Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులు ఛీకొడుతున్నారు ఇక సజ్జలను ఇంటికి పంపించండి

– ముఖ్యమంత్రి జగన్ కు నవతరంపార్టీ బహిరంగ లేఖ

ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోకుండా ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఇంటికి పంపించాలని, ఆయన స్థానంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు సలహాదారులుగా అవకాశం కల్పించాలని,తద్వారా పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సూచించారు.

విజయవాడలో జరిగిన ఉద్యోగుల ర్యాలీ విజయవంతం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని పీఆర్సీ జీవోలు రద్దుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమ్మె సైరన్ రాష్ట్రంలో ప్రజలకు భయం కలిగించింది అని,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని, సమ్మెను ఆపాలని అన్నారు. వేతన సవరణ సంఘం ఉద్యోగుల మేలుకోసం పని చేయాలని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి వల్ల జీవోలు ప్రక్కదారి పడుతున్నాయి అన్నారు.

ఉద్యోగుల ఉద్యమం ఉవ్వెత్తున జరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణం అన్నారు.ఇప్పటికీ ముఖ్యమంత్రి చర్చించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని ఆదిశగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు చేయాలని రావు సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ వ్రాసారు.

LEAVE A RESPONSE