Suryaa.co.in

Telangana

వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ‌కు సెకండ్ ర్యాంక్..కేటీఆర్ హ‌ర్షం

వ్య‌వ‌సాయం దండుగ అన్న చోట‌.. వ్య‌వ‌సాయం పండుగైంది. వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. ఈ రంగంలో భార‌త‌దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. ప‌లు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్ర‌భుత్వం.. సాగునీటికి క‌ష్టాలు లేకుండా పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, అన‌తి కాలంలోనే కొత్త ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డం, 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇవ్వ‌డంతో పాటు పంట పెట్టుబ‌డి సాయం కింద ఎక‌రానికి సంవ‌త్స‌రానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వ‌డం వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది. రైతుల క‌ష్టం తెలిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగంపై ప్ర‌త్యేక దృష్టి సారించి, నిర్విరామంగా కృషి చేయ‌డంతోనే తెలంగాణ రాష్ట్రం అద్భుత విజ‌యాలు సాధిస్తోంది.
నీతి ఆయోగ్ స‌భ్యులు ర‌మేశ్ చాంద్.. స్వాతంత్ర్యం భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ రంగం – గ‌తం, భ‌విష్య‌త్ పేరిట ఓ నివేదిక‌ను విడుద‌ల చేశారు. 2011-12 నుంచి 2019-20 మ‌ధ్య కాలంలో దేశంలో వ్య‌వ‌సాయ రంగం సాధించిన పురోగ‌తిని ఆ నివేదిక‌లో క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ద‌శాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయ రంగంలో 6.59 శాతం వృద్ధి రేటును సాధించి, దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డించారు. మొద‌టి స్థానంలో త్రిపుర‌(6.87 శాతం వృద్ధిరేటు) నిల‌వ‌గా, సిక్కిం కూడా రెండో స్థానంలో (6.59 శాతం వృద్ధి రేటు) నిలిచిన‌ట్లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ 5.41 శాతం వృద్ధిరేటుతో నాలుగో స్థానానికి ప‌రిమిత‌మైంది. అయితే పెద్ద రాష్ట్రాల‌తో ఈ వృద్ధిరేటును పోల్చితే తెలంగాణ అగ్రభాగాన ఉంది.
11 రాష్ట్రాల్లో 3 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు
మొత్తం 29 రాష్ట్రాల వృద్ధిరేటును ప‌రిశీలిస్తే.. 11 రాష్ట్రాల్లో మాత్ర‌మే మూడు శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించాయి. మ‌రో ప‌ది రాష్ట్రాల్లో మైన‌స్ 3.6 శాతం వృద్ధి రేటు న‌మోదైంది. మిగ‌తా రాష్ట్రాల్లో ఈ ద‌శాబ్ద కాలంలో వ్య‌వ‌సాయ రంగంలో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. ఇక ఉద్యాన‌వ‌న రంగంలో రైతులు పెద్ద‌గా వృద్ధిరేటు సాధించ‌లేదు.
వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ‌కు ఐదో స్థానం
వ్య‌వ‌సాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలైన డెయిరీ, ప‌శుసంప‌ద‌, మ‌త్స్య‌సంప‌ద‌లో సాధించిన వృద్ధిరేటును ప‌రిశీలిస్తే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఈ విష‌యంలో మిజోరం (15.48 శాతం వృద్ధిరేటు), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (8.92 శాతం వృద్ధిరేటు), త్రిపుర (8.02 శాతం వృద్ధిరేటు), సిక్కిం(6.78 శాతం వృద్ధిరేటు) మంచి వృద్ధిరేటును సాధించాయి.
వ్య‌వ‌సాయం దాని అనుబంధ రంగాల్లో పెద్ద రాష్ట్రాల‌తో పోల్చితే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత ఏపీ నిలిచింది.
జీఎస్‌డీపీలో మూడు రెట్లు పెరిగిన వ్య‌వ‌సాయ రంగం వాటా
తెలంగాణ స్టేట్ స్టాట‌స్టిక‌ల్ అబ్‌స్ట్రాక్ట్ 2020 ప్ర‌కారం.. 2011-12తో పోలిస్తే 2019-20లో జీఎస్‌డీపీలో వ్య‌వ‌సాయ రంగం వాటా దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2019-20లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ప‌త్తిలో (జీఎస్‌డీపీ) వ్య‌వ‌సాయ రంగం వాటా రూ. 1,35,109 కోట్ల‌కు చేరింది. అదే సమయంలో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుండి 2011-12లో కేవలం రూ .54,615 కోట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 2015-16లో జీఎస్‌డీపీలో వ్య‌వ‌సాయ రంగం వాటా రూ.75,707 కోట్లు.
తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంలో పురోగ‌తి ప‌రిశీలిస్తే.. 2016-17లో రూ .88,979 కోట్లు, 2017-18లో రూ .1,02,044 కోట్లు, 2018-19లో రూ .1,13,223 కోట్లుగా ఉంది. కొవిడ్‌, లాక్‌డౌన్ స‌మ‌యంలో(2020-21) కూడా వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.. 3 శాతం నుంచి 21 శాతం వృద్ధికి(జాతీయ స్థాయిలో) పెరిగింది.

LEAVE A RESPONSE