దేశమంటే మట్టికాదోయ్..
దేశమంటే మనుషులోయ్..!
మరి ఆ మనుషుల్లో
చాగంటి లేరా..
సొంత లాభం
కొంత మానుకుని పొరుగువాడికి
తోడుపడవోయ్..
చాగంటి దీనికి భిన్నంగా
వ్యవహరిస్తున్నారా..
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా..
చాగంటి ప్రేమించడం లేదా..
పెంచడం లేదా..
కొన్ని కర్మలను మార్చుకోమని చెప్పారేమో గురజాడ..
హిందూ ధర్మమే వద్దని అన్నట్టు వినలేదే..!?
వ్యవస్థలపై తిరుగుబాటు చేశారే గాని వ్యక్తులను కించపరచిన సందర్భం లేదే..!?
అసలు..గురజాడ ఏమన్నారు..
పూను స్పర్ధను విద్యలందే..
వైరములు వాణిజ్యమందే..
వ్యర్ధకలహం పెంచబోకోయ్..
ఇది గురజాడ స్ఫూర్తి..
ఇప్పుడు జరుగుతున్నది
అందుకు విరుద్ధం కాదా..!?
చెట్టాపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్..
అన్నదమ్ముల వలె
మెలగవలెనోయ్..!
జరుగుతున్న గొడవ..
తన పేర రాజుకున్న నిప్పు..
ఎవరిది తప్పో..
ఎవరిది ఒప్పో..
ఇదంతా అప్పారావుకు ఒప్పేనా..
ఇలాంటివి
ఆయనకు నప్పేనా..!
అయిందేదో అయింది..
ఎవరు చెప్పినా..
ఏం చేసినా సమాజహితం
కోసమే..ఈ పుణ్యభూమి
ఎంతో కాలంగా..
ఎన్నాళ్ళ నుంచో
అనుసరించి చూపిన
ధర్మమార్గాన్నే ప్రవచించడమే
గాక ఆచరించి చూపిస్తున్న
విలక్షణమూర్తికి ఇప్పుడిలా
వివాదం ఆపాదించడం తగునా..!?
మాట వరసకు అనుకుందాం
ఇదే పురస్కారాన్ని ముఖ్యంత్రికో..
జిల్లా మంత్రికో..
ఇంకో ప్రముఖ రాజకీయ నాయకుడికో
ప్రకటించి ఉంటే
ఇంత యాగీ జరిగేదా..!?
భావజాలాలు విరుద్ధమైనవని ఎవరికి వారే అనేస్తున్నారు..చాగంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి
తనదైన శైలిలో ధర్మప్రచారాన్నే చేస్తున్నారు గాని గురజాడ భావాలకు తాను వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదే..నిజానికి
సభల నిర్వాహకులలో చాలామటుకు ఏదో ఒక అంశం పేర్కొని దానిపై మాటాడమని అడిగితే అదే అంశంపై మాట్లాడతారు చాగంటి అనే కాదు
ఏ ప్రవచనకర్తయినా..
ఎవరైనా గాని మంచినే ప్రబోధిస్తారు..
సమాజం మంచి దారిలో నడవాలనే ఆకాంక్షిస్తారు..
అదే గనక చాగంటి వారిని
గురజాడ గురించో..ఆయన వ్యతిరేకించిన కన్యాశుల్కం గురించో మాటాడమంటే
మనలో చాలా మంది కంటే ధాటిగా మాటాడగలరు.
తనకు గురజాడ అంటే అంతులేని గౌరవమని కోటేశ్వరరావు చెప్పి ఉన్నారు.అదో అర్హత కాదా!
గురజాడ భావజాలాన్ని ఆయన గౌరవిస్తున్నట్టే కదా!!
ఇప్పటికే విజయనగరం గౌరవానికి భంగం ఏర్పడింది..సామాజిక వేదికల్లో రకరకాల కథనాలతో కూడిన ప్రచారాలు పెరిగిపోతున్నాయి..
“వివాదంలో చాగంటి..”
ఇదీ శీర్షిక..అవసరమా ఇదంతా..అందులో చాగంటి వంటి విశిష్ట వ్యక్తి చుట్టూ ఇలాంటి కథనాలు అల్లడం సమంజసమా.. ఆయనకేంటి సంబంధం..”ఆయన తిరస్కరించి ఉండవచ్చు కదా”..ఇదో రకం వితండం..!
విజయనగరం వంటి
గొప్ప ప్రాంతం..
గజపతుల రాజ్యం..
ఎందరో విశిష్ట కళాకారులు..రచయితలు నడయాడిన భూమి..పరాకాష్టగా మహాకవి గురజాడ ప్రశస్తికి వేదికగా నిలిచిన ప్రదేశం..కన్యాశుల్కం వంటి మహా గ్రంధం ఊపిరిపోసుకున్న గడ్డ..
ఆ మహాకవి పేరిట ప్రదానం చేస్తున్న పురస్కారమంటే
తిరస్కారం అనే వారు ఎవరుంటారు..నిజంగా అలా తిరస్కరించి ఉంటే అది మహాకవికే అవమానం కాదా..!?
అందరూ ఆలోచించి
కార్యక్రమాన్ని మహాకవి ప్రతిష్టకు.. విద్యలనగరం
గౌరవానికి భంగం ఏర్పడకుండా నిరాటంకంగా పూర్తి చేసి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్న విలక్షణ వ్యక్తిని సకలమర్యాదలతో సాగనంపడం సముచితం..!
అతిధి దేవోభవ..
అదే మన తక్షణ కర్తవ్యం..
అప్పుడే అంతా సవ్యం..!
సురేష్ కుమార్ ఇ
జర్నలిస్ట్
9948546286