Suryaa.co.in

Andhra Pradesh

గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెడతా

– ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోండి
– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– సచివాలయంలో ముఖ్యమంత్రికి అధికారుల శుభాకాంక్షలు

అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సిఎం….కొద్ది సేపు వారితో మాట్లాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “1995లో నేను మొదటి సారి సీఎం అయ్యాను. నాడు నాతో పని చేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. నాలుగో సారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేడు చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలు. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుండి నియామకం అవుతారు.

ఇక్కడున్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారు. కానీ గత ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. డిపార్ట్ మెంట్ లన్నీ నిస్తేజం అయ్యాయి. సిస్టమ్స్ అన్నీ నిర్వీర్యం అయ్యాయి. గత ప్రభుత్వంపై ఎప్పుడూ చూడనంత ఫ్రస్టేషన్, కసి ప్రజల్లో వచ్చిందంటే కారణం ఐదేళ్లలో జరిగిన దారుణాలే. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకే ఎవరైనా పని చేయాల్సి ఉంటుంది.

నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటం లేదు….ఎప్పుడూ మాట్లాడను కూడా. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే నా బాధ. పరిపాలన గాడిలోపెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. త్వరలో మళ్లీ అందరితో మాట్లాడతా…పాలనను చక్కదిద్దుతా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు

LEAVE A RESPONSE