Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్ వివేకా హత్యలో సాక్షి యాజమాన్యం భాగం పంచుకుందా?

-వైఎస్ వివేకా హత్యకు అసలు సూత్రధారులు సాక్షి యాజమాన్యమేనా??
-సిబిఐ ని నిష్పక్షపాత విచారణ కోరండి
-అంతేకానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రే క్లీన్ చీట్ ఎలా ఇస్తారా?
-ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు గురించి మాట్లాడడం లేదు
-వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సాక్షి యాజమాన్యమే అసలు సూత్రధారులా?, హత్య లో సాక్షి యాజమాన్యం భాగం పంచుకుందా?, హంతకులకు డబ్బు ఇచ్చింది సాక్షి యాజమాన్యమేనా?? అంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు శర పరంపరగా ప్రశ్నాస్త్రాలను సంధించారు. వైయస్ వివేక హంతకులకు 40 కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పందాన్ని కుదుర్చుకున్నది ఎవరన్నది విచారణకు వస్తుందనే ఇతరులపై నీలాప నిందలు వేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇకనుంచైనా దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని, ప్రజలు మనల్ని అనుమానిస్తారని తాను ఇటీవల చెప్పానని గుర్తు చేశారు. వైఎస్ వివేక హత్యకు సాక్షి యాజమాన్యం సూత్రధారులు కాకపోతే, భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తే హెడ్లైన్ కథనంగా ప్రచురించిన సాక్షి దినపత్రిక, అదే ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే మాత్రం అసలు వార్తే ప్రచురించకపోవడం పత్రికా ధర్మమా? అంటూ సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలు కలిసి హత్య చేశారని వార్తా కథనాలను సాక్షి దినపత్రిక వండి వారుస్తుండగా , రాష్ట్ర ప్రభుత్వమే హత్య కేసును విచారణ చేసినప్పుడు, వారిని అరెస్టు చేయకుండా ఏమి పీకారని నిలదీశారు..

ప్రసాద్ అనే వ్యక్తిని చంపి కేసు క్లోజ్ చేయాలని భావించినట్లుంది
వైయస్ వివేకానంద రెడ్డి పాటు, మరొక వ్యక్తి లచ్చమ్మ కుటుంబం చేతిలో బలికాకుండా డాక్టర్ వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి కాపాడారని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖను తమకు ముందే చూపించి ఉంటే, హత్యగా భావించి రక్తపు మరకలను తుడిచే వారు కాదని నిందితుల తరఫున వకల్తా పుచ్చుకొని సాక్షి దినపత్రిక రాస్తున్న వార్తా కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే విధంగా వార్తా కథనాలను రాశారు. ఇప్పుడు మళ్లీ రాస్తున్నారంటే, కోర్టులోఏదో కథలుచెప్పి నిందితులు, సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు.

వైఎస్ వివేకా రాసిన లేఖ గురించి సాక్షి దినపత్రిక యాజమానులు జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలు ఎందుకు కాకి గోల చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలోనే సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో వైఎస్ వివేక రాసిన లేఖ గురించి వివరంగా చెప్పారు. హత్యకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లేఖ రాశారని ఆయన వ్యక్తిగత సహాయకుడైన కృష్ణారెడ్డి చదివి వినిపించగానే తాను వచ్చేవరకు ఆ లేఖను ఎవరికీ ఇవ్వవద్దని చెప్పానని తన స్టేట్మెంట్లో వెల్లడించారు. డ్రైవర్ ప్రసాద్ అనే వ్యక్తి సౌమ్యుడు. వైఎస్ వివేక శవాన్ని ఇనాయతుల్లా తీసి పంపిన ఫోటోలు చూసిన తర్వాత, వైఎస్ వివేకది క్రూరమైన హత్య అని నిర్ధారణకు వచ్చానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి వద్ద వైఎస్ వివేక రాసిన లేఖను తీసుకున్న రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కు ఒక పేపర్లో పెట్టి వెంటనే అందజేశారు.. ప్రసాద్ అనే వ్యక్తిని చంపివేసి, ఈ కేసును క్లోజ్ చేయాలని హంతకులు, సూత్రధారులు బహుశా పథక రచన చేసి ఉంటారని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

ఆ ఫోటోలు చూస్తే భయం వేస్తుంది
వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత క్రూరంగా హత్య చేసిన తర్వాత తీసిన ఫోటోలను చూస్తే ఎవరికైనా భయం వేస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా రెండు ఫోటోలను మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ఒక ఫోటోలో నుదిటి పైన రెండు గొడ్డలి గాట్లు ఉండగా, మరొక ఫోటోలు వెనక వైపు తల భాగం చితికి పోయి ఉంది. ఈ స్థితిలో శవాన్ని చూసిన తర్వాత బుద్ధి ఉన్నవారు ఎవరైనా హత్యే నని అనుకుంటారు. లేఖ చూసి ఉంటే అంటూ, కల్పించి కల్పించి వార్తలను రాస్తున్నారంటే కుట్రలో భాగస్వాములు ఎవరో అర్థం కావడం లేదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి… ఇది మరో కేసు అవుతుందంతే… ఇప్పటికే తనపై 11 కేసులు ఉన్నాయని, ఇది మరో కేసు అవుతుందంతే అంటూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సజావుగా సాగడం లేదని అభ్యంతరం వ్యక్తం చేసిన డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి తో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటూ రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైఎస్ కుటుంబ సభ్యుల సమావేశంలో, హత్య కేసు విచారణ సజావుగా సాగడం లేదని సునీత తన సోదరుడైన జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ఈ కేసు విచారణ గురించి ఎక్కువగా ఒత్తిడి చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి బిజెపిలో చేరుతారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డి, ఈ సీ సురేందర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి లు ఫలుదపాలుగా కలిశారు. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తో వైయస్ అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలు తనకు రెండు కళ్ళ వంటి వారు అని పేర్కొనడమే కాకుండా, కుటుంబ సభ్యుల సమావేశంలోను అవినాష్ కు మద్దతుగా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సిబిఐ నిష్పక్షపాత విచారణ చేయమని కోరాలే తప్పితే, అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి అనుమానితుడికి క్లీన్ చీట్ ఇవ్వడం ఏమిటనీ ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు అబద్ధపు కథనాలను రాస్తున్న సాక్షి దినపత్రిక, హత్య కేసులో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీ టేక్ రవిల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు కథనాలను రాయడం పరిశీలిస్తే, సాక్షి దినపత్రిక యాజమాన్యం ఆత్మరక్షణలో ఉన్నట్లు స్పష్టమవుతుంది.

జగన్ ఎంతటి క్రూరుడో తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు
జగన్మోహన్ రెడ్డి ఎంతటి క్రూర స్వభావం కలిగిన వ్యక్తో తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని రఘురామకృష్ణంరాజు అన్నారు. తనను లాకప్లో సునీల్ కుమార్ చేత చిత్రహింసలకు గురి చేయించి , ఆ వీడియోని చూసి ఆనందించాడు. పుట్టినరోజు నాడే తనని సిఐడి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రూర స్వభావం గురించి తెలుగుదేశం పార్టీ నాయకుడు బిటెక్ రవి చెప్పినప్పటికీ, తాను స్వయంగా చూశానన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ పిలవక పోవచ్చు. ఒకవేళ పిలిచినా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాక పోవచ్చు. విచారణకు హాజరుకావాలని ఆయన్ని సిబిఐ బ్రతిమాలుతుంది. నాలుగు మంచి మాటలు చెప్పిన తాను రాజ ద్రోహి అయితే, అడ్డగోలు రాతలు రాస్తున్న సాక్షి దినపత్రిక యాజమాన్యం ఏమవుతుంది ?. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ ప్రమేయం ఉన్నట్లుగా తప్పుడు కథనాలను రాస్తున్న సాక్షి దినపత్రిక పై చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి లు పరువు నష్టం దావా వేయాలి. ఇతరులను చట్టాలను గౌరవించాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి, తాను మాత్రం గత నాలుగు ఏళ్లుగా సిబిఐ కోర్టు విచారణకు హాజరు కారు. ఎన్ఐఏ కోర్టు విచారణకు రమ్మంటే రారు. మళ్లీ ఆయనే ఇతరులకు చట్టాలను గౌరవించాలని చెబుతారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

వ్యక్తిగా జగన్ గురించి మాట్లాడుతున్నాను
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి, తమ పార్టీ అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రెడ్డి గురించి తాను మాట్లాడడం లేదని, ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి గురించి ఏమైనా మాట్లాడితే రాజా ద్రోహం కేసు పెడతారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శించను. పత్రికను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు తదితరులపై వైఎస్ వివేక హత్యకు కుట్ర చేశారని అభియోగం మోపడాన్ని నిరసి స్తున్నాను.
ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తుంది కాబట్టే తప్పని అంటున్నాను. వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు ఈ కేసులో నిందితులంతా ఒక్కొక్కరూ ఒక్కొక్క శృంగార కథలు చెప్పారు. అయినా ఆ శృంగార కథలతో ఈ కేసుకు సంబంధం ఏమిటి?. వైఎస్ వివేక హత్య అనంతరం లచ్చమ్మ కుటుంబ సభ్యులు శవానికి కుట్లు వేసి, కట్లు ఎందుకు కట్టినట్లు. వైఎస్ వివేకానంద రెడ్డి అరెస్టుకు ఈరోజు కు సిబిఐ కి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు.

రేపు హైకోర్టులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వకపోవచ్చు. అవినాష్ రెడ్డి అరెస్టుపై సిబిఐ అభిప్రాయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుందని ధర్మాసనమే అభిప్రాయపడింది. అరెస్టు చేస్తామని ఉడత ఊపులు ఊపిన సిబిఐ, ముందస్తు బెయిల్ పై హైకోర్టు స్టే ఇచ్చే వరకు వేచి చూసింది. ఇక సాక్షి దినపత్రిక చెప్పినట్లుగా, అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందని వారికి ఎవరైనా చెప్పి ఉంటారేమోనని రఘు రామకృష్ణంరాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE