Suryaa.co.in

Editorial

మళ్లీ పేలిన ‘సీమ’టపాకాయ్‌!

– ‘దేశం’లో దివాకర బాంబు
– రాయల తెలంగాణపై మళ్లీ గళం విప్పిన జెసి దివాకర్‌రెడ్డి
– తెలంగాణలో సీమ కలిసేందుకు సిద్ధమేనన్న దివాకర్‌రెడ్డి
– టీడీపీ నాయకత్వం అనుమతి లేకుండానే ప్రకటనలపై తమ్ముళ్ల ఫైర్‌
– పార్టీ మారినా ఇంకా కాంగ్రెస్‌ వాసనలు పోని దివాకర్‌రెడ్డి
– సమస్యలు సృష్టిస్తున్న జెసి సొంతవైఖరి
– దివాకర్‌రెడ్డిని తప్పు పట్టిన సీమ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
– ప్రాణం పోయినా సీమబిడ్డలుగా ఉంటామని స్పష్టీకరణ
– ప్రత్యేక రాయలసీమ కోసమే పోరాటమన్న బైరెడ్డి
– గ్రేటర్‌ రాయలసీమ మాత్రమే పరిష్కారమన్న మాజీ ఎంపి గంగుల
– జెసి వ్యాఖ్యలను కొట్టిపారేసిన తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి
– ఆంధ్రా పాలకుల చేతకానితనం వల్లే ఈ సమస్య అని విమర్శ
-పాలకులపై తిరుగుబాటు చేయమని సలహా
– రాయల్‌ తెలంగాణ ఇప్పుడు జరిగే పనికాదని స్పష్టీకరణ
– గతంలో రాయల్‌ తెలంగాణపై సానుకూలంగా స్పందించిన కోదండరామ్‌
– తెలంగాణ వాదుల వ్యతిరేకతతో అప్పటినుంచీ మౌనం
– మళ్లీ సీమ-తెలంగాణలో వాదాల వివాదం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తొమ్మిదేళ్ల తర్వాత తెలుగునాట వాదాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2014లో తెలంగాణ ఏర్పడేంతవరకూ వినిపించిన రాయల్‌ తెలంగాణవాదం.. టీడీపీ నేత జెసి దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో, మళ్లీ చర్చలోకి వచ్చింది. అది చర్చగా మారి, రచ్చ అయే దిశగా సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఫలితంగా రాయల్‌ తెలంగాణ, గ్రేటర్‌ రాయలసీమ నినాదాలు తెరపైకొచ్చాయి.

రాయలసీమలోని జిల్లాలన్నీ.. తెలంగాణలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయన్న జెసి దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు, అటు సీమ-తెలంగాణలోనే కాదు. ఇటు తెలుగుదేశం పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ అధినేత- ఏపీ సీఎం జగన్‌తో సీరియస్‌గా యుద్ధం చేస్తున్న టీడీపీ నాయకత్వానికి, జెసి వ్యవహారం తలనొప్పి సృష్టిస్తోంది. పార్టీ నాయకత్వంతో చర్చించకుండా-పార్టీ అనుమతి లేకుండా, జెసి చేస్తున్న సొంత వ్యాఖ్యలపై తమ్ముళ్లు మండిపడుతున్నారు.

కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి, విభజనకు ముందు.. టీడీపీలో చేరిన జెసి బ్రదర్స్‌ టీడీపీలో బాగానే సెటిలయ్యారు. జెసి ప్రభాకర్‌రెడ్డి కేవలం తన నియోజకవర్గ సమస్యలు-అభివృద్ధిపైనే దృష్టి సారిస్తుండగా, దివాకర్‌రెడ్డి మాత్రం ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఆయన చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టాయి. జగన్‌ను ‘మావాడు’ ‘ మా పిల్లాడు’ అని చాలాసార్లు సంబోధించిన వైనం, తమ్ముళ్లకు రుచించేది కాదు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పటికీ, దివాకర్‌లో ఇంకా ఆ వాసనలు ఇంకా పోలేదన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడి అనుమతి, పార్టీలో చర్చ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో, ఎవరు ఏ అంశంపైనయినా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. జెసి కూడా కాంగ్రెస్‌ నుంచి టీడీపీకి మారినప్పటికీ, ఇంకా కాంగ్రెస్‌ అలవాట్లు పోలేదన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

దివాకర్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు టీడీపీని ప్రాంతీయంగా మరోసారి ఇరుకున పెట్టేవేనన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. జెసి వ్యాఖ్యలపై టీడీపీ వైఖరి చెప్పాలని వైసీపీ డిమాండ్‌ చేస్తే, పరిస్థితి ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సున్నిత అంశాలే టీడీపీని, ఒక రాష్ర్టానికి పరిమితం చేశాయని గుర్తు చేస్తున్నారు.

తాజాగా..రాయలసీమలోని జిల్లాలు తెలంగాణలో విలీనం చేసి.. రాయల్‌ తెలంగాణగా ఏర్పాటుచేయాలన్న పాత వాదనను, జెసి మళ్లీ కొత్తగా తెరపైకి తెచ్చి, ప్రాంతాల తేనెతుట్టెను మళ్లీ కదిలించారు.

అప్పర్‌భద్ర ప్రాజెక్టును నిలిపివేసే పరిస్థితి లేనందున.. రాయలసీమ నష్టపోకుండా ఉండాలంటే, సీమను తెలంగాణలో కలిపి, రాయల్‌ తెలంగాణ ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కారం అని.. దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాయలసీమను తెలంగాణలో కలిపితే నీటి సమస్యలు ఉండవన్న వాదనకు తెరలేపారు.

అయితే నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి మాత్రం, జెసి వాదనతో విబేధించారు. రాయలసీమ లోని నాలుగు జిల్లాలతోపాటు, ప్రకాశం-నెల్లూరు జిల్లాలను కలిపి, గ్రేటర్‌ రాయలసీమగా ఏర్పడితే, దేశంలోనే ధనిక రాష్ట్రం అవుతుందన్న కొత్త వాదనకు తెరలేపారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ రాయలసీమలోనే ఉన్నందున, ఆదాయం కూడా బాగుంటుందన్న కొత్త సూత్రీకరణ చేశారు.

అయితే దివాకరరెడ్డి డిమాండ్‌ను.. రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొట్టిపారేశారు. రాయలసీమ రాష్ట్రం కోసమే ప్రయత్నించాలే తప్ప, రాయల్‌ తెలంగాణ సీమ ప్రజలకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. సీమను విడగొట్టాలని ప్రయత్నిస్తే, తాము ప్రత్యేక రాయమసీమ కోసం ఉద్యమిస్తానని బైరెడ్డి కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బైరెడ్డి.. ఆ పార్టీలో కంటే, రాయలసీమ హక్కుల కోసమే ఎక్కువ పనిచేస్తుండటం విశేషం.

అటు దివాకర్‌రెడ్డి పెట్టిన పొగ తెలంగాణకు తగిలింది. దివాకర్‌రెడ్డి ప్రతిపాదనను తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి కొట్టిపారేశారు. ప్రత్యేక రాయలసీమ, రాయల్‌ తెలంగాణ ఇప్పుడు అసాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోవడమే రాయల్‌ తెలంగాణ డిమాండ్‌కు కారణమని వ్యాఖ్యానించారు. పరిపాలకులను మార్చి, కేసీఆర్‌ నాయకత్వం తెచ్చుకుని సువర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చకోవాలని సలహా ఇచ్చారు.

అయితే ఆంధ్రా ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేయాలే తప్ప, రాయల్‌ తెలంగాణ గురించి ఆలోచించవద్దన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుల వైఫల్యం వల్లే ఈ ఆలోచనలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ పాలనా వైఫల్యమే రాయల తెలంగాణ నినాదమని, తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లోనే రాయల్‌ తెలంగాణ ప్రతిపాదనపై చర్చ జరిగింది. తాము ఆంధ్రా వారితో ఉండలేమని, తమకు తెలంగాణలో కలసి ఉండటమే ఇష్టమని జెసి దివాకర్‌ రెడ్డి అప్పుడే స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్‌ కోదండరాం కూడా సానుకూలంగా స్పందించారు. కోదండరామ్‌ వైఖరితో తెలంగాణ వాదులు ఆగ్రహించి, ఆయనతో విబేధించారు. దానితో ఆయన రాయల్‌ తెలంగాణపై మళ్లీ మౌనం వహించారు. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ రాయల్‌ తెలంగాణ వాదం తెరపైకి రావడం విశేషం.

LEAVE A RESPONSE