగ్‌పై ధారాళంగా రక్తకన్నీరు కారిస్తే, చచ్చిపైలోకానున్న నాగభూషణం, మళ్లీ బతికిచస్తారేమోనన్నది కళాకారుల ఉవాచ.