టిఆర్.యస్, వై.యస్.ఆర్.సి.పి పార్టీల మధ్య రహస్య బంధం

– టి‌డి‌పి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

టి ఆర్ యస్, వై యస్ ఆర్ సి పి పార్టీల బంధం చాలా దృడమైనదని వీరు కేవలం మీడియా దృష్టిని మరల్చి వారి స్వప్రయోజనాల కోసం పనిచేస్తారన్న విషయం రాజ్యసభ అభ్యర్డుల ఎంపిక ద్వారా మరోమారు రుజువైందని టి‌డి‌పి సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎం‌ఎల్‌ఏ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన వ్యక్తిగత ప్రయోజనాలు, తమ సహ నిందితుల ప్రయోజానాలు ముఖ్యమన్న విషయాన్ని మరోసారి రుజువు చేశారని ఆయన ఆరోపించారు. వై యస్ ఆర్ సి పి పార్టీ తరపున తన కేసులు వాదించే తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, తన సహనిందితుడు విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీట్లు కేటాయించగా తన రాజకీయ గురువు కే‌సి‌ఆర్ సహకారంతో జగన్ మరో సహనిందితుడు హెటిరో పార్ధసారధి రెడ్డికి టి‌ఆర్‌ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్దిగా ఎంపిక చేయించుకోగలిగారని తెలిపారు. తద్వారా జగన్ సహనిందితులు ఇద్దరు, తన కేసులు వాదించే న్యాయవాది ముగ్గురు రాజ్యసభకు పంపించే కార్యక్రమానికి రంగం సిద్దమైందని తెలిపారు. చట్టంలో ఉన్న లొసుగులను వినియోగించుకొని నేరస్తులు పెద్దలసభకు చేరుకొనే కార్యక్రమం వేగవంతమైందని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పదవ షెడ్యూలులో భాగంగా ఉన్న షుమారు ఇరవై వేల కోట్లకు పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విషయంలో కే‌సి‌ఆర్ సహకారం తీసుకొని జగన్మోహాన్ రెడ్డి, తన సహనిందితుడికి రాజ్యసభ సభ్యత్వం కోసం కే‌సి‌ఆర్ సహకారంతో తెసుకోవటం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన వ్యక్తిగత ప్రయోజనాలు, సహనిందితుల ప్రయోజనాలే ముఖ్యమన్న విషయం మరోమారు రుజువైందని తెలియజేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు కే‌టి‌ఆర్ , హరీష్ రావు దిగజారుతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక స్థితి, పరిపాలన వైఫల్యం గురించి మాట్లాడగా వారిపై రెచ్చిపోయి మీడియాలో మాట్లాడిన రాష్ట్ర మంత్రులు కేవలం ప్రకటనలకు పరిమితమని తెలిపారు. వారు మీడియా ముందు మాట్లాడేదానికి వాస్తవంలో జరిగే సంఘటన లకు సంబందంలేదని అన్నారు.

జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నా మాట్లాడలేని స్థితిలో రాష్ట్రమంత్రులు ఉన్నారని అన్నారు. వైకాపా నాయకులు రాష్ట్రప్రయోజనాలు తాకట్టు పెడుతుంటే టి‌ఆర్‌ఎస్ పార్టీ జగన్ వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తూ తెలంగాణ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ వినాశనం కోసం పనిచేస్తున్నారని అన్నారు. వైకాపా లాంటి పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుగుతున్న పరిణామాలు అన్నీ గమనిస్తున్నారని, వైకాపాకు తగిన గుణపాటం చెప్పడం కాయమని నరేంద్రకుమార్ హెచ్చరించారు.

Leave a Reply